వండిన కూర నచ్చలేదని భార్యపై దాడి .. నవవధువు మృతి..!
Publish Date:Aug 11, 2026
Advertisement
పెళ్లైన ఆరు నెలల్లోనే విషాదం..! పెళ్లై ఆరు నెలలే... కాళ్ల పారాణి ఆరకముందే ఆమె జీవితం విషాదంగా ముగిసింది. కోటి ఆశలతో అత్తింట్లో అడుగుపెట్టిన నవవధువు.. భర్త కోసం వండిన కూరే చివరకు ఆమె ప్రాణాలు తీసేంతటి విషాదానికి కారణమైంది. కూర రుచిగా లేదన్న చిన్న మాటతో మొదలైన గొడవ.. క్షణాల్లో తీవ్ర రూపం దాల్చింది. భర్త నెట్టడంతో గోడకు తల బలంగా తగిలి.. ఆ యువతి అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదు. ఆరు నెలల వైవాహిక బంధం.. అంతలోనే కుటుంబానికి కన్నీటి జ్ఞాపకంగా మిగిలిపోయింది. హైదరాబాద్ కాటేదాన్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. వండిన కూర నచ్చలేదన్న కారణంతో భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ.. చివరకు భార్య మృతికి దారితీసింది. కాటేదాన్ పరిధిలోని శ్రీరాం నగర్‌లో ఈ ఘటన జరిగింది. శిక్షాంజలి కుమారికి చందన్ కుమార్‌తో ఆరు నెలల క్రితం వివాహమైంది. పెళ్లైన కొద్దిరోజులకే ఆర్థిక ఇబ్బందుల కారణంగా దంపతుల మధ్య తరచూ గొడవలు జరిగేవని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. తాజాగా వండిన కూర రుచిగా లేదంటూ భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. మాటామాటా పెరగడంతో చందన్ కుమార్ ఆగ్రహానికి గురై శిక్షాంజలి కుమారిని బలంగా నెట్టినట్లు తెలుస్తోంది. దీంతో ఆమె తల గోడకు బలంగా తగిలి కిందపడిపోయింది. వెంటనే ఆమె స్పృహ కోల్పోవడంతో చందన్ కుమార్ ఆస్పత్రికి తరలించాడు. ఉస్మానియా ఆస్పత్రిలో వైద్యులు పరీక్షించగా.. అప్పటికే శిక్షాంజలి కుమారి మృతి చెందినట్లు నిర్ధారించారు. కూతురిని అత్తింటికి పంపిన ఆరు నెలల్లోనే ఆమె మృతిచెందడంతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. జీవితాంతం కలిసి ఉంటారని ఆశించిన కుటుంబానికి ఈ ఘటన తీరని విషాదాన్ని మిగిల్చింది. ఈ ఘటనపై మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. చందన్ కుమార్‌ను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు ఘటన ఎలా జరిగింది? దాడికి దారితీసిన పరిస్థితులు ఏమిటి? అనే కోణాల్లో పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. Hyderabad Crime, Katedan Incident, Mylardevpally Police, Newlywed Woman Death,
Wife Death, Husband Wife Dispute, Domestic Dispute,Shikhanjali Kumari, Chandan Kumar
Osmaniya Hospital
http://www.teluguone.com/news/content/hyderabad-crime-36-228617.html





