ఐదు రాష్ట్రాల్లో వ్యాక్సిన్ వృధా ఎక్కువ.. మోడీకి షాకిచ్చిన కెప్టెన్
Publish Date:May 26, 2021
Advertisement
దేశంలో కరోనావైరస్ సెకండ్ వేవ్ విజృంభిస్తోంది. కరోనా కట్టడికి వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో కోవిడ్-19 టీకా కోసం జనం ఎగబడుతున్నారు. కొన్నిచోట్ల వ్యాక్సిన్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. అసలే కరోనా వ్యాక్సిన్ల కొరత ఉండగా, పలు రాష్ట్రాలు టీకాలు వేసే క్రమంలో వ్యాక్సిన్‌ను వృథా చేస్తున్నాయి. దేశంలో ఎక్కువగా జార్ఖండ్ రాష్ట్రంలో 37.3 శాతం వ్యాక్సిన్ వృథా చేశారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఛత్తీస్‌గడ్ రాష్ట్రంలో 30.2 శాతం, తమిళనాడులో 15.5 శాతం, జమ్మూకాశ్మీర్లో 10.8 శాతం, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో 10.7 శాతం వ్యాక్సిన్‌ను వృథా చేశాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. వ్యాక్సిన్ వృథాలో జాతీయ సగటు 6.3 శాతంగా ఉంది. కోవిడ్ వ్యాక్సిన్ వృథాను తగ్గించాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ ఇప్పటికీ రాష్ట్రాలకు సూచిస్తూనే ఉంది. అంతకు ముందు స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం వ్యాక్సిన్ వృధాను తగ్గించాలని రాష్ట్రాలను కోరారు. కోవిడ్ వ్యాక్సినేషన్ అనంతరం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఉన్న సర్టిఫికెట్‌ను మంజూరు చేస్తున్నారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాలు మినహా.. అన్ని ప్రభుత్వాలు నరేంద్రమోదీ ఉన్న వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌నే మంజూరు చేస్తున్నాయి. గతంలో జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నుంచి పీఎం ఫొటోను తొలగించాయి. తాజాగా మరో రాష్ట్రం కూడా ప్రధాని మోదీ ఫొటోను తొలగించింది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ సర్టిఫికెట్ నుంచి ప్రధానమంత్రి నరేంద్రమోదీ చిత్రాన్ని పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వం తొలగించింది. 18-44 ఏళ్ల వయసు వారికి కోవిడ్ టీకాల కార్యక్రమంలో భాగంగా డిజిటల్ సర్టిఫికెట్లలో మోదీ ఫొటోను తొలగించింది. పంజాబ్‌లో భవన నిర్మాణ కార్మికులు, దీర్ఘకాలిక వ్యాధులున్న వారు, ఫ్రంట్ లైన్ ఆరోగ్య కార్యకర్తలకు ప్రాధాన్యమిచ్చి 18-44 ఏళ్ల వయసు వారికి వ్యాక్సిన్లను వేగంగా వేస్తున్నారు. టీకాల రిజిస్ట్రేషన్ కోసం కోవిన్ యాప్ కాకుండా పంజాబ్ కోవా యాప్‌లో నమోదుచేసుకోవాల్సి ఉంటుంది. టీకాలు తీసుకున్న అనంతరం కేంద్ర కోవిన్ యాప్‌నకు బదులు పంజాబ్‌కు కోవా యాప్ నుంచి ప్రధాని నరేంద్రమోదీ చిత్రం లేకుండా సర్టిఫికెట్లను జారీ చేస్తున్నారు. ప్రధాని చిత్రాన్ని తొలగించడంతోపాటు పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ చిత్రాన్ని కూడా సర్టిఫికెట్లలో చేర్చ లేదని అధికారులు వెల్లడించారు. ఎవరి చిత్రాలు లేకుండా కేవలం తాము టీకా సర్టిఫికెట్లను మాత్రమే జారీ చేస్తున్నామని అధికారులు వివరించారు. జార్ఖండ్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ సర్టిఫికెట్లపై ఆయా రాష్ట్రాల సీఎంల ఫొటోలు ఉంటాయని.. కానీ పంజాబ్‌లో అలా ఎవరి ఫొటోలను ఉంచడం లేదు.
http://www.teluguone.com/news/content/five-states-covid-vaccine-wastsge-high-39-116289.html





