ఒకే ఒరలో రెండు కత్తులు.. టిఆర్ఎస్ లో మున్సిపల్ రగడ మొదలైంది!!
Publish Date:Dec 17, 2019

Advertisement
తాజాగా ఉన్నత న్యాయస్థానంలో మున్సిపల్ ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో అధికార పార్టీ ఎన్నికల కసరత్తు మొదలు పెట్టింది. దీనిలో భాగంగానే మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ లకు సంబంధించిన అభ్యర్థుల వివరాలు అందించాలని పార్టీ అధిష్టానం ఎమ్మెల్యేలను కోరింది. ప్రతి నియోజకవర్గంలో పూర్తి బాధ్యతలను అక్కడి ఎమ్మెల్యేలకే కట్టబెట్టారు. అయితే అసలు పంచాయితీ ఇక్కడే మొదలైంది. కొన్ని నియోజక వర్గాల్లో టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని చోట కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లో చేరగా కొందరు ఎన్నికల సమయంలో ఇతర పార్టీల నుంచి వచ్చి టిఆర్ఎస్ టిక్కెట్ మీద గెలిచారు. దీంతో అక్కడ మాజీ ఎమ్మెల్యే వర్సెస్ తాజా ఎమ్మెల్యేల మధ్య కోల్డ్ వార్ మొదట్నుంచీ నడుస్తోంది. ప్రస్తుత మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన కసరత్తు నడుస్తున్న నేపధ్యంలో టిక్కెట్ల విషయంలో తాజా, మాజీ ఎమ్మెల్యేలకు పడటం లేదు. మావాడికి అవకాశమివ్వాలి అంటే మా వాడికి ఇవ్వాలనీ పోటా పోటీగా అభ్యర్ధులు తెరమీదకు తీసుకొస్తున్నారు.
రీసెంట్ గా ఉమ్మడి పాలమూరు జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలో ఎంపీటీసీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్యే జూపల్లి , ప్రస్తుత ఎమ్మెల్యే హర్షవర్దన్ రెడ్డిల మధ్య గొడవ జరిగాయి. ఇప్పుడు మునిసిపల్ ఎన్నికల విషయంలో కోల్డ్ వార్ నడుస్తోంది. ఈ ఇద్దరు నేతలు తమ అనుచరులను తెరమీదకు తీసుకొస్తున్నారు. దీంతో టీఆర్ఎస్ అధిష్ఠానానికి ఇబ్బందిగా మారింది. ఉమ్మడి నల్గొండ జిల్లా కోదాడ నియోజకవర్గంలోనూ ఇదే పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్ఎస్ లో చేరిన ఎమ్డీ జానీ తానే చైర్మన్ అభ్యర్థి అని ప్రచారం చేసుకుంటున్నారు. మొదటి నుంచి పార్టీలో ఉన్న నేతలకు ఇది మింగుడు పడటంలేదు, ఇదే విషయాన్ని జిల్లా పెద్దల దృష్టికి తీసుకువెళ్లారు. ఇక రంగారెడ్డి జిల్లా తాండూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే ప్రస్తుత ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.. స్థానిక ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. ఎన్నికల వేళ మహీందర్ రెడ్డి నియోజక వర్గాల్లో పర్యటిస్తూ తన అనుచరులను ఉసిగొలుపుతూ ఇబ్బందులు కలిపిస్తున్నారని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇలా దాదాపు వేరే పార్టీ ఎమ్మెల్యేలున్న ప్రతి నియోజకవర్గంలో ఇలాంటి సమస్యలే ఎదురు కావడంతో ముందస్తు చర్యలు ప్రారంభించారు గులాబీ బాస్. కొత్త ,పాత పంచాయతీ లేకుండా చూసి ఎన్నికల సాఫీగా జరిగేలా చూడాలని మంత్రులు ఆదేశించినట్టు తెలుస్తోంది.
http://www.teluguone.com/news/content/internal-clashes-between-trs-leaders-in-nalgonda-district-39-92303.html












