బాబా రాందేవ్‌పై రూ.1000,00,00,000 దావా.. పరువు నష్టమా? ఐఎంఏకు కష్టమా?
Publish Date:May 26, 2021
Advertisement
రాందేవ్‌బాబా వర్సెస్ అల్లోపతి. ఆయుర్వేదం వర్సెస్ ఇంగ్లీష్ మెడిసిన్. వివాదం చినికిచినికి కోర్టు కేసుకు దారి తీసింది. అల్లోపతి వైద్యంపై ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన యోగా గురు రాందేవ్ బాబాపై ఉత్తరాఖండ్ వైద్యుల బృందం ఏకంగా వెయ్యి కోట్లకు పరువు నష్టం దావా వేసింది. 15 రోజుల్లోగా రాందేవ్ బాబా లిఖిత పూర్వక క్షమాపణలు చెప్పాలని.. లేదంటే రూ.1000 కోట్లు చెల్లించాలని ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్)-ఉత్తరాఖండ్ నోటీసులు పంపింది. రాందేవ్‌బాబాకి కోర్టు నోటీసులతో పాటు.. ఆయనసై సత్వరమే కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి తీరథ్ సింగ్ రావత్‌కు సైతం లేఖ రాసింది ఆ రాష్ట్ర ఐఎంఏ. అల్లోపతి వైద్యంపై ఇటీవల రాందేవ్ బాబా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ‘అల్లోపతి పనికి మాలిన వైద్యం’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. అలోపతి వైద్యం వైద్యమే కాదు. కరోనా మరణాలకు అలోపతి చికిత్సలో ఉన్న లోపాలే సగం కారణం.. అంటూ రామ్‌దేవ్ బాబా చేసిన కామెంట్లపై.. భారత వైద్య మండలితో పాటు కేంద్ర ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబా మీద చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎంఏ డిమాండ్ చేసింది. ఆయన మీద చర్యలు తీసుకోకుంటే, అలోపతిని వైద్యాన్ని మొత్తానికి మొత్తంగా రద్దు చేయండని కొంచెం తీవ్ర స్వరంతో హెచ్చరికలాంటి అభ్యర్ధన చేసింది. ‘అల్లోపతి వైద్యంపై మీ వ్యాఖ్యలు అత్యంత దురదృష్టకరం. ఇది కరోనా యోధులను అవమానించడమే కాదు.. ఆరోగ్య కార్యకర్తల మనోస్థైర్యాన్ని దెబ్బతీయడమే. మీ మాటలు ఉపసంహరించుకోండి’ అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్.. యోగా గురు రాందేవ్‌బాబాకు ఘాటుగా లేఖ రాశారు. దీంతో వెనక్కి తగ్గిన రాందేవ్.. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకున్నారు. అన్ని రకాల వైద్యాలను తాను గౌరవిస్తానని చెప్పారు. అంతటితో ఆ వివాదం ముగిసి పోతుంది అనుకుంటే, ఆ తర్వాత బాబా రాందేవ్ మరో బాంబు పేల్చారు. కొన్నింటికి అల్లోపతిలో శాశ్వత చికిత్స ఎందుకు లేదంటూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ)కు 25 ప్రశ్నలు సంధించారు. ఆ మేరకు ట్విటర్‌లో బహిరంగ లేఖ విడుదల చేశారు. బీపీ, మధుమేహానికి అల్లోపతిలో ఎందుకు శాశ్వత చికిత్స లేదు? థైరాయిడ్, ఆర్థరైటిస్, కోలిటిస్, ఉబ్బస వ్యాధుల శాశ్వత నివారణకు ఫార్మా కంపెనీల దగ్గర మందులు ఉన్నాయా? కాలేయ వ్యాధి చికిత్సకు, గుండెలో అడ్డంకులకు, కొవ్వుకు ఎలాంటి చికిత్సలు ఉన్నాయి? పార్శపు నొప్పి, మతిమరుపు, పార్కిన్‌సన్ వ్యాధులను ఏ విధంగా నయం చేస్తారు? అంటూ ‘ఐఎంఏ’ ముందు తమ సందేహాలను ఉంచారు. రాందేవ్ బాబా లేఖతో ఆగ్రహించిన ఐఎంఏ-ఉత్తరాఖండ్ తాజాగా ఆయనపై వెయ్యి కోట్లకు పరువునష్టం దావా వేయడం కలకలం రేపింది. అల్లోపతికి కేవలం 2 వందల ఏళ్ల చరిత్ర మాత్రమే ఉందని.. ఆయుర్వేదానికి శతాబ్దాల చరిత్ర ఉందని రాందేవ్ బాబా గుర్తు చేశారు. అల్లోపతి అన్నింటికీ సమాధానమైతే.. వైద్యులకు ఎటువంటి రోగమూ రాకూడదని రాందేవ్ బాబా అభిప్రాయపడ్డారు. నిజానికి బాబా రాందేవ్ వ్యక్త పరిచిన అనుమానాలు, ఆయా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న అందరినీ వేధిస్తున్న ప్రశ్నలు, అనుమానాలే కాబట్టి, అందులో అల్లోపతి విధానాన్ని అవమానించడమో మరొకటో లేదు. కారణాలు ఏవైనా విభిన్న వైద్య విధానాల మంచి చెడులు, బాగోగులపై చర్చకు కరోనా ఒక అవకాశాన్ని కలిపించింది. కాబట్టి, ఈ చర్చ మరింత నిర్మాణాత్మకంగా కొనసాగితే, విభిన్న వైద్య విధానాల విషయమలో గల విబేధాలు తొలిగిపోయి , అవగాహన పెరుగుతుందని నిపుణులు సూచిస్తున్నారు. అంతేగాని కోర్టు కేసులతో విషయాన్ని వివాదంగా మార్చడం మినహా మరేమీ ప్రయోజనం ఉండదంటున్నారు.
http://www.teluguone.com/news/content/ima-files-1000-crore-defamation-case-on-baba-ramdev-online-39-116287.html





