కోడి కత్తా, కోనసీమ విధ్వంసమా.. విశాఖలో వైసీపీ ప్లాన్ ఏంటి?
Publish Date:Oct 17, 2022
Advertisement
విశాఖపట్నంలో పెద్ద ఎత్తున విధ్వంస కాండకు తెరలేపి.. రైతుల మహాపాదయాత్రను అడ్డుకోవడమే వైసీపీ లక్ష్యంగా కనిపిస్తోంది. అందుకే పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. విశాఖలో కోడి కత్తి డ్రామాను రిపీట్ చేయడమో, కోనసీమ విధ్వంస కాండకు తెరలేపడమో చేయడమే వైసీపీ కుట్రగా కనిపిస్తోందంటున్నారు. పవన్ కల్యాణ్ విశాఖపట్నం చేరుకున్న సందర్బంగా విశాఖ విమానాశ్రయం వద్ద చోటు చేసుకున్న సంఘటనలు, సంభవించిన పరిణామాలూ కోడి కత్తిని గుర్తుకు తెస్తున్నాయి. జనసేనాని విశాఖ వస్తున్న సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు వేల సంఖ్యలో జనసైనికులు విమానాశ్రయానికి చేరుకున్న సమయంలోనే విశాఖ గర్జన ముగించుకుని మంత్రులు విశాఖ ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. మంత్రులు రోజా, జోగి రమేష్, వైసీపీ విశాఖ ఇన్ చార్జ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తదితరులపై జనసైనికులు దాడి చేశారంటూ పెద్ద సంఖ్యలో జనసేన కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురిపై 307 సెక్షన్ కింద కేసులు నమోదు చేశారు. అయితే ఈ అరెస్టులు, కేసులపై తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే పోలీసులు సిసి ఫుటేజ్ ఆధారంగా అరెస్టులు చేయలేదనీ, అలా చేసి ఉంటే.. ఇప్పుడు పోలీసులు అరెస్టు చేసిన వారెవరూ ఆ దాడికి పాల్పడిన వారిలో లేరన్నది ప్రస్ఫుటం అవుతుందని అంటున్నారు. అయినా జనసేనానికి ఉన్న జనాభిమానం గురించి తెలిసీ, ఆయనకు పెద్ద సంఖ్యలో అభిమానులు స్వాగతం పలికేందుకు విమానాశ్రయానికి వస్తారని తెలిసీ ఎందుకు సరైన భ్రదతా ఏర్పాట్లు ఎందుకు చేయలేదని పలువురు ప్రశ్నిస్తున్నారు. అలాగే మంత్రులు విమానాశ్రయానికి వస్తున్నప్పుడు ప్రొటోకాల్ ప్రకారం ఉండాల్సిన భద్రతా ఏర్పాట్లు కూడా కనిపించలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జరిగిన సంఘటనలు, అందుకు దారి తీసిన పరిస్థితులు గమనిస్తే.. విశాఖలో కోనసీమలో జరిగినట్లుగా పెద్ద ఎత్తున విధ్వంసం జరగాలని జగన్ సర్కార్ కోరుకుంటున్నదా అని అనుమానం కలుగుతోందని పరిశీలకులు అంటున్నారు. మంత్రులపై దాడికి పాల్పడిన వారు వైసీపీ కార్యకర్తలేనని జనసేన ఆరోపిస్తోంది. మరి ఆ దిశగా పోలీసులు ఎందుకు దృష్టి సారించడం లేదన్న ప్రశ్నలు వినవస్తున్నాయి.
http://www.teluguone.com/news/content/konaseema-or-kodikatti-what-is-ycp-plan-in-vizag-39-145534.html





