ప్రియుడి కోటీశ్వరుడని నమ్మి కన్నబిడ్డను చంపిన తల్లి.. ప్రియుడి ఘరానా మోసం!
Publish Date:Jun 12, 2026
Advertisement
వ్యామోహంలో పడి సర్వస్వం కోల్పోయిన మహిళా న్యాయవాది.. బెంగళూరు నగరంలో మానవత్వాన్ని మంటగలిపే ఒక దారుణమైన ఘటన వెలుగుచూసింది. పరాయి పురుషుడితో ఏర్పడిన అక్రమ సంబంధం కోసం, ఒక కన్నతల్లి తన ఐదేళ్ల చిన్నారిని అత్యంత అమానుషంగా హతమార్చింది. ప్రియుడితో కలిసి జీవించడానికి తన కుమార్తె అడ్డుగా ఉందన్న క్రూరమైన ఆలోచనతోనే ఈ ఘాతుకానికి ఒడిగట్టినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసులో చాకచక్యంగా దర్యాప్తు చేపట్టిన బెంగళూరు పోలీసులు పరారీలో ఉన్న నిందితురాలిని ఎట్టకేలకు గురువారం కర్ణాటకలోని హాసనలో అరెస్ట్ చేశారు. దావణగెరె ప్రాంతానికి చెందిన ప్రవీణ్, ప్రియాంక అనే దంపతులకు 15 ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రవీణ్ ఒక ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తుండగా, భార్య ప్రియాంక న్యాయవాది (అడ్వకేట్)గా ప్రాక్టీస్ చేస్తోంది. వీరికి 11 సంవత్సరాల కుమారుడు, ఐదేళ్ల వయసున్న వెన్నెల అనే కుమార్తె ఉన్నారు. ప్రశాంతంగా సాగుతున్న వీరి కుటుంబ జీవితంలోకి ప్రియాంక పాత స్నేహితుడు మోహన్ ప్రవేశించడంతో కథ అడ్డం తిరిగింది. ప్రియాంక చిన్ననాటి స్నేహితుడైన మోహన్, తాను పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారినని, కోటీశ్వరుడినని ఆమెను నమ్మించాడు. వీరిద్దరి మధ్య క్రమంగా పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ వ్యవహారంపై భర్త ప్రవీణ్ తీవ్రంగా హెచ్చరించినప్పటికీ ప్రియాంక ప్రవర్తనలో మార్పు రాలేదు. పైగా భర్తకు విడాకుల నోటీసులు పంపి, తన చిన్నారి కుమార్తె వెన్నెలను తీసుకుని మోహన్‌తో కలిసి సహజీవనం చేయడం ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రియుడితో పూర్తిస్థాయిలో కలిసి ఉండటానికి ఐదేళ్ల వెన్నెల అడ్డుగా మారిందని భావించిన ప్రియాంక, ఆ పాపను గొంతునులిమి చంపేసింది. ఆపై ఆసుపత్రి నుంచి మరణ ధ్రువీకరణ పత్రాలు పొంది, పాప అనారోగ్యంతో చనిపోయిందంటూ నమ్మబలికి అంత్యక్రియలు కూడా కానిచ్చేసింది. అయితే ఆమె పంపిన పోస్ట్‌మార్టం నివేదికపై భర్త ప్రవీణ్‌కు అనుమానం రావడంతో, దానిని విదేశాల్లో ఉన్న తన వైద్యుడైన స్నేహితుడికి పంపించి పరిశీలించాడు. ఆ నివేదికలో లోపాలున్నాయని తేలడంతో ప్రవీణ్ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు రంగంలోకి దిగి లోతుగా దర్యాప్తు చేయడంతో అసలు నిజం బయటపడింది. తల్లి ప్రియాంకనే స్వయంగా గొంతునులిమి పాపను చంపినట్లు పోస్ట్‌మార్టం ఫోరెన్సిక్ విశ్లేషణలో రుజువైంది. పోలీసులు మొదట ప్రియుడు మోహన్‌ను అదుపులోకి తీసుకోగా, ప్రియాంక మాత్రం అప్పటి నుంచి పరారైంది. తాజాగా హాసన ప్రాంతంలో దాక్కున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు ఆమెను చుట్టుముట్టి అరెస్ట్ చేసి బెంగళూరుకు తరలించారు. ఈ దారుణ ఘటనపై సోషల్ మీడియా వేదికగా నెటిజన్లు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకుని, సమాజంలో చట్టాల గురించి తెలిసిన ఒక మహిళా లాయర్.. అక్రమ బంధం కోసం కన్నకూతురినే చంపడం దారుణమని మండిపడుతున్నారు. మోహన్ పెద్ద కోటీశ్వరుడు కాదని, కేవలం అద్దె ఇళ్లకు బ్రోకరేజ్ చేసుకునే సాధారణ వ్యక్తి అని తెలిసినా ఆమె గుడ్డిగా నమ్మి సంసారాన్ని కూల్చుకుందని పోలీసులు పేర్కొన్నారు. నిందితులిద్దరిపై కఠిన చట్టాల కింద విచారణ జరిపి కోర్టు ద్వారా కఠిన శిక్ష పడేలా చూస్తామని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
http://www.teluguone.com/news/content/karnataka-crime-news-36-222750.html





