1983లో జగజ్జేత కపిల్ సేనకు ఇచ్చింది రూ. 2100! మరీ ఇప్పుడు..
Publish Date:Jun 25, 2021
Advertisement
పసికూన జట్టు... బహుబలి టీమ్ తో తుది పోరులో తలపడుతోంది. పసికూనగా ఎంట్రీ ఇచ్చిన ఆ జట్టు ఫైనల్ కు చేరడమే అందరికి షాకింగ్..అలాంటిది ఫైనల్ లో అరవీర భయంకరమైన జట్టుతో పోటీ. ఇంకెం అందరూ ముందే ఫలితం చెప్పేశారు. మ్యాచ్ చూడటం కూడా వేస్టన్నారు కొందరు. కాని ఆ పసికూన జట్టు మేజిక్ చేసింది. సంచలన విజయం సాధించింది. క్రికెట్ లో జగజ్జేతగా నిలిచింది. పైన చెప్పిదంతా 1983, జూన్ 25.. లార్డ్స్ మైదానంలో జరిగిన మూడో క్రికెట్ వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ గురించే. అందరూ విండీస్ టీమే విజేత అని భావించారు. కానీ, అంచనాలు తలక్రిందులు చేస్తూ.. ఇంగ్లండ్ గడ్డపై తొడగొట్టింది కపిల్ సేన.1983 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ లో ఓటమి అంచునుంచి తప్పించుకోవడమే కాదు.. చరిత్రను తిరగరాసి మరీ విజయాన్ని సొంతం చేసుకుంది భారత్. కపిల్ దేవ్ టీమ్ జాతికి గర్వకారణంగా నిలిచింది. ఈ విజయానికి 2021, జూన్ 25తో 38 ఏళ్లు పూర్తయ్యాయి. కపిల్ దేవ్ సారథ్యంలో వెస్టిండీస్ తో తలపడిన భారత క్రికెట్ టీమ్ ముందు ఒక పెద్ద ఛాలెంజ్ ఉంది. అప్పట్లో వెస్టిండీస్ అంటే క్రికెట్‌లో బాహుబలి టీమ్. ఆ జట్టుతో పోటీ అంటేనే ప్రత్యర్థులు హడలిపోయేది. తొలి రెండు ప్రపంచ కప్ లను ఆ జట్టే గెలుచుకుంది. క్లైవ్ లాయిడ్, వివియన్ రిచర్డ్స్, మైకేల్ హోల్డింగ్, మాల్కమ్ మార్షల్ ఇలాంటి దిగ్గజాలు విండీస్ టీమ్ లో ఉండేవారు. అలాంటి టీమ్ ను చిత్తు చేసి సగర్వంగా నిలిచింది కపిల్ సేన. ఫైనల్ మ్యాచ్ లో భారత్ కేవలం 73 పరుగులుకే 7 వికెట్లు కోల్పోయింది. అంటే టాప్ అండ్ మిడిల్ అర్డర్ పూర్తిగా విఫలం అయింది. మొత్తంగా వెస్టిండీస్‌కు కేవలం 183 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. దీంతో విండీస్ ఆడుతు పాడుతూ గెలుస్తుంది అనుకున్నారు. కానీ క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు అంటారుగా.... ఈ మ్యాచ్‌లో కూడా సరిగ్గా అదే జరిగింది. అద్భుతం జరిగింది. భారత బౌలర్లు విండీస్ టీమ్‌ను 140 పరుగులకే ఆలౌట్ చేశారు. ఈ వరల్డ్ కప్ తర్వాత భారత క్రికెట్ రూపురేఖలే మారిపోయాయ్. క్రికెట్ ఒక మతంలా తయారైంది. అప్పడు పసికూనగా ఉన్న బీసీసీఐ..ఇప్పుడు ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన క్రికెట్ బోర్డుగా మారి..ప్రపంచ క్రికెట్ నే శాసించే స్థాయికి ఎదిగింది. అయితే 1983లో క్రికెట్ జగజ్జేతగా నిలిచిన కపిల్ సేన సంపాదన వివరాలు ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే.. క్రికెట్ పూర్తి కమర్షియల్ క్రీడగా మారిపోయాక ఆటగాళ్ల సంపాదన కళ్లు చెదిరే రీతిలో ఉంటోంది. మ్యాచ్ ఫీజ్, ఎండార్స్‌మెంట్లు, ఐపీఎల్.. ఇలా ఒక్కో ఆటగాడు కోట్లలో సంపాదిస్తున్నాడు. ఆటగాళ్లను వారి ప్రదర్శన ఆధారంగా ఎ+, ఎ, బి, సి కేటగిరీలుగా విడదీసి బీసీసీఐ వారితో ఒప్పందం కుదుర్చుకుంటోంది. `ఎ+`లో స్థానం సంపాదించిన ఆటగాడి వార్షికాదాయం ఏడు కోట్లు. `ఎ`లో ఉంటే 5 కోట్లు, `బి`లో ఉంటే 3 కోట్లు, `సి` అయితే కోటి రూపాయల చొప్పున సంవత్సరానికి చెల్లిస్తోంది. మ్యాచ్ ఫీజ్ కాకుండా ఎండార్స్‌మెంట్లు, ఐపీఎల్ ద్వారా వచ్చే సంపాదన అదనం. అయితే 1983లో ప్రపంచకప్ గెలిచి భారత్‌లో క్రికెట్‌కు విపరీతమైన ఆదరణ తీసుకొచ్చిన కపిల్ జట్టు అందుకున్న పారితోషికం ఎంతో తెలుసా? ప‌్రస్తుత ఆటగాళ్ల సంపాదనతో పోల్చి చూసుకుంటే కొన్ని వేల రెట్లు తక్కువ. 1983 సెప్టెంబర్‌లో భారత్, పాక్ మధ్య జరిగిన వన్డే ఎగ్జిబిషన్ మ్యాచ్ టీమ్ షీట్‌ను స్పోర్ట్స్ జర్నలిస్ట్ మక్రంద్ బయటపెట్టారు. అప్పట్లో ఇలా వేర్వేరు విభాగాల్లో ఆటగాళ్లను చేర్చి మ్యాచ్ ఫీజు చెల్లించే పద్ధతి లేదు.. మేనేజర్‌తో సహా ఆటగాళ్లందరికీ ఒకటే ఫీజు. ప్రపంచకప్ విజయం తర్వాత పాకిస్థాతో వన్డే మ్యాచ్ ఆడిన భారత ఆటగాళ్లు ఒక్కొక్కరు మ్యాచ్ ఫీజుగా రూ.1500, డైలీ అలవెన్స్ కింద మూడ్రోజులకు 600.. మొత్తం రూ.2100 అందుకున్నారు. ప్రస్తుతం `సి` గ్రేడ్‌లో ఉన్న ఆటగాడు ఒక్క వన్డే మ్యాచ్‌కు అందుకుంటున్నది అక్షరాలా ఆరు లక్షల రూపాయలు.
http://www.teluguone.com/news/content/india-won-first-wolrd-cup-in-1983-june-25-kapil-dev-team-25-118339.html





