బీహార్ సీఎం నితీష్ కు బిగ్ షాక్.. మంత్రిపదవికి కార్తీక్ కుమార్ రిజైన్
Publish Date:Sep 1, 2022
Advertisement
ప్రభుత్వం ఏర్పాటు చేసి మంత్రివర్గ కూర్పు పూర్తి చేసి ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న బీహార్ సీఎం నితీష్ కుమార్ కు అంతలోనే బిగ్ షాక్ తగిలింది. ఆయన కేబినెట్ నుంచి ఆర్జేడీకి చెందిన కార్తీక్ కుమార్ రిజైన్ చేశారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేతో తెగతెంపులు చేసుకుని ఆర్జేడీతో పొత్తు పెట్టుకుని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నితీష్ కుమార్ ఆర్జేడీకి చెందిన కార్తిక్ కుమార్ కు న్యాయశాఖ మంత్రి పదవి ఇచ్చారు. అయితే ఆయనపై కిడ్నాప్ కేసు నమోదై ఉండటంతో నితీష్ పై విమర్శలు వెల్లువెత్తాయి. న్యాయశాఖ మంత్రిగా కార్తిక్ కుమార్ తనపై కేసు విచారణను ప్రభావితం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే నితీష్ కుమార్ కార్తిక్ కుమార్ మంత్రిత్వ శాఖ మార్చారు. పెద్దగా ప్రాధాన్యత లేని చెరకు మంత్రిత్వ శాఖ ఇచ్చారు. దీంతో ఆయన అలకపాన్పు ఎక్కారు. శాఖ మార్చిన వెంటనే ఆయన రాజీనామాకు సిద్ధమయ్యారు. చెరకు మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన గంటల వ్యవధిలోనే మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆయన తన రాజీనామా లేఖను నేరుగా గవర్నర్ కే పంపారు. ఆయన దానిని వెంటనే ఆమోదించారు. 2014లో జరిగిన ఒక కిడ్నాప్ కేసులో నిందితుడిగా ఉన్న కార్తీక్ కుమార్ పై ప్రస్తుతం కేసు నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే న్యాయశాఖ మంత్రిగా ఆయనను కొనసాగించడం భావ్యం కాదని తలచిన నితీష్ కుమార్ ఆయన శాఖను మార్చారు. మామూలుగా చూస్తే ఇది సాధారణమే అనిపిస్తుంది కానీ బీహార్ లో సామాజిక సమీకరణాలను పరిగణనలోనికి తీసుకుంటే కార్తీక్ కుమార్ రాజీనామా సీఎం నితీష్ కుమార్ కు బిగ్ షాక్ అనే చెప్పాలి. ఎందుకంటే బీహార్ లో రాజకీయంగా శక్తిమంతమైన భూమిహార్లకు చెందిన కార్తీక్ కుమార్ నితీష్ పై అలకపూనడం ఆర్జేడీ, జేడీయూ బంధంపై అంటే పొత్తుపై ప్రభావం చూపే అవకాశాలున్నాయని అంటున్నారు. ఈ పరిస్థితిని అవకాశంగా తీసుకుని బీజేపీ కార్తి కుమార్ పై ఆపరేషన్ ఆకర్ష్ ప్రయోగించే అవకాశం లేకపోలేదంటున్నారు. ఆయనతో పాటుగా మహాఘట్ బంధన్ కూటమిలో మంత్రి పదవులు దక్కక అసంతృప్తి వ్యక్తం చేస్తున్న వారిపైనా బీజేపీ దృష్టి సారిస్తే నితీష్ కుమార్ కు చిక్కువు తప్పకపోవచ్చని విశ్లేషిస్తున్నారు.
http://www.teluguone.com/news/content/kartik-kumar-resigns-fron-nitesh-kumat-cabinet-25-143029.html





