సమయం చూసి షాక్.. కేసీఆర్ సర్కార్ లో టెన్షన్! రంగంలోకి ఈటల..
Publish Date:May 26, 2021
Advertisement
దేశమంతా కరోనా మహమ్మారి కల్లోలం రేపుతోంది. కొవిడ్ జనాలు పిట్టల్లా రాలిపోతున్నారు. రోగులకు సరైన చికిత్స అందడం లేదు. తెలంగాణలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. రోజూ వేలాది కొత్త కేసులు నమోదవుతుండటంతో హాస్పిటల్స్ లో బెడ్లు దొరకడం లేదు. ఒత్తిడి పెరిగినా రోగులకు చికిత్స అందిస్తున్నారు వైద్యులు. ఈ సమయంలో తెలంగాణ సర్కార్ కు షాక్ తగిలింది. పెండింగ్ సమస్యలు పరిష్కరించాలంటూ చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న జూనియర్ డాక్టర్లు.. సమయం చూసి మరీ దెబ్బ కొట్టారు. తెలంగాణవ్యాప్తంగా జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు.పెంచిన స్టైఫండ్‌ను వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. పెండింగ్‌లో ఉన్న తమ డిమాండ్లను నెరవేర్చకపోతే నేటి నుంచి ఎమర్జెన్సీ, ఐసీయూ సేవలు మినహా మిగితా వైద్య సేవలు బహిష్కరిస్తామని జూడాలు ముందుగానే ప్రకటించారు. ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకుంటే మే 28 నుంచి కొవిడ్ అత్యవసర సేవలను కూడా బహిష్కరిస్తామని అల్టిమేటం జారీ చేశారు. తమ డిమాండ్లు పరిష్కరించాలంటూ జూనియర్ డాక్టర్లు రెండు వారాల క్రితమే ప్రభుత్వాన్ని కోరారు. రెండు వారాల్లో సమస్యలు పరిష్కరించుకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. గతంలో ప్రభుత్వం తమకు హామీ ఇచ్చిన విధంగా 15 జీతం పెంచాలని డిమాండ్ చేశారు. దీంతో పాటు 10 శాతం ఇన్సెంటివ్ చెల్లించాలని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రోగులకు వైద్యం చేస్తున్న చాలామంది డాక్టర్లు కూడా చనిపోయారని.. వారిని అదుకునేందుకు ప్రభుత్వం జారీ చేసిన జీవో ఇంతవరకు అమలు చేయడం లేదని జూనియర్ డాక్టర్లు ఆరోపిస్తున్నారు. జీవోలు కేవలం కాగితాల వరకు మాత్రమే పరిమితమవుతున్నాయని జుడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూనియర్ డాక్టర్ల సమ్మెతో హాస్పిటల్స్ లో కొవిడ్ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 28 నుంచి అత్యవసర సేవలు బహిష్కరిస్తామని చెబుతుండటంతో ఆందోళన మరింత పెరిగిపోతోంది. జూనియర్ డాక్టర్ల వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. జూడాల సమ్మెకు ఇది సరైన సమయం కాదని ఆయన వ్యాఖ్యానించారు. జూనియర్ డాక్టర్లు తక్షణమే సమ్మె విరమించి విధుల్లో చేరాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. జూడాల సమస్యలను ప్రభుత్వం పరిశీలిస్తోందని స్పష్టం చేశారు. జూనియర్ డాక్టర్లు సమ్మె విరమించకపోతే చర్యలు తప్పవని మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. జూనియర్ డాక్టర్ల సమ్మెపై ప్రభుత్వం ఏ రకంగా వ్యవహరిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం తెలంగాణలో వైద్య, ఆరోగ్యశాఖ సీఎం కేసీఆర్ దగ్గరే ఉంది. ఆయనే ఈ శాఖ వ్యవహారాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఆస్పత్రులను కూడా సందర్శిస్తున్నారు. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో జూనియర్ డాక్టర్ల డిమాండ్‌పై ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ? వారి సమస్యల పరిష్కారానికి కచ్చితమైన హామీ ఇస్తారా ? అన్నది ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కరోనా మహమ్మారి పూర్తిగా పోకముందే రెసిడెంట్, జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగడం భావ్యం కాదని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పేద ప్రజల ప్రాణాలు దృష్టిలో ఉంచుకుని సమ్మెపై పునరాలోచించాలని డాక్టర్లను కోరారు. కరోనా కష్ట కాలంలో డాక్టర్లు అందించిన సేవలు చరిత్రలో నిలిచిపోతాయని కొనియాడారు. ప్రభుత్వం వెంటనే స్పందించి వారి డిమాండ్లు అన్నింటినీ నెరవేర్చాలని ఈటల డిమాండ్ చేశారు. పెంచిన స్టైఫండ్ వెంటనే అందించి సమ్మె విరమింపజేసేలా చూడాలన్నారు. తాను ఆరోగ్యశాఖమంత్రిగా ఉన్నంతకాలం డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఎలాంటి సమస్య వచ్చినా.. వెంటనే స్పందించి వారితో చర్చలు జరపడం వల్ల పేదప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తపడ్డామని, ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం కూడా వెంటనే స్పందించాలని రాజేందర్ అన్నారు.
http://www.teluguone.com/news/content/telangana-juniour-docters-protest-39-116284.html





