జూడా సమ్మె తప్పెవరిది?
Publish Date:May 26, 2021
Advertisement
నిజమే, రాష్ట్రమే కాదు మొత్తంగా దేశమే కరోనా మహామ్మారితో పోరాటం చేస్తున్న సమయంలో, జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడం సమంజసం కాదు. కానీ, అదే సమయంలో ఇలాంటి సమయంలో అయినా జూనియర్ డాక్టర్ల డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోకపోవడం, అసలే సమంజసం కాదు. ఒక విధంగా అది అధికారుల అపరాధం. నిజానికి, కరోనాపై డాక్టర్లు (వాళ్ళు జూనియర్లే అయినా సీనియర్లే అయినా), వైద్య సిబ్బంది, నర్సులు ప్రాణాలు పణంగా పెట్టి పోరాటం చేస్తున్నారు.డాక్టర్లే కాదు ఫ్రంట్లైన్ వారియర్స్’ అందరూ కూడా కొవిడ్ రోగులకు అందిస్తున్న సేవలకు విలువ కట్టడం అయ్యే పనికాదు. అలాంటిది ఇచ్చిన హామీని నెలలు గడచినా అమలు చేయక పోవడం అపరాధం మాత్రమే కాదు .. అందకు మించిన తప్పిదం, మహాపరాధం. మాట ఇవ్వడం, ఇచ్చిన మాట తప్పడం పాలకులకు కొత్త కాదు. పాలకులు అందరికీ అది అలవాటే, ఈ విషయంలో కేసీఆర్ మినహాయింపు కాదు. నిజం చెప్పాలంటే, ఆడిన మాట తప్పడంలో ఆయన అందరికంటే నాలుగు ఆకులు ఎక్కువే చదివారు.అయితే, ఆ వివరాలలోకి వెళ్లేందుకు ఇది సమయం కాదు. కానీ, ఇప్పటికైనా ముఖ్యమంత్రి, జూనియర్ డాక్టర్ల సేవలను గుర్తించి ఇచ్చిన మాట ప్రకారం పెంచుతామన్న 15 శాతం గౌరవ వేతనం తక్షణమే పెంచడంతో పాటుగా జూనియర్ డాక్టర్ల న్యాయపరమైన సమస్యలను పరిష్కరించమని అధికారులను ఆదేశించడం స్వాగతించదగిన పరిణామం. అయితే, జూనియర్ డాక్టర్లు ఎదో తప్పు చేశారనే బావనతో వారి పై ఆగ్రహం వ్యక్తం చేయడం మాత్రం సరికాదు,సమంజసం కాదు. ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వల్లనే జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. సమ్మెకు దిగారు కాబట్టే, సమస్య మక్యమంత్రి దృష్టికి మళ్ళీ వెళ్ళింది .. ఆయన జూనియర్ డాక్టర్ల సమస్యలను వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు బంతి అధికారుల కోర్టులో వుంది.
http://www.teluguone.com/news/content/junior-doctors-strike-in-telangana-39-116311.html





