భారత్ లోనే బ్లాక్ ఫంగస్ డేంజర్! మన వైద్య చికిత్సలోనే లోపమా?
Publish Date:May 26, 2021
Advertisement
కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అల్లకల్లోలం చేస్తోంది. కరోనా వైరస్ తో రోజూ వేలాది మంది చనిపోతున్నారు. లక్షలాది మంది మృతువు అంచు వరకు వెళ్లి బతికి బట్టకడుతున్నారు. కరోనాను జయించిన ఆనందం వాళ్లలో ఉండటం లేదు. బ్లాక్ ఫంగస్ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. కరోనా నుంచి కోలుకున్న వారే ఎక్కువగా ఈ వ్యాధి భారీన పడుతున్నారు. దేశంలోని చాలా రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగస్ ఉధృతి పెరిగిపోతోంది. తెలుగు రాష్ట్రాలతోపాటు మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో ఈ బ్లాక్ ఫంగస్ కేసులు బాగా వెలుగు చూశాయి. తాజాగా కర్ణాటకలో ఈ ఫంగస్ కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. కరోనా నుంచి కోలుకొని హమ్మయ్య అని ఊపిరి పీల్చుకునే సమయంలో పేషెంట్లపై ఈ బ్లాక్ ఫంగస్ దాడి చేస్తోంది. ఇంతకు ముందు కూడా దేశంలో ఈ ఫంగస్ వ్యాధి ఉంది. కానీ ఇంతలా కాదు. ఏడాది మొత్తం చూసుకుంటే అడపాదడపా ఓ వంద కేసులు కనిపించేవి. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. కరోనా కారణంగా బలహీనంగా మారిన పేషెంట్లపై ఈ ఫంగస్ దాడి చేస్తోంది. ఇదే ఇప్పుడు ప్రజలను, వైద్యులను భయపెడుతోంది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభించింది. భారత్ కంటే అమెరికాలో ఎక్కువ మందికి కరోనా సోకింది. బ్రెజిల్ లో మన కంటే ఎక్కువ మరణాలు నమోద్యయాయి. చాలా దేశాలు కరోనాతో వణికిపోయాయి. అయితే బ్లాక్ ఫంగస్ కేసులు మాత్రం ఒక్క ఇండియాలోనే విపరీతంగా నమోదవుతున్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇదే ఇప్పుడు వైద్య నిపుణులకు అర్ధం కావడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా.. ఇండియాలోనే కరోనా జయించిన వారిలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎందుకు వస్తున్నాయన్నది మిస్టరీగా మారింది. విదేశాల్లో కరోనాకు అందించిన వైద్యానికి.. మన దేశంలో అందిస్తున్న చికిత్సకు తేడా ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మన చికిత్సలో ఏదైనా లోపం ఉందా... ఆ కారణంగానే బ్లాక్ ఫంగస్ కేసులు పెరిగిపోతున్నాయా అన్న అభిప్రాయం కొన్ని వర్గాల నుంచి వినిపిస్తోంది. ముఖ్యంగా కరోనా రోగులకు విపరీతంగా స్టెరాయిడ్స్ ఇవ్వడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందనే ఆరోపణలు కొందరి నుంచి వస్తున్నాయి. కర్ణాటక వైద్యులకు కూడా ఇదే అనుమానం వచ్చింది. దీంతో దీనికి కారణాలు కనుక్కునే పనిలో పడ్డారు. బ్లాక్ ఫంగస్ లేక మ్యూకర్‌మైకాసిస్ అనే ఈ వ్యాధి గురించి చర్చించేందుకు కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ సీ ఎన్ అశ్వథనారాయణ్ ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న వైద్యులందరూ అసలు బ్లాక్ ఫంగస్ ఎక్కడి నుంచి వ్యాపిస్తోంది? దీనికి కారణాలేంటి? అనే విషయంపై చర్చించారు. ఈ చర్చలో కీలకంగా మారిన అంశం కరోనా పేషెంట్లకు అందజేస్తున్న ఆక్సిజన్ సరఫరా విధానమే. హాస్పిటల్స్ కు సరఫరా అవుతున్న ఆక్సిజన్, పైపింగ్, సిలిండర్ల నాణ్యతే అయ్యుండొచ్చని వైద్యులు అభిప్రాయపడ్డారు. బ్లాక్ ఫంగస్ వ్యాప్తికి కలుషితమైన ఆక్సిజన్ కారణం అయ్యుండొచ్చని డాక్టర్లు అంటున్నారు. సిలిండర్లలోకానీ, లేదంటే ఆస్పత్రుల్లో ఐసీయూల్లో ఉన్న పైపింగ్ వ్యవస్థలోకానీ నాణ్యతా లోపం కూడా బ్లాక్ ఫంగస్‌కు కారణం కావొచ్చంటున్నారు. ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీల్లో కలుషిత పరిస్థితులు, అలాగే స్టెరిలైజేషన్ లోపం కూడా బ్లాక్ ఫంగస్‌కు ఆధారం కావొచ్చని డాక్టర్లు అంటున్నారు. ఇలా ఎక్కడో ఒకచోట ఆక్సిజన్ సరఫరా కలుషితం కాకపోతే ఇన్ని బ్లాక్ ఫంగస్ కేసులు రావడం జరగదని, అదే జరిగితే పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లేనని వాళ్లు వివరించారు. డాక్టర్లు లేవనెత్తిన మరో కలవరపరిచే అంశం ఆస్పత్రి వెంటిలేటర్లలో ట్యాప్ వాటర్ ఉపయోగించడం. అసలు ఇలా చేస్తారా? అని అనుమానాలు ఉన్నప్పటికీ కొన్ని చోట్ల ఇదే జరుగుతున్నట్లు తెలుస్తోంది. కరోనా కేసులు విపరీతంగా పెరగడం వల్ల ఆక్సిజన్ డిమాండ్ కూడా పెరిగింది. దీంతో పరిశ్రమల నుంచి అధిక మొత్తాల్లో ఆక్సిజన్ సరఫరా జరుగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ స్టెరిలైజేషన్ సరిగా జరుగుతుందా? పరిశుభ్రత కచ్చితంగా పాటిస్తున్నారా? అన్నది చూడకుండానే ఉపయోగిస్తున్నారు. ఆక్సిజన్ నాణ్యత పరిశీలించకుండానే రోగులకు అందిస్తున్నారు.ఇది కూడా బ్లాక్ ఫంగస్ కు కారణాలు కావొచ్చని భావిస్తున్నారు. మొత్తానికి బ్లాక్ ఫంగస్ కేసులతో మన దేశ వైద్య వ్యవస్థ ఎంతటి దారుణ పరిస్థితుల్లో ఉందో అర్ధమవుతోంది. హాస్పిటల్స్ లో మౌలిక వసతుల లేమి, ఆక్సిజన్ సరఫరా సిస్టమ్ సరిగా లేకపోవడం, పైప్ లైన్ వ్యవస్థ గందరగోళంగా ఉండటం.. వీటిపై సరైన పర్యవేక్షణ లేకపోవడం వంటి లోపాలను ఎత్తి చూపుతున్నాయి. కొవిడ్ చికిత్సపై మార్గదర్శకాలు ఇస్తున్న ఐసీఎంఆర్ కూడా ఎప్పటికప్పుడు నిర్ణయాలు మార్చుకోవడం గందరగోళంగా మారింది. కొవిడ్ ట్రీట్మెంట్ ప్రోటోకాల్ గాడి తప్పిందనే విమర్శలు ఉన్నాయి. మొత్తంగా వైద్య విధానంలోని లోపాల వల్లే విదేశాల్లో ఎక్కడా లేకుండా ఇండియాలోనే బ్లాక్ ఫంగస్ విస్తరిస్తుందనే అభిప్రాయం వైద్య నిపుణుల నుంచి వస్తోంది. ఈ పరిస్థితుల నుంచి పాఠాలు నేర్చుకొని ఇకనైనా హాస్పిటల్స్ లో మెరుగైన వసతుల కల్పనకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది...
http://www.teluguone.com/news/content/why-block-fungus-casec-in-india-only-39-116315.html





