జగన్ తో సాయి రెడ్డి కటీఫ్! బీజేపీ డైరెక్షన్ లో వెన్నుపోటు?
Publish Date:May 31, 2021
Advertisement
విజయసాయి రెడ్డి.. వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా ఉన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే జగన్ తర్వాత నెంబర్ టు స్థానం విజయసాయి రెడ్డిదేనని ప్రచారం ఉంది. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం, సీఎంవోలోనూ సాయి రెడ్డిదే హవా అని చెబుతారు. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుల్లో ఏ1గా జగన్ ఉండగా.. ఏ2గా విజయసాయి రెడ్డి ఉన్నారు. ఈ కేసుల్లో జగన్ తో పాటు సుదీర్ఘ కాలం జైలు జీవితం గడిపారు సాయిరెడ్డి. అందుకే ఆయనకంత ప్రాధాన్యం అంటారు. అయితే ప్రస్తుతం మాత్రం సీన్ మారినట్లు కనిపిస్తోంది. కొన్ని రోజులుగా వైసీపీలో జరుగుతున్న పరిణామాలు, సీఎంవో నుంచి వస్తున్న లీకుల ఆధారంగా విజయసాయి రెడ్డిని సీఎం జగన్ దూరం పెట్టారని తెలుస్తోంది. కొన్ని రోజులుగా ఎంపీ విజయసాయి రెడ్డి తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయానికి రాకపోవడం, ముఖ్యమంత్రిని కలవకపోవడం ఇందుకు బలాన్నిస్తున్నాయి. సీఎం జగన్ రెండేళ్ల పాలన పూర్తైన సందర్భంగా నిర్వహించిన కార్యక్రమాల్లోనూ ఎక్కడా సాయి రెడ్డి కనిపించ లేదు. ప్రతి చిన్న విషయానికి హడావుడి చేసే విజయసాయి రెడ్డి... ముఖ్యమైన ప్రోగ్రామ్ లో సైలెంట్ గా ఉండటం రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఎంపీ విజయసాయి రెడ్డిని తన దగ్గరకు రానివ్వడం లేదని తెలుస్తోంది. అందుకే అతను విశాఖకే పరిమితం అయ్యారని అంటున్నారు. విశాఖకు సంబధించిన ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ ఎంపీ ప్రోటోకాల్ ప్రకారమే తప్ప ఇతరత్రా గతంలోగా విజయసాయికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని చెబుతున్నారు. గతంలో విశాఖలో ఏం జరిగినా అంతా సాయిరెడ్డి చెప్పినట్లే ఉండేది. కాని ఇప్పుడా సీన్ కనిపించడం లేదు. ఇటీవలే తూర్పు తీరంలో యాస్ తుఫాన్ వచ్చింది. ఏపీపైనా ప్రభావం పడింది. అయితే తుపానుపై జరిగిన సమీక్షల్లో విజయసాయి ఎక్కడా కనిపించలేదు. అంతేకాదు సీఎస్ ఆధిత్యనాథ్ ను విశాఖ పంపించారు సీఎం జగన్. సీఎస్సే రెండు రోజుల పాటు అక్కడే ఉండి పర్యవేక్షించారు. విజయసాయి రెడ్డి విశాఖలోనే ఉన్నా.. తుపాను సమయంలో ముఖ్యమంత్రి అతన్ని పట్టించుకోకపోవడం చర్చగా మారింది. గత సంవత్సరం ఎల్జీ పాలిమర్స్ ఫ్యాక్టరీ నుంచి గ్యాస్ లీకైన సమయంలోనూ ఎంపీ విజయసాయిని పక్కన పెట్టారు సీఎం జగన్. విజయవాడ నుంచి జగన్ తో పాటు ప్రత్యేక హెలికాప్టర్ లో విశాఖ వచ్చేందుకు విజయసాయి ప్రయత్నించారు. అయితే విజయసాయిని కిందకు దించి వైద్య శాఖ మంత్రి అళ్లనానిని తనతో పాటు తీసుకెళ్లారు జగన్. ఈ ఘటన అప్పడు సంచలనంగా మారింది. విజయసాయిని ఆగమని జగన్ చెబుతున్న వీడియోలు వైరల్ గా మారాయి. అప్పటి నుంచే సాయి రెడ్డిని జగన్ క్రమంగా దూరం పెడుతున్నారని, ఇప్పుడా గ్యాప్ మరింతగా పెరిగిపోయిందని తెలుస్తోంది. జగన్ తనను దూరం పెట్టడం వల్లే విజయసాయి తాడేపల్లి రావడం లేదని అంటున్నారు. సాయి రెడ్డికి షాకిచ్చిన జగన్.. అతనికి గతంలో ఇచ్చిన ప్రాధాన్యతను ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డికి ఇస్తున్నారని వైసీపీలోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. జగన్ రెడ్డి , విజయసాయి రెడ్డి మధ్య గ్యాప్ వచ్చిందని వార్తలు వస్తున్న సమయంలోనే మరో ఆసక్తికరమైన ఘటన జరిగింది. జగన్మోహన్ రెడ్డిపై ఇప్పటికే 11 సీబీఐ, 6 ఈడీ కేసులు విచారణలో ఉన్నాయి. తాజాగా ఈడీ దాఖలు చేసిన మరో ఛార్జ్‌షీట్‌ను న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. దీంతో సీబీఐ, ఈడీ కోర్టులో ఏపీ సీఎం జగన్‌పై కేసుల సంఖ్య 18కి చేరాయి. తాజా కేసుకు సంబంధించి ఈడీ గత ఏడాదిలోనే ఛార్జ్‌షీట్ దాఖలు చేసినప్పటికీ.. కొన్ని లోపాల వల్ల న్యాయస్థానం దానిని రిజెక్ట్ చేసింది. మార్చిలో మళ్లీ దాఖలు చేయగా విచారణ చేపట్టింది. తాజాగా నమోదైన 18వ కేసులో జగన్ తో పాటు టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, ఇందూ గ్రూపు వ్యవస్థాపకుడు శ్యాంప్రసాద్ రెడ్డి నిందితులుగా ఉన్నారు. ఈ కేసులో అనూహ్యంగా ఎంపీ విజయసాయిరెడ్డి పేరు తొలగించారు. ఇదే ఇప్పుడు చర్చగా మారింది. విజయసాయి రెడ్డి ఢిల్లీలో బీజేపీ పెద్దలతో చేసిన లాబీయింగ్ వల్ల ఇలా జరిగిందా అన్న చర్చ జరుగుతోంది. బీజేపీ హైకమాండ్ తో విజయసాయి రెడ్డి సంబంధాలు పెంచుకోవడం కూడా జగన్ .. అతన్ని దూరం పెట్టడానికి కారణమనే ప్రచారం పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతోంది. తాజాగా జరుగుతున్న పరిణామాలతో జగన్ అక్రమాస్తుల కేసులో ఏదైనా జరగవచ్చని, జగన్ పై కోపంతో విజయ సాయి రెడ్డి అప్రూవర్ గా మారినా ఆశ్చర్యం లేదనే టాక్ కూడా నడుస్తోంది. బీజేపీ పెద్దలతో కలిసి విజయసాయి రెడ్డి.. జగన్ పై కుట్రలు చేసే అవకాశాలు ఉన్నాయనే ఆందోళన కూడా కొందరు వైసీపీ నేతల్లో ఉందంటున్నారు. అందులో భాగంగానే గృహ నిర్మాణ ప్రాజెక్టులకు సంబంధించిన కేసులో సాయి రెడ్డి పేరు తొలగించారనే వాదనలు వస్తున్నాయి. ఇక బెయిల్ రద్దై జగన్ జెైలుకు పోతే ముఖ్యమంత్రి కావాలని సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం ఎప్పటి నుంచో ఉంది. జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు వేసిన పిటిషన్ పై విచారణ మొదలైంది. ఈ సమయంలో మంత్రి పెద్దిరెడ్డికి విజయసాయి రెడ్డి తోడైతే ఏపీలో అనూహ్య పరిణామాలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. మొత్తంగా వైసీపీలో కీలక పరిణామాలు జరగబోతున్నాయని, సీఎం జగన్ కేసుల్లో ఏదైనా జరగవచ్చనే చర్చ ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.
http://www.teluguone.com/news/content/is-ycp-mp-vijaysai-reddy-planing-to-shock-cm-jagan-25-116636.html





