జగన్‌రెడ్డి కేపిటల్ డ్రామా!.. CRDA బిల్లుతో అమరావతి ఆట!
Publish Date:Nov 22, 2021
Advertisement
మూడు రాజధానులను కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టారు. ఇప్పటికి పక్కనపెట్టేసి.. త్వరలోనే మరింత పదునైన అస్త్రంగా ప్రయోగించాలని చూస్తున్నారు. వికేంద్రీకరణ బిల్లునైతే వెనక్కి తీసుకున్నారు కానీ, వికేంద్రీకరణపై మాత్రం ముందుకే వెళ్తామంటున్నారు. అమరావతినే ఏపీకీ ఏకైక రాజధాని అని ఏమాత్రం ఒప్పుకోవడం లేదు. అమరావతికి జై కొట్టడం లేదు. అదే పంతం. అదే మొండితనం. మూడు రాజధానుల పేరుతో అమరావతిని ధ్వసం చేసే దుర్నీతి. సీఆర్‌డీఏ రద్దు బిల్లును రద్దు చేసి.. జగన్‌రెడ్డి సర్కారు మైండ్‌గేమ్ ఆడుతోందని అంటున్నారు. బిల్లు రద్దు చేసినా.. మళ్లీ కొత్త బిల్లుతో వస్తామన్నారు. రాజధానిని మూడు ముక్కలు చేసే వరకూ వదిలిపెట్టేది లేదంటూ చెప్పకనే చెప్పారు. టెక్నికల్‌గా ఇప్పుడు మూడు రాజధానులు లేవు. ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతినే. సీఆర్‌డీఏ బిల్లు పునరుద్దరించబడింది. అయినా, ఆనందించలేని పరిస్థితి. సంబరాలు చేసుకోలేని దుస్థితి. ఎందుకంటే, అసెంబ్లీలో జగన్‌రెడ్డి ప్రసంగం వింటే అర్థమైపోతుంది. ఆయన అసలు ఉద్దేశ్యమేంటో తెలిసిపోతుంది. ముఖ్యమంత్రి ఏమాత్రం మారలేదు. అమరావతి రైతులు 700 రోజులుగా పాదయాత్ర చేస్తున్నా.. జగన్‌రెడ్డి మనుసు కరగలేదు. హైకోర్టు భయంతో, మండలి బలంతో.. టెక్నికల్‌గా మరింత బలమైన బిల్లు తీసుకొచ్చి.. అమరావతి గుండెల్లో మళ్లీ ముల్లు గుచ్చాలనేది ఎత్తుగడ. మండలిలో ఆధిపత్యం వచ్చే దాకా.. హైకోర్టు మొట్టికాయలు తప్పించుకునే దాకా.. మూడు రాజధానులను తాత్కాలికంగా పక్కనపెట్టే వ్యూహం మినహా ఇంకేమీ లేదక్కడ. చంద్రబాబు-భవనేశ్వరి ఎపిసోడ్‌పై ప్రజల దృష్టిని మరల్చడానికో.. వివేకా హత్య కేసును డైవర్ట్ చేసేందుకో.. సీమ వర్షాల్లో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకో.. కారణం ఏదైనా.. జగన్‌రెడ్డి ప్రస్తుతానికి వెనకడుగు వేసినా.. మూడు రాజధానులపై తగ్గేదే లేదని తేల్చేశారు. మళ్లీ ప్రజల దృష్టిలో దోషిగా నిలబడ్డారు. మూర్ఖుడు రాజుకంటే బలవంతుడనేది సామెత. అదే, మూర్ఖుడే రాజైతే...?
http://www.teluguone.com/news/content/jagan-capital-game-with-crda-bill-39-126889.html





