గవర్నర్లు అవసరమా?.. 'జైభీం' జస్టిస్ చంద్రు సంచలనం..
Publish Date:Apr 25, 2022
Advertisement
దేశంలో తీవ్ర వివాదాస్పద వ్యవస్థ ఏదైనా ఉందా అంటే అది గవర్నర్ సిస్టమే అనే విమర్శ ఎప్పటినుంచో ఉంది. ఇటీవల గవర్నర్ గిరిపై మరింత మంట రాజుకుంది. రాజ్‌భవన్ సాయంతో రాష్ట్రాలను కేంద్రం కార్నర్ చేస్తోందంటూ అనేక ఆరోపణలు. తెలంగాణ, తమిళనాడు, బెంగాల్‌లాంటి చోట్ల ఓ మోస్తారు యుద్ధమే నడుస్తోంది. ఎత్తుకుపైఎత్తులతో రాజ్యాంగ సంక్షోభం దిశగా పయణిస్తున్నారు. అందుకే, ఈ పరిణామాలపై నిపుణులు, న్యాయ కోవిదులు మండిపడుతున్నారు. తాజాగా, జైభీం ఫేం జస్టిస్ చంద్రూ సైతం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసలు దేశానికి గవర్నర్ పదవులు అవసరమే లేదంటూ సంచలనంగా నిలిచారు. జస్టిస్ చంద్రూ. మానవ హక్కులు, రాజ్యాంగ హక్కుల కోసం దశాబ్దాల పాటూ పోరాడిన న్యాయ కోవిదుడు. లాయర్‌గా, మద్రాస్ హైకోర్టు జడ్జిగా ఆయన జీవితమంతా ప్రజాస్వామ్య పరిరక్షణ, అణగారిన వర్గాల కోసమే కొనసాగింది. ఆయన చేసిన ఓ న్యాయపోరాట ఇతివృత్తమే జైభీం సినిమా. ఆ మూవీ సూపర్‌హిట్‌తో తమిళనాడుకు చెందిన జస్టిస్ చంద్రు.. తెలుగునాట కూడా ఫెమిలియర్ అయ్యారు. అందుకే, లేటెస్ట్‌గా గవర్నర్ పదవులు అనవసరమైనవంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లోనూ చర్చ జరుగుతోంది. నిజమే కావొచ్చు. గవర్నర్ వ్యవస్థ మొదటినుంచీ విమర్శలకు కేంద్రంగా నిలుస్తోంది. ఇటీవల ఆ పోకడ మరింత పెరిగింది. కేసీఆర్ వర్సెస్ తమిళిసై ఎపిసోడ్ అంతా గమనిస్తూనే ఉన్నారు. స్కూల్ పిల్లలు కొట్లాడుకున్నట్టు.. ఆ ఇద్దరు ప్రముఖులు పదే పదే గిల్లికజ్జాలు పెట్టుకుంటూ వారి హోదాలకు ఉన్న స్థాయిని దిగజారుస్తున్నారని తప్పుబడుతున్నారు. ఆయా విషయాల్లో కేసీఆర్, తమిళిసై ఇద్దరిదీ మొండివైఖరే అంటున్నారు. కౌశిక్‌రెడ్డి ఎపిసోడ్, రిపబ్లిక్ డే ఈవెంట్, ఉగాది విందు, ప్రోటోకాల్ రచ్చ, ప్రభుత్వాన్ని పడగొడతానంటూ వ్యాఖ్యలు, నేరుగా ప్రజలతో సంబంధాలు, బీజేపీ నేత అంటూ విమర్శలు.. ఇలా అనేకానేక అంశాలతో కేసీఆర్, తమిళిసై ఇద్దరూ తగ్గేదేలే అంటూ తెగేవరకూ లాగుతున్నారు. అటు, తమిళనాడులోనూ ఇలాంటి పరిస్థితే. అక్కడి స్టాలిన్ ప్రభుత్వం నీట్‌కు వ్యతిరేకంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి.. గవర్నర్ ఆమోదం కోసం పంపితే.. ఆ బిల్లును 3 నెలల పాటు తొక్కిపెట్టింది రాజ్‌భవన్. ఆ తర్వాత తీరిగ్గా.. రిజెక్టెడ్ అంటూ వెనక్కి పంపించేశారు. ఈ పరిణామంపైనే జస్టిస్ చంద్రు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేశంలో గవర్నర్లు అవసరమా? ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదా? అని ఆయన ప్రశ్నించారు. గవర్నర్లు భారత రాజ్యాంగానికి వ్యతిరేకంగా, తాము అనుకున్నట్టుగానే ఫాసిస్ట్ ధోరణులతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. న్యాయశాస్త్రం చదివే విద్యార్థులు, అధ్యాపకులు కోర్టు తీర్పులను విమర్శించాలన్నారు. అపుడే ప్రజాస్వామ్యం పరిరక్షించబడుతుందని జస్టిస్ చంద్రూ సంచలన కామెంట్లు చేశారు. రాజ్యాంగ వ్యవస్థల మధ్య ఘర్షణ ఆ వ్యవస్థలు మరింత మెరుగ్గా, పటిష్టంగా పని చేయడానికి దోహదపడాలి. అప్పుడే ప్రజాస్వామ్యం పరిఢ విల్లుతుంది. కానీ ఆ ఘర్షణ రాజకీయ ప్రయోజనాల కోసం అయితే మాత్రం ఆ వ్యవస్థలు భ్రష్టు పట్టడం తప్ప మరో ప్రయోజనం ఉండదు. కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉంటే ఆ రాష్ట్రాలు, రాజ్ భవన్ మధ్య సంబంధాలు స్మూత్ గానే ఉంటున్నాయి. కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పని చేసే పార్టీ అధికారంలో ఉన్నరాష్ట్రాలలో మాత్రమే ప్రభుత్వాలకు రాజ్ భవన్ తో పొసగని పరిస్థితులు ఉండటాన్ని రాజకీయ కోణంలో చూడక తప్పదు. ఏపీలో బీజేపీతో జగన్ సర్కారు అంటకాగుతుండటం వల్లే.. బీజేపీయేతర ప్రభుత్వం ఉన్నా ఆంధ్రప్రదేశ్‌లో ఎలాంటి వివాదమూ లేదనే విషయం తెలిసిందే. అలాగని.. గవర్నర్లకు ఏవైనా సూపర్ పవర్స్ ఉంటాయా? అంటే అదీ లేదు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు ఏకపక్షంగా వెళ్లకుండా ఉండేలా చూసేందుకే గవర్నర్ వ్యవస్థ. అంతేగానీ, అన్నిట్లోనూ జోక్యం చేసుకుంటామంటే కుదరదు. ప్రభుత్వాలు సైతం రాజ్యాంగ నిబంధనల పరిధి దాటి.. తమకు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తామంటే సాధ్యం కాదు. కౌశిక్‌రెడ్డి విషయమే తీసుకుంటే.. నిబంధనల ప్రకారం ఆయన సామాజిక సేవ చేసిన వారి కోటాలో ఎమ్మెల్సీగా నియామకానికి అనర్హుడనే అంటున్నారు. అందుకే, తమిళిసై.. కౌశిక్‌రెడ్డికి చెక్ పెట్టారని చెబుతారు. దీంతో, కేసీఆర్ ఇగో హర్ట్ అయింది. అప్పటి నుంచీ జగడం మరింత ముదిరింది. రాజ్‌భవన్‌లో ప్రజా సమస్యలు వినడం, గిరిజన గూడేలకు నేరుగా నిధులు మంజూరు చేయడం, అధికారులను పిలిపించుకొని సమీక్షలు చేయడం.. కేసీఆర్ సర్కారు సైతం గవర్నర్‌ను బయ్‌కాట్ చేస్తుండటం.. అలా అలా అగ్గి రాజుకుంది. గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త బెటర్ అనేవాళ్లూ ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అప్పటి టీడీపీ ప్రభుత్వాన్ని, సీఎం ఎన్టీఆర్‌ను.. గవర్నర్ రాంలాల్ ఎంతగా ఇబ్బంది పెట్టారో గుర్తు చేస్తున్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా ఎన్టీఆర్ సర్కారును కూల్చిన చీకటి చరిత్ర రాజ్‌భవన్‌ది. ఆ తర్వాత ఎన్టీఆర్ జాతీయ స్థాయిలో పోరాడి.. రాజ్‌భవన్ ఆగడాలకు అడ్డుకట్ట వేశారు. గవర్నర్ల వ్యవస్థ రద్దు కోసమూ గట్టి ప్రయత్నమే చేశారు. తాజాగా, జస్టిస్ చంద్రు సైతం ఆ తరహా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరం. జస్టిస్ చంద్రూ ప్రశ్నించినట్టు.. దేశంలో గవర్నర్లు అవసరమా? అనే అంశంపై విస్తృత చర్చ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందని అంటున్నారు నిపుణులు.
http://www.teluguone.com/news/content/justice-chandru-comments-on-governor-system-39-134936.html





