జనం తిరగబడితే ఖాకీల గతేంటి?
Publish Date:Aug 26, 2022
Advertisement
ఏపీ పోలీసులు వ్యవహరిస్తున్న తీరుతో సామాన్య జనంలో సైతం తీవ్రం అసంతృప్తి పెరిగిపోతోంది. అధికార పార్టీ కొమ్ము కాస్తున్న కొందరు పోలీసులపై ప్రజలు బహిరంగంగానే రగిలిపోతున్నారు. ప్రధానంగా రాయలసీమ జిల్లాల్లో కొందరు పోలీసుల వ్యవహార శైలిపై పెద్ద ఎత్తున , ఆగ్రహావేశాలు, వ్యతిరేకత వ్యక్తం అవుతున్నాయి. ఏపీలో పోలీసుల నిర్లక్ష్య ధోరణి వల్లే శాంతి భద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తాజాగా తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటన రెండో రోజున అధికార పార్టీ నేతలు దాడులకు దిగడం, పోలీసులు లాఠీచార్జి చేయడంపై తీవ్రంగా స్పందించారు. ఏపీ మొత్తంలో పోలీసులు 60 వేల మంది ఉంటే.. టీడీపీ కార్యకర్తలు 60 లక్షల మంది ఉన్నారని, వారంతా వచ్చి మీ మీద పడితే ఏమవుతుందో ఊహించుకోవాలని హెచ్చరించారంటేనే పోలీసుల తీరు ఎలా ఉందో అర్ధమౌతుంది. చంద్రబాబు నాయుడు ఎలాంటి సందర్భంలో అయినా సాధారణంగా సంయమనం కోల్పోకుండా మాట్లాడతారు. అలాంటి చంద్రబాబునే పోలీసులు తీరు ఇంతలా రగిలించిందంటే.. ఇక సాధారణ కార్యకర్తలు, ప్రజలలో ఆగ్రహావేశాలు కట్టలు తెంచుకుంటున్నాయని వేరేగా చెప్పనవసరం లేదు. ‘టీడీపీ కార్యకర్తలను కొడితే.. మీ ఇళ్లకు వచ్చి కొడతా’ అని హెచ్చరించే దాకా చంద్రబాబులో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. చంద్రబాబు కుప్పం పర్యటన సమయంలోనే అధికార పార్టీ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుంటూ ముందుకు వెళ్లినా.. టీడీపీ ఫ్లెక్సీలను చించేసినా.. అన్నా క్యాంటీన్ ను ధ్వంసం చేస్తున్నా పోలీసులు వాళ్లకు కనీసం అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. అంతే కాదు టీడీపీ కార్యకర్తలపై దాడులకు దిగినా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడాన్ని సర్వత్రా తప్పుపడుతున్నారు. ఏపీలో పోలీసుల తీరు ఇంకా ఇలాగే అధికార పార్టీకి కొమ్ము కాసేలా ఉంటే.. భవిష్యత్తులో తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకడమే కాకుండా.. జనాగ్రహంలో వారు కొట్టుకుపోయే పరిస్థితులు వస్తాయని పలువురు అంటున్నారు. ఈ క్రమంలోనే ఒక సీఐని తీరుపై విపక్షకార్యకర్తలు కోపంతో రగిలిపోతున్నారు. జనం నీతి నిజాయితీ ముందు ఖాకీ డ్రెస్ వేసుకుని వీరుల్లా విర్రవీగుతున్న పోలీసులు చిత్తుకాగితం లాంటి వారే అని జనం వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం. ఇప్పుడు అధికార పార్టీకి కొమ్ము కాసిన పోలీసులకు భవిష్యత్తులో అవమానాలు, ఇబ్బందులు తప్పకపోవచ్చంటున్నారు. అసలు జనమే తిరగబడితే.. పోలీసులు తాము ఏమైపోతామనేది ఊహించుకోవాలని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/what-will---police-do-if-people-revolt-25-142702.html





