ధర్మ యుద్ధంలో మాదిగల్ని... వెంకయ్య గెలిపిస్తారా?
Publish Date:Nov 28, 2016
Advertisement
భారతదేశంలో కులం అత్యంత శక్తివంతమైంది. నిజానికి అందరూ మతం గురించి ఎక్కువగా మాట్లాడుతుంటారు కాని... కులం దాని కంటే రెట్టింపు ప్రభావం చూపుతుంది సమాజం పైన! ఎన్నికలొస్తేనైతే కులం చెలరేగిపోతుంది. మంచితనం, అర్హత లాంటివేవీ కులం ఇప్పించినంతగా బీపారాలు ఇప్పించలేవు. పదవులు తెచ్చిపెట్టవు. అందుకే, మన నేతలు కులాన్ని భద్రంగా కాపాడుకుంటూ వస్తున్నారు...
భారతదేశంలో కులం అంతకంతకూ బలపడటానికి అనేక కారణాల్లో ఒకటి రిజర్వేషన్! అసలు రిజర్వేషన్లు పెట్టింది సదుద్దేశంతోనే అయినా రాను రాను అవ్వి ఎన్నికల ఎజెండాలో భాగమైపోయాయి. ఇంతవరకూ రిజర్వేషన్స్ పొంది లాభపడ్డ వారు గణనీయంగానే వున్నా ఇంకా పేదరికంలో మగ్గుతోన్న బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు బోలెడు మంది వున్నారు. ఇక ఓసీల్లోని పేదల సంగతైతే మాట్లాడేదే లేదు! వాళ్లను మరింత దయనీయ స్థితి....
రిజర్వేషన్ల గురించి మాట్లాడుకుంటే అందరూ ఖచ్చితంగా ప్రస్తావించేది మాదిగల పోరాటం. మంద కృష్ణ మాదిగ ఎప్పట్నుంచో ఎస్పీ వర్గీకరణ చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఆయనతో మాదిగలు వుంటే మాలలు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. తక్కువ కులాల వారికి రిజర్వేషన్లను అగ్ర కులాల వారు వ్యతిరేకించటం లాంటిదే ఈ అభ్యంతరం కూడా. మాలలు మాదిగల కన్నా సామాజికంగా, ఆర్దికంగా, విద్యాపరంగా ముందు వున్నారు కాబట్టి వారికి తక్కువ రిజర్వేషన్స్ , మాదిగలకు ఎక్కువ రిజర్వేషన్స్ రావటం ... ఎలా చూసినా సబబే! కాని, ఇప్పుడున్న రిజర్వేషన్ పద్ధతి యధాతథాంగా కొనసాగించాలని ఎస్సీల్లోని కొన్ని కులాలు కోరుకుంటున్నాయి.
ఎస్సీ వర్గీకరణ అంశాన్ని తెలుగు రాష్ట్రాల్లోని దాదాపు అన్ని పార్టీలు వీలైనప్పుడల్లా వాడుకున్నాయి. కాని, అధికారంలోకి వచ్చాక అందుకు తగిన ప్రయత్నం మాత్రం చేసినట్టు కనిపించదు. అయితే, తాజాగా జరిగిన ఎమ్మార్పీఎస్ ధర్మయుద్ధం సభ సాక్షిగా ఒక్కటి మాత్రం క్లియర్. కాంగ్రెస్, బీజేపి, సీపీఐ... ఇలా అన్ని పార్టీలు వర్గీకరణకు అనుకూలమే. అయినా పార్లమెంట్లో మాత్రం రాజ్యాంగ సవరణ జరగటం లేదు. ఎందుకు? రెండు దశాబ్దాలుగా మాదిగలు పోరాటం చేస్తున్నా ఎందుకు ఎవ్వరూ ముందుకు రావటం లేదు? కారణం ఓట్లు! వర్గీకరణ చేస్తే ఎస్సీల్లోని చాలా కులాల ఓట్లు కోల్పోవలసి వస్తుంది. అందుకు ఏ అధికార పార్టీ ఎప్పుడూ సిద్ధంగా వుండదు...
వెంకయ్య నాయుడే మాదిగల రిజర్వేషన్ డిమాండ్ సాకారమయ్యేలా చూడాలని మంద కృష్ణ తాజాగా అన్నారు. ఆ మధ్య ఆయన ఢిల్లీలో వెంకయ్యకి పాదాభివందనం కూడా చేశారు. దాని గురించి కృష్ణ వివరణ ఇస్తూ మాదిగల సంక్షేమం కోసం కాళ్లు మొక్కడం తప్పేం కాదని చెప్పారు. ఆ సంగతి ఎలా వున్నా ఇప్పుడు అధికారంలో వున్న బీజేపి కూడా ఎస్సీ వర్గకరణ అంశాన్ని తనదైన స్టైల్లో వాడుకుంటోందని సుస్పష్టం. ఆ ఉద్దేశమే లేకపోతే మాదిగల సభకి వెంకయ్య నాయుడు హాజరయ్యేవారే కాదు. ఇప్పుడు ఎలాగూ హాజరై తమ మద్దతు ప్రకటించారు కాబట్టి జనం కోరుకుంటున్నట్టు త్వరగా వర్గీకర్ణణ బిల్లు పార్లమెంట్లోకి తెస్తే ... అదన్నా ఒక చారిత్రక నిర్ణయం అవుతుంది. అలా కాకుండా మంద కృష్ణతో సహా లక్షలాది మంది మాదిగలు పెట్టుకున్న నమ్మకాన్ని వెంకయ్య, బీజేపి కూడా వమ్ము చేస్తే ... అది రాజకీయ కుల క్రీడ మాత్రమే అవుతుంది...
http://www.teluguone.com/news/content/-manda-krishna-37-69589.html





