తెలంగాణ సీఎం రేవంత్ కు సుప్రీంలో భారీ ఊరట
Publish Date:Feb 17, 2026
Advertisement
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో గతంలో ఆయనపై నమోదైన ఎఫ్‌ఐఆర్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్ధిస్తూ తీర్పు వెలువరించింది. 2016 జనవరి 12న అప్పట్లో ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్‌రెడ్డి ప్రోద్బలంతో ఎ.కొండల్‌రెడ్డి, ఇ.లక్ష్మయ్య అనే ఇద్దరు హైదరాబాద్ గోపనపల్లి సొసైటీ భూముల్లో ఒక గదిని జేసీబీతో ధ్వంసం చేశారని ఆరోపణలు వచ్చాయి. అందుకు అడ్డుచెప్పిన తనను కులం పేరుతో దూషించారని ఎన్.పెద్దిరాజు అనే వ్యక్తి గతంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద ఫిర్యాదు చేశారు. ఈ కేసు ఎఫ్ఐఆర్‌ను హైకోర్టు కొట్టివేయడంతో, పెద్దిరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను విచారించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి, జస్టిస్ వీఎం పంచోలిలతో కూడిన ధర్మాసనం సోమవారం (ఫిబ్రవరి 16) ఈ కేసును రాజకీయ ప్రేరేపితం అంశంగా పేర్కొంటూ డిస్మిస్ చేసింది. ఈ సందర్భంగా సుప్రీం ధర్మాసనం.. రాజకీయ కక్షల కోసం న్యాయస్థానాలకు రావొద్దని పిటిషనర్ కు చెప్పింది. ఈకేసులో ప్రభుత్వం తరఫున న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు.
http://www.teluguone.com/news/content/huge-relief-to-revanth-in-supreme-court-36-214222.html





