జగన్ విధానాలన్నీ రాజ్యాంగ ఉల్లంఘనలే: రఘురామ కృష్ణం రాజు
Publish Date:Jul 28, 2023
Advertisement
జగన్ ప్రభుత్వ విధానాలన్నీ నేరపూరితమైనవే.. రాజ్యాంగ ఉల్లంఘనలే. కార్పొరేషన్ల పేరిట ప్రభుత్వం తీసుకున్న రుణాలన్నీ నిభందనలకు విరుద్ధమే. జగన్ ముఖ్యమంత్రిగా అనుసరించిన విధానాలను వ్యాపారులెవరైనా చేసి ఉంటే వారు జైలుకెళ్లి ఉండేవారు. ఇందుకు గాను వారికి పదేళ్లకు తక్కువకాకుండా శిక్ష పడేది. ఈ మాటలు అన్నది ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు . జగన్ ప్రభుత్వం రుణాల పేరిట చేస్తున్నదంతా పెద్ద మోసం అంటూ వివరించారు. రచ్చబండలో భాగంగా మీడియా సమావేశంలో రఘురామకృష్ణంరాజు ఏపీ సీఎం జగన్ ను ఆర్థిక అక్రమార్కుడిగా అభివర్ణించారు. జగన్ రాజ్యాంగంలోని 266/1, 293/3 అధికరణలను అతిక్రమించారని అన్నారు. భవిష్యత్ ఆదాయంపై ఇప్పుడే ఈ స్థాయిలో భారీ అప్పులు చేస్తే భవిష్యత్ తరాల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేస్తున్న అప్పులపై తాను గతంలోనే ప్రధానమంత్రికి, ఆర్థిక శాఖ మంత్రి కి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి లేఖలు రాసినట్లు చెప్పిన రఘురామకృష్ణం రాజు దురదృష్ట వశాత్తూ కేంద్రం తన లేఖలను పట్టించుకోలేదన్నారు. దీంతో తాను కోర్టును ఆశ్రయించాననీ, అయితే కోర్టుకు వెళ్లడంలో జాప్యం జరిగిందంటూ కేసు కొట్టేసిందని వివరించారు. ఆంధ్ర ప్రదేశ్ బేవరేజెస్ కార్పొరేషన్ పేరిట గతంలో 38.142 వేల కోట్ల రూపాయల అప్పులను చేసిన రాష్ట్ర ప్రభుత్వం, తన పిటిషన్ ను కోర్టు కొట్టివేసిన 48 గంటల వ్యవధిలో మరో 12 వేల కోట్ల రూపాయల అప్పు తీసుకునేందుకు రెడీ అయ్యిందన్నారు. ఎక్సైజ్ టాక్స్ పేరిట కొత్త టాక్స్ వేసి మరీ ఏపీ ఎస్ డి సి పేరిట జగన్ సర్కార్ పాతిక వేల కోట్ల రూపాయల రుణం తీసుకున్నదన్నారు. జగన్ విధానాల కారణంగా వచ్చే ఎన్నికలలో ఆయన ప్రభుత్వం దిగిపోయి కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వానికి మద్యం ధరలను తగ్గించే అవకాశం ఉండదని రఘురామకృష్ణం రాజు అన్నారు. బటన్ నొక్కి సంక్షేమాన్ని అమలు చేస్తున్నామని చెప్పుకుంటున్న జగన్ వాస్తవానికి చేస్తున్నది దోపిడీ మాత్రమేనని విమర్శించారు. భవిష్యత్తులో మద్యంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది లేదు. ప్రజలకు సంక్షేమ పథకాల పేరిట జగన్మోహన్ రెడ్డి నగదు ఇచ్చేదీ లేదన్నది జనం గ్రహించాలని చెప్పారు.
http://www.teluguone.com/news/content/jagan-policies-are-violation-of-the-constitution-25-159130.html





