తుగ్లక్ లా జగన్ తీరు ఉందన్న జయప్రకాశ్ నారాయణ్
Publish Date:Oct 17, 2022
Advertisement
మూడు రాజధానులంటూ ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరి పట్ల క్రమంగా అన్ని వర్గాలలోనూ వ్యతిరేకత పెరుగుతోంది. ఇప్పటి వరకూ ఈ విషయంపై పెద్దగా నోరు మెదపని వారు కూడా ఇప్పుడు బయటకు వచ్చి జగన్ సర్కార్ తీరును తప్పుపడుతున్నారు. ఆ క్రమంలోనే లోక్ సత్తా నాయకుడు జయప్రకాశ్ నారాయణ్.. మూడు రాజధానులంటూ వైసీపీ, జగన్ సర్కార్ తీరును తప్పుపట్టారు. గతంలో అందరూ కలిసి ఏకగ్రీవంగా రాజధానిగా అమరావతిని గుర్తు చేశారని ఆయన గుర్తు చేశారు. అంతటితో ఆగకుండా తుగ్లక్ కూడా తరచుగా రాజధానులను మార్చిన సంగతి గుర్తు చేశారు. రాష్ట్ర ప్రబుత్వానికి రాష్ట్ర రాజధానికి మార్చే హక్కు ఇసుమంతైనా లేదని విస్పష్టంగా తేల్చేశారు. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై జయప్రకాశ్ నారాయణ్ తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టినట్లు చెప్పారు. రాష్ట్రానికి ఒకటి కాదు మూడు రాజధానులు అంటున్న జగన్ సర్కార్ ఆరు నూరైనా మూడు రాజధానులు ఏర్పాటు చేసి తీరతామంటోంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి, వికేంద్రీకరణే తమ విధానమని వైసీపీ చెబుతున్నది. కాగా అమరావతే రాజధాని అంటూ ఆ ప్రాంత రైతులు మహాపాదయాత్ర చేస్తున్నారు. ఆ యాత్రను అడ్డుకోవాలన్న ఉద్దేశంతో, ఆ యాత్ర విశాఖ ప్రవేశించరాదన్న తలంపుతో వైసీపీ విశాఖ గర్జన్ కార్యక్రమం చేపట్టింది. ఈ నేపథ్యంలోనే రాజధాని అంశంపై లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ ఏపీకి రాజధాని అమరావతే అని ఆయన తేల్చి చెప్పారు. తుగ్లక్ తరచూ రాజధానులను మార్చిన సంగతిని ప్రస్తావించిన ఆయన జగన్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని అన్నారు. జగన్ సర్కార్ రాజధానిపై ప్రజలలో గందరగోళాన్ని సృష్టిస్తోందని అన్నారు. అయితే రాష్ట్ర హైకోర్టు రాజధానిపై విస్పష్ట తీర్పు ఇచ్చిన తరువాత కూడా జగన్ సర్కార్ తాను పట్టిన కుందేటికి మూడే కాళ్లనడం సరికాదని జయప్రకాశ్ అభిప్రాయపడ్డారు. ఒక సార్వభౌమ అధికారం ఉన్న ప్రభుత్వం ఇండిపెండెంట్ గా హామీ ఇచ్చిన తర్వాత, రాతపూర్వకంగా ఒక కాంట్రాక్ట్ కుదిరిన తర్వాత వెనక్కి వెళ్లే హక్కు లేదని హైకోర్టు చెప్పిందని ఆయన పేర్కొన్నారు. రాజధాని అంశంపై తారస్థాయిలో రగడ జరుగుతున్న వేళ.. ఏపీ రాజధాని అమరావతే అంటూ జయప్రకాశ్ నారాయణ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
http://www.teluguone.com/news/content/jagan-rule-remembers-tuglak-saya-jayaprakashnarayan-39-145531.html





