కొండా సురేఖ నివాసం వద్ద అర్థరాత్రి హైడ్రామా
Publish Date:Oct 15, 2025
Advertisement
తెలంగాణ అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఇంటి వద్ద బుధవారం (అక్టోబర్ 15) అర్ధరాత్రి హైడ్రామా చోటుచేసుకుంది. మంత్రి సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కోసం గాలింపు చర్యలలో భాగంగా పోలీసులు జూబ్లీహిల్స్‌లోని మంత్రి కొండా సురేఖ నివాసానికి వెళ్లారు. ఆ సందర్భంగా అక్కడ హైడ్రామా చోటు చేసుకుంది. తమ ఇంటికి ఎందుకు వచ్చారంటూ కొండా సురేఖ కుమార్తె కొండా సుస్మిత పోలీసులతో వాగ్వాదానికి దిగారు. విషయమేంటంటే.. కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ ను ప్రభుత్వం మంగళవారం (అక్టోబర్ 14) విధుల నుంచి తొలగించింది. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ)లో ఓఎస్డీగా నియమితులైన సుమంత్ అధికారులపై ఒత్తిడి తేవడం, కాలుష్య పరిశ్రమల నిర్ణయాల్లో జోక్యం చేసుకోవడం వంటి తీవ్ర అవినీతి ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఆయనను విధుల నుంచి తొలగించినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా డెక్కన్ సిమెంట్ కంపెనీ ఫైలు విషయంలో సుమంత్ తుపాకీతో బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలపై విచారణ అనంతరం ప్రభుత్వం అతడిపై వేటు వేసింది. విధుల నుంచి తొలగించిన తరువాత సుమంత్.. మంత్రి సురేఖ నివాసంలోనే ఉన్నారనే సమాచారంతో బుధవారం రాత్రి వరంగల్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంత్రి ఇంటికి వచ్చారు. ఈ సందర్భంగా కొండా సురేఖ కుమార్తె వారితో వాగ్వాదానికి దిగారు. తాము ఏ ప్రభుత్వంలో ఉన్నామో అర్ధం కావడం లేదని ఆగ్రహం వ్యక్తం చేచ శారు. సుమంత్‌పై నమోదైన కేసు వివరాలు స్పష్టంగా చెప్పకుండా, అరెస్ట్ వారెంట్ చూపించకుండా తమ ఇంట్లోకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. ఈ లోగా అక్కడకు మీడియా రావడంతో పోలీసులు వెనక్కు తగ్గారు. ఈ సందర్భంగా కొండా సుస్మిత మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్సీ వేం నరేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి తమ కుటుంబంపై రాజకీయ కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. బీసీ మంత్రి అయిన తన తల్లి కొండా సురేఖను రాజకీయంగా అణగదొక్కే ప్రయత్నం జరుగుతోందన్నారు. బీసీలకు అన్యాయం జరుగుతోందని, కాంగ్రెస్ పార్టీకి నమ్మకంగా ఉండటమే తాము చేసిన తప్పా అని ప్రశ్నించారు.
http://www.teluguone.com/news/content/hig-drama-at-minister-konda-surekha-house-39-208015.html





