అమెరికా టారిఫ్‌ల బాదుడు రూ.54 లక్షల కోట్లు?
Publish Date:Jan 6, 2026
Advertisement
అమెరికాకు త్వరలో 600 బిలియన్ డాలర్లు.. అంటే సుమారు రూ.54 లక్షల కోట్లు ఆదాయం సమకూరనుందని అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ప్రపంచ దేశాలపై తాను విధించిన టారిఫ్‌లను సమర్ధించుకుంటూ ఆ మేరకు పోస్టు పెట్టారు. టారిఫ్‌ల విషయంలోతాను అనుసరిస్తోన్న విధానాలు దేశాన్ని అర్థికంగా, భద్రతాపరంగా బలోపేతం చేశాయని గొప్పగా ప్రకటించుకున్నారు. దేశంపై గౌరవం లేని కొన్ని మీడియా సంస్థలు ఈ విషయాన్ని వెల్లడించేందుకు నిరాకరిస్తున్నాయని ఫైర్ అయ్యారు. ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి శత్రువు, మిత్రుడు అనే తేడా లేకుండా పలు దేశాలపై టారిఫ్‌ల మోత మోగిస్తున్నారు. రష్యా నుంచి ముడిచమురు కొంటున్నదన్న నెపంతో భారత్‌పై ఒత్తిడి తెచ్చేందుకు 50 శాతం సుంకాలు వేశారు. ఒకవైపు రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కోసం చర్చలు జరుగుతున్న సమయంలోనే ఆ మెత మోగించింది అమెరికా. అయితే ట్రంప్ విధించిన టారిఫ్‌లపై అమెరికా సుప్రీంకోర్టులో విచారణ కొనసాగుతోంది. ట్రంప్‌నకు టారిఫ్‌లు విధించే అధికారంపై అక్కడి సుప్రీంకోర్డు సమీక్షించి తీర్పు ఇవ్వనుంది. తీర్పు ఫలితం ఎలా ఉన్నా, అందుకు తాము సిద్దంగా ఉన్నామని వైట్‌హౌస్ ఇప్పటికే వెల్లడించింది. వైట్‌హౌస్ ప్లాన్-బితో సిద్దంగా ఉందనీ, ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు సిద్దంగా ఉన్నామని, అయితే సుప్రీంకోర్టు తీర్పు తమకు సానుకూలంగా వస్తుందన్న ఆశాభావంతో ఉన్నట్లు వైట్‌హౌస్ మీడియా ప్రతినిధి కరోలిన్ లీవిట్ గతంలోనే వెల్లడించారు. మొత్తానికి ట్రంప్ టారిఫ్‌ల పేరుతో పెద్ద మొత్తానికే ఎసరు పెడుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
http://www.teluguone.com/news/content/impact-of-american-tariffs-amount-to-54-lakh-crore-rupeed-36-212086.html





