మంత్రి కాకాణి ఫైల్స్ చోరీ.. కోర్టులో దొంగలు.. అనిల్‌పై అనుమానాలు?
Publish Date:Apr 15, 2022
Advertisement
నెల్లూరు కోర్టులో దొంగలు పడ్డారు. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి సంబంధించిన కీలక కేసు పత్రాలు అపహరించారు. విషయాన్ని గుర్తించిన కోర్టు సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగు చూసింది. ఈ కేసుకు సంబంధించిన పత్రాలు, స్టాంపులు, ఇతర పరికరాలున్న సంచి అపహరణకు గురైనట్లు కోర్టు బెంచి క్లర్కు స్థానిక చిన్నబజారు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నెల్లూరు కోర్టు సముదాయంలోని 4వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో ఈ కీలక కేసులో పత్రాలు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకుపోయారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నెల్లూరు జిల్లా సర్వేపల్లి ఎమ్మెల్యే, ప్రస్తుత వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి 2017లో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై పలు విమర్శలు చేశారు. సోమిరెడ్డికి విదేశాల్లో కోట్లాది రూపాయల విలువైన ఆస్తులున్నాయని ఆరోపించారు. అందుకు రుజువులుగా వివిధ పత్రాలు చూపించి, హవాలాకు పాల్పడ్డారని ఆరోపించారు. తప్పుడు పత్రాలు చూపించి తనపై బురద జల్లుతున్నారంటూ కాకాణి గోవర్ధన్ రెడ్డితో పాటు మరికొందరిపైన సోమిరెడ్డి నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కాకాణిపై పరువునష్టం దావా కూడా దాఖలు చేశారు. ఈ కేసు 1వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణలో ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేసి, కాకాణి బయటపెట్టిన పత్రాలు నకిలీవని గుర్తించి చార్జిషీట్ దాఖలు చేశారు. ఈ కేసులో కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఏ 1గా, చిత్తూరు జిల్లాకు చెందిన పసుపులేటి చిరంజీవి అలియాస్ మణిమోహన్ ను ఏ 2గా పేర్కొన్నారు. కోర్టు తాళాలు పగలగొట్టి ఎత్తుకెళ్లిన వాటిలో కొన్ని డాక్యుమెంట్లు కోర్టు ప్రాంగణంలోనే పడేశారు. పోలీసులు ఆ పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటిని కాకాణి గోవర్ధన్ రెడ్డిపై టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గతంలో పెట్టిన ఫోర్జరీ కేసుకు సంబంధించిన పత్రాలుగా గుర్తించారు. ప్రస్తుతం పోలీసులకు లభ్యమైన పత్రాలు చిరంజీవికి చెందినవని గుర్తించినట్లు తెలుస్తోంది. ఈ చోరీ విషయం కోర్టుతో పాటు కీలక కేసుతో సంబంధం ఉండటంతో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. కాగా.. కాకాణి మంత్రి అయి నెల్లూరు జిల్లాకు వచ్చే ముందు ఇలా జరగడంతో పలు అనుమానాలకు దారి తీసింది. కాకాణిని రాజకీయంగా ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో ఎవరైనా చేయించారా అనే అనుమానాలు లేకపోలేదు. మాజీమంత్రి అనిల్‌కుమార్ పైనే డౌట్ వ్యక్తం చేస్తున్నారు. ఆయనే ఇలా చేయించి ఉంటారని ఆరోపిస్తున్నారు. కావాలనే కాకాణిని ఇరికించాలనే కోర్టులో దొంగతనం జరిగిందని అంటున్నారు. ఈ సమయంలో కాకాణి కావాలని ఇలాంటి పని చేయిస్తారా అనే సందేహం వ్యక్తం అవుతోంది. ఏదేమైనా పోలీసుల విచారణలో పూర్తి నిజాలు తెలియాలి.
http://www.teluguone.com/news/content/kakani-files-theft-in-nellore-court-39-134427.html





