తెలంగాణలో బీజేపీ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కు
Publish Date:Jul 28, 2023
Advertisement
తెలంగాణలో బీజేపీ పరిస్థితి బావిలో కప్ప మాదిరిగా తయారైంది. రాష్ట్రంలో అధికారంలోకి రావాలన్న ఆ పార్టీ ఆకాంక్ష మేరకు పార్టీ అధిష్ఠానం చేస్తున్న ప్రయత్నాలు ఒకడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్న చందంగా సాగుతున్నాయి. అసలు తెలంగాణలో బీజేపీ అధికారం కోసం పోటీ పడుతోందన్నంతగా జోష్ పెంచుకోవడానికి కారణం ఎవరు ఔనన్నా కాదన్నా ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ అనడంలో సందేహం లేదు. అయితే బండి స్పీడ్, జోరు అందుకోలేని కొందరు ఆయనకు వ్యతిరేకంగా కేంద్రం వద్ద ఫిర్యాదుల మీద ఫిర్యాదులు చేశారు. వీరిలో అత్యధికులు తొలి నంచీ పార్టీలో ఉన్న వారు కాకుండా.. మధ్యలో వారి వారి రాజకీయ అవసరాల కోసం పార్టీలోకి వచ్చి చేరిన వారేనని పరిశీలకులు అంటున్నారు. ఇక బీజేపీ అధిష్ఠానం కూడా ఎలాగోలా రాష్ట్రంలో అధికారంలోకి వస్తే చాలన్న ఉద్దేశంతో సైద్ధాంతిక విలువలకు తిలోదకాలొదిలేసి పార్టీలోకి ఎవరు వస్తానన్నా ఓకే అన్నట్లుగా గేట్లు బార్లా తీసేసింది. దీంతో సిద్ధాంతాన్ని నమ్ముకుని అధికారం సంగతి ఆలోచించకుండా పార్టీనే నమ్ముకుని ఉన్న వారికి ఈ పరిస్థితి రుచించలేదు. దాంతో వారు పార్టీలో క్రియాశీలంగా ఉండకుండా కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. అయితే పార్టీకి బలం పెరుగుతోందన్న బిల్డప్ అవ్వడానికి ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన వారు నానా హడావుడీ చేశారు. అయితే బండి జోష్ వారికి ఇబ్బందికరంగా పరిణమించడంతో ఫిర్యాదుల పర్వానికి తెరలేపారు. చేరికలపైనే విజయం ఆధారపడి ఉందని భావించిన అధిష్ఠానం బండిని తప్పించి ఇప్పటికే మూడు సార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేసిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి నాలుగోసారి పార్టీ రాష్ట్ర పగ్గాలు అప్పగించింది. మొదటి రెండు సర్లూ ఆయన ఉమ్మడి రాష్ట్రంలో బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణ బీజేపీకి ఆయనే తొలి అధ్యక్షుడు. అయితే గత మూడు సందర్భాలలోనూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎలాంటి ప్రభావం చూపలేకపోయిన కిషన్ రెడ్డికి పార్టీ కీలక సమయంలో మరోసారి రాష్ట్ర అధ్యక్షపదవిని కట్టబెట్టడంపై పార్టీ వర్గాల్లోనూ ఒకింత అసంతృప్తి వ్యక్తమౌతున్నది. ఇప్పుడు తాజాగా మరోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన కిషన్ రెడ్డికి గతంలో కంటే క్లిష్ట పరిస్థితులు స్వాగతం పలుకుతున్నాయనడంలో సందేహం లేదు. పార్టీ మాజీ అధ్యక్షుడి అసంతృప్తి, అలాగే రాష్ట్ర అధ్యక్ష పగ్గాలను ఆశించిన ఇతర పార్టీల నుంచి వచ్చి చేరిన నేతల సహాయ నిరాకరణ, కర్నాటక ఎన్నికల తరువాత కాంగ్రెస్ లో పెరిగిన జోష్ తో డీలా పడిన కమలం కార్యకర్తలు, రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలలో కరవైన పార్టీ నిర్మాణం ఇవన్నీ కూడా కిషన్ రెడ్డికి సవాళ్లనే చెప్పాలి. పైగా పార్టీ హైకమాండ్ తిమ్మిని బమ్మి చేసైనా, బమ్మిని తిమ్మిని చేసైనా వచ్చే ఎన్నికలలో తెలంగాణలో బీజేపీ జెండా ఎగరేయాలన్న పట్టుదలతో ఉన్న పరిస్థితుల్లో కిషన్ రెడ్డి రాష్ట్రంలో పార్టీని ఏ విధంగా ముందుకు తీసుకువెడతారన్న సందేహాలు పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమౌతున్నాయి.
http://www.teluguone.com/news/content/telangana-bjp-progress-reverse-25-159124.html





