క్రీడలను పట్టించుకోని ప్రభుత్వాలు
Publish Date:Jul 16, 2014
Advertisement
ప్రపంచంలో ఏవయినా అంతర్జాతీయ క్రీడా పోటీలు జరిగిన ప్రతీసారి భారతీయులందరిలో ఒకటే ప్రశ్న తలెత్తుతుంటుంది. చిన్నచిన్న దేశాలు సైతం మెడల్స్ గెలుచుకొంటున్నాయి. కానీ 120కోట్ల జనాభా ఉన్న భారతదేశం ఒక్క మెడల్ కూడా ఎందుకు గెలుచుకోలేకపోతోంది? అనేదే అందరి ప్రశ్న. మొన్న ముగిసిన అంతర్జాతీయ ఫుట్ బాల్ పోటీలలో భారత్ ఊసేలేదు. ఏమంటే భారతీయులు కేవలం క్రికెట్ ఆట మీదనే మక్కువ చూపుతారనే కుంటి సాకు ఒకటి చెప్పుకొంటాము. కానీ అసలు కారణాలు వేరే చాలానే ఉన్నాయని ప్రజలందరికీ తెలుసు. గత మూడు దశాబ్దాల నుండి తల్లితండ్రులు పిల్లలకి బొమ్మలు, చాక్లెట్లు, ఐస్ క్రీములు కొనిపెట్టినట్లే చదువుని కూడా కొనిపెట్టడం ఆరంభించినప్పటి నుండీ వారు మనుషులుగా కాక మార్కులు సంపాదించే యంత్రాలుగా మారిపోయారు. స్కూళ్ళు కాలేజీలు కూడా ఆ మార్కుల యంత్రాలను ఉత్పత్తి చేసే కేంద్రాలుగా మారిపోయాయి. దానితో బాటే వందల కొద్దీ టీవీ ఛానళ్ళు, ఫేస్ బుక్కులు, సెల్ ఫోన్ చాటింగులు, ఇంటర్ నెట్, వీడియో గేములు అన్నీ ఒకటొకటిగా, పిల్లల బాల్యాన్ని మింగేసాయి. ఉమ్మడి కుటుంబాల స్థానంలో మినీ కుటుంబాలు, విచ్చినమయిన కుటుంబాలు వంటివి కూడా పిల్లల జీవన శైలిని పూర్తిగా మార్చివేశాయి. ఇక ప్రభుత్వాలు కూడా క్రీడలను ఎన్నడూ సీరియస్ అంశంగా భావించలేదు. క్రీడల పట్ల సహజంగా ఆసక్తి ఉన్నవారు లేదా ఎవరి వల్లనయినా ప్రేరణ పొందిన వారు, ఓపికుంటే నలుగురి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలుకొని స్వయంకృషితో పైకి ఎదగాలి తప్ప ప్రభుత్వం ఎన్నడూ అటువంటి వారిని గుర్తించి వారికి అండగా నిలిచిన సందర్భాలు అరుదు. ప్రభుత్వాలు ఎప్పుడు గుర్తిస్తాయంటే వారు స్వయంకృషితో విజయాలు సాధించి చూపినపుడు. అంతవరకు వారు ఒంటరి పోరాటం చేయవలసిందే. ఇక క్రీడలలో సౌకర్యాలు, శిక్షణా మాట దేవుడెరుగు ముందు కులం, మతం, ప్రాంతం, బాష, ధనం, రాజకీయ ప్రభావాలను తట్టుకొని పైకి ఎదగాలంటే ఎంత కష్టమో ఆ బాధలు అనుభవించిన వారికే తెలుసు. ఇటువంటి లక్షా తొంబై కారణాల వల్లనే 120 కోట్ల భారతీయులలో కోటికొక్క క్రీడాకారుడు, క్రీడాకారిణి కూడా తయారవడం లేదు. అయితే ఈ పరిస్థితుల్లో ఎన్నటికీ మార్పురాదా? మార్పు చేసుకోలేమా? అని ప్రశ్నించుకొంటే, క్రీడల పట్ల ప్రజల, ప్రభుత్వాల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తే తప్పకుండా సాధ్యమేనని చెప్పుకోవచ్చును. ముందుగా ప్రభుత్వాలు ప్రాధమిక విద్యాభ్యాసం స్థాయి నుండే ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలో తప్పనిసరిగా రోజూ క్లాసు పాటాలతో బాటు అన్ని రకాల క్రీడలలో పిల్లలకు శిక్షణ తరగతులు ఉండేలా చట్టాలు చేసి వాటిని ఖచ్చితంగా అమలు చేయాలి. అది డిగ్రీ స్థాయి వరకు తప్పనిసరి అంశంగా అమలు చేయాలి. అంతేకాక మిగిలిన సబ్జెక్టులకు ఏవిధంగా పరీక్షలు నిర్వహించి ఉతీర్ణత నిర్ణయిస్తారో అదేవిధంగా వివిధ క్రీడలలో కూడా పరీక్షలు నిర్వహించాలి. ప్రాధమిక స్థాయి డిగ్రీ వరకు సాగే సుదీర్గ విద్యా ప్రస్థానంలో అనేకమంది మెరికలలాంటి క్రీడాకారులను తయారుచేసుకోవచ్చును. ఈవిధంగా ప్రభుత్వాలు, విద్యా సంస్థలు, తల్లి తండ్రులు అందరూ క్రీడలను ప్రోత్సహించినట్లయితే, వారికి శిక్షణ, క్రీడా సంబంధిత వస్తువుల తయారీ వంటి వాటి ద్వారా దేశంలో పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కూడా సృష్టించుకోవచ్చును. మన రాష్ట్రంలో దేశంలో క్రీడల కోసం చాలా ప్రభుత్వ సంస్థలు పనిచేస్తున్నాయి. కానీ అవన్నీ దేశానికి మెడల్స్ తేగల క్రీడాకారులు తయారుచేయకపోగా రాజకీయనాయకులకి ఉపాధి కేంద్రాలుగా మారిపోయాయి. సమాజంలో ఆకస్మికంగా మార్పులు తేవడం సాధ్యం కాదు గనుక, ప్రభుత్వాలే చొరవ తీసుకొని ప్రాధమిక విద్యా స్థాయి నుండి పిల్లలకు క్రీడలు తప్పనిసరి చేసి, క్రీడల అభివృద్ధికి ఇప్పటి నుండి గట్టి ప్రయత్నాలు మొదలుపెట్టినట్లయితే, మరో రెండు దశాబ్దాల తరువాత నేటి బాలలు మేటి క్రీడాకారులుగా తయారయ్యి, దేశానికి మెడల్స్ తెచ్చే అవకాశం ఉంటుంది.
http://www.teluguone.com/news/content/governments-45-36002.html





