విశాఖలో టీడీపీ, వైసీపీ నేతల ప్రమాణాల సవాళ్లు.. పరిస్థితి ఉద్రిక్తం
Publish Date:Dec 26, 2020
Advertisement
ఏపీలో వైసీపీ, టీడీపీ నేతల మధ్య పరస్పర అవినీతి ఆరోపణలు.. ఆ తర్వాత ప్రముఖ ఆలయాలలో నేతల ప్రమాణాలతో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం అనపర్తి వైసీపీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే.. టీడీపీ నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకుని తర్వాత బిక్కవోలు వినాయకుడి గుడిలో ప్రమాణాలు చేయాలంటూ సవాళ్లు, ప్రతి సవాళ్లు విసురుకున్నారు. అంతేకాకుండా ఏకంగా గుడిలో ప్రమాణం చేసే సమయంలో కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొన్న సంగతి తెల్సిందే. తాజాగా ఏపీలో వైసీపీ, టీడీపీలు నేతల మధ్య మరోసారి ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. విశాఖపట్నం నగరంలో గత టీడీపీ ప్రభుత్వ హయాంలో భూ కబ్జాలు జరిగాయని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. దీంతో గత మూడు రోజులుగా టీడీపీ, వైసీపీ నేతల మధ్య ప్రమాణాల సవాళ్లు నడుస్తున్నాయి. భూ అక్రమాలకు పాల్పడ్డారని తనపై వైసీపీ నాయకులు చేస్తున్న ఆరోపణల పై విశాఖ తూర్పు టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు తీవ్రంగా స్పందిస్తూ.. దమ్ముంటే సాయిబాబా గుడిలో ప్రమాణం చేయాలని విజయసాయిరెడ్డికి సవాలు విసిరారు. అయితే విజయసాయి తరుఫున తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ విజయనిర్మల సిద్ధమయ్యారు. రెండు పార్టీల నాయకుల తాజా ప్రమాణాల సవాళ్లతో విశాఖ పోలీసులు అప్రమత్తమయ్యారు. దీంతో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మరోపక్క నాయకులు ప్రమాణాలు చేయడానికి సిద్దమైన ఈస్ట్ పాయింట్ కాలనీ లో ఉన్న సాయిబాబా గుడి వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు ఆఫీసు వద్ద వైసీపీ నేతలు చేసిన ధర్నాలో పోలీసులపై కూడా దాడి జరిగిన నేపథ్యంలో.. ఈ సవాళ్ల వ్యవహారంలో ఎప్పుడు ఏం జరుగుతుందో అని సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
http://www.teluguone.com/news/content/challenge-between-tdp-and-ycp-39-108151.html





