సాధారణ మతగురువు కుమారుడు ఇరాన్ నియంత ఎలా అయ్యారు?
Publish Date:Mar 2, 2026
Advertisement
ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ మరణం ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్త దాడిలో ఆయన హతం కావడం ప్రపంచ రాజకీయాల్లో పెను ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ఒక సామాన్య మత గురువు కొడుకుగా మొదలై... ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన నియంతల్లో ఒకరిగా ఎదిగిన ఖమేనీ ప్రస్థానం ఎలా సాగిందని చూస్తే.. ఖమేనీ చేసిన విప్లవ పోరాటాలే ఆయన జీవితాన్ని మలుపు తిప్పాయి. 1960ల కాలంలో షా చక్రవర్తి పాలనకు వ్యతిరేకంగా పోరాడారు ఖమేనీ. అనేక సార్లు జైలు శిక్ష అనుభవించారు కూడా. 1979లో ఇస్లామిక్ విప్లవం తర్వాత అయతుల్లా ఖొమేనీకి రైట్ హ్యాండ్ గా మారారు. చాలా మంది అనుకుంటారు ఖొమేనీ, ఖమేనీ ఒకరేనని. ఇద్దరూ వేరు వేరు. ఖమేనీ గురువు ఖొమేనీ. గురువు ఖొమేనీ తాతలు భారత్ లోని ఉత్తర ప్రదేశ్ కి చెందిన బారాబంకీ కి చెందిన వారు. గురువు లాంటి పేరు కలిగి ఉన్న ఖమేనీ.. దశ తిరిగి 1981 నుంచి 1989 వరకూ ఇరాన్ అధ్యక్షుడిగా పని చేశారు. సరిగ్గా 1989లో ఆయన గురువు ఖొమేనీ మరణించారు.. దీంతో ఇరాన్ అత్యున్నత మండలి ఖమేనీని సుప్రీం లీడర్ గా ఎంపిక చేసింది. అక్కడి నుంచి ఆయన తిరుగులేని విధంగా సుమారు 37 ఏళ్ల అప్రతిహతంగా ఇరాన్ కి అగ్ర నాయకత్వం వహించారు. ఒక రకంగా చెబితే ఇరాన్ ని తన గుప్పెట్లో పెట్టుకున్నారు. ఖమేనీ పాలనలో ఇరాన్ ఎలాంటి అభివృద్ధి చవి చూసింది. ఆ వివరాలేంటని చూస్తే.. ఇరాన్ సైనిక శక్తిని ఒక రిజినల్ సూపర్ పవర్ గా తీర్చి దిద్దిన ఘనత ఖమేనీది. స్వదేశీ సాంకేతికతతో మిస్సైళ్ల తయారీ, డ్రోన్ అటాకింగ్, ఆపై అణు కార్యక్రమాలను అభివృద్ధి చేశారు. ఖమేనీ నాయకత్వంలోని ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన దళంగా తయారైంది. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్, రోడ్లు, విద్యారంగంలో పురోగతి.. ఖమేనీ నాయకత్వంలోనే సాధ్యమయ్యాయి. మధ్య ప్రాచ్యంలో లెబనాన్, సిరియా, యెమన్ లలో ఇరాన్ ప్రభావాన్ని మరింత పెంచింది కూడా ఆయనే. అయితే ఇదంతా ఎలా తయారైందంటే.. ఇస్లామిక్ రివల్యూషన్లో భాగంగా.. కేవలం సైనిక శక్తి పెరుగుదల కోసమే జరిగింది తప్ప.. సామాన్యుడ్ని ఆర్ధికంగా అభివృద్ధి చేయడంకోసం కాదు. ఇదే ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకత పెరిగేలా చేసింది. ఇరాన్ చమురు సంపదను ప్రజల కోసం వాడకుండా.. విదేశాల్లోని హిజ్బుల్లా, హమాస్ వంటి ఉగ్ర సంస్థల కోసం ఖర్చు చేయడం.. చేటు తెచ్చింది. ఇటు ఇజ్రాయెల్, అమెరికా వంటి దేశాలతో శతృత్వం కొని తెచ్చుకోవడంతో పాటు.. అటు ప్రజా వ్యతిరేకతా పెల్లుబికేలా చేసింది. దీంతో అంతర్జాతీయ ఆంక్షలు పెరిగి ద్రవ్యోల్బణం 50 శాతానికి పైగా చేరింది. స్వేచ్ఛను కోరుకునే యువత, మహిళలను మరింత క్రూరంగా అణగదొక్కే యత్నం చేశారు. 2022లో మహ్సా అమిని మరణం తర్వాత మొదలైన నిరసనలు.. ఖమేనీపై అప్పటి వరకూ ఉన్న గౌరవం, భయాన్ని తుడిచిపెట్టేశాయి. ఇక ఐఆర్జీసీ నేతలు, మత పెద్దల చేతుల్లోనే దేశ సంపద మొత్తం కేంద్రీ కృతం కావడం కూడా ప్రమాదకరంగా మారింది. మతపరమైన కట్టుబాట్లను బలవంతంగా రుద్దడం కూడా విద్యావంతులైన యువత దేశం వదిలి వెళ్లేలా చేసింది. ప్రస్తుతానికైతే ఇరాన్ ఒక చారిత్రక మలుపులో ఉంది. ఒక రకంగా చెబితే ఇదొక సంధి కాలం. ఫిబ్రవరి చివరి వారంలో ఇజ్రాయెల్, అమెరికా చేసిన సంయుక్త వైమానిక దాడుల్లో.. ఖమేనీ నివాసం, ఐఆర్జీసీ ప్రధాన కార్యాలయాలు రెండూ ధ్వంసమయ్యాయి. ఇక ఖమేనీ మరణించిన తర్వాత ఆయన రెండో కుమారుడు మజ్తబా ఖమేనీని గద్దెనెక్కించాలని చాందస వాద గ్రూపులు ప్రయత్నిస్తుండగా.. సామాన్యులు మాత్రం మాకు రాజరిక పాలన , మత పాలన వద్దంటూ రోడ్డెక్కుతున్నారు. దీంతో ప్రస్తుత ఇరాన్ పాలన అలీరెజా అరాఫీ నాయకత్వంలోని తాత్కాలిక మండలికి అప్పగించారు. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ముల్లా రాజ్ అంటే.. మతగురువుల పాలనకు స్వస్తి పలికేలా కనిపిస్తోంది. పాశ్చాత్య దేశాలు ఇక్కడ కూడా ప్రజ్వామ్య పాలన తీసుకురావాలని ప్రయత్నిస్తున్నాయి. ఆయనింతటి సైనిక శక్తి తయారు చేయడం వెనక దాగిన అసలు నిజం ఏ పాశ్చాత్య శక్తికీ ఇరాన్ లొంగి ఉండాలనుకోవడం లేదని చాటి చెప్పడానికే నంటూ ఖమేనీ చివరి సందేశంలో పేర్కొన్నారు. అయతుల్లా అలీ సయద్ ఖమేనీ.. ఒక్క దేవుడికి తప్ప ఎవరికీ విధేయత ప్రకటించడన్నదే ఆయని చివరి ప్రసంగ పాఠం. ఇదే ఆయన్ను ఇవాళ్టి దుస్థితికి తీసుకొచ్చి పెట్టింది. మారుతున్న పరిణామ క్రమాలకు అనుగుణంగా మారక పోవడం ఖమేనీ దుర్మరణానికి కారణంగా నిలిచింది. దేశ సంపదనంతా ఆయన ఖర్చు చేసింది.. ఇలాంటి రోజు ఒకటి వస్తే ఎదుర్కుందామనే. కానీ ఆ సైనిక అణు శక్తి.. ఇజ్రాయెల్, అమెరికా సేనల ముందు తేలిపోవడంతో ఇరాన్ సుప్రీం లీడర ఖమేనీ ప్రాణం అనంత వాయువుల్లో కలిసింది. ఇది ఒక నియంత చివరి అంకం.
1939 ఏప్రిల్ 19న ఇరాన్ లోని పవిత్ర నగరం మషద్ లో జన్మించారు ఖమేనీ. ఆయన తండ్రి ఒక సాధారణ మత గురువు. చిన్నతనంలోనూ అంటే, నాలుగేళ్ల వయసులోనే ఖురాన్ పఠనం మొదలు పెట్టారు ఖమేనీ. మషద్, క్వామ్ వంటి నగరాల్లో ఉన్నత చదువులు చదివారు. ఆయనకు అరబిక్, పర్షియన్ భాషల్లో మంచి పట్టు ఉంది.
http://www.teluguone.com/news/content/how--son-of---ordinary-cleric-become--dictator-36-214851.html





