ఆంధ్రప్రదేశ్, తెలంగాణ... బీ కేర్‌ఫుల్!
Publish Date:Jul 16, 2014
Advertisement
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుతున్నాయి. కరెక్ట్... ఈ రెండు రాష్ట్రాలు పోటీ పడటం కరెక్ట్.. ఒక రాష్ట్రాన్ని మించిపోవాలని మరో రాష్ట్రం ప్రయత్నించడమూ కరెక్టే! అయితే ఈ నేపథ్యంలో ఈ రెండు రాష్ట్రాలూ జాగ్రత్తగా వుండాల్సిన అంశం ఒకటుంది! అదేమిటో చెప్పేముందు, పాతకాలం కథను ఓసారి గుర్తు చేసుకోవాలి. ఒక రొట్టె ముక్క కోసం రెండు పిల్లలు గొడవ పడ్డాయట. ఆ రెండు పిల్లుల మధ్యలో చేరిన ఓ కోతిగారు ఎంచక్కా ఆ రెండు పిల్లులకీ జెల్ల కొట్టి ఆ రొట్టెను తాను తినేసిందట. ఈ కథతో పోల్చితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు చెరో పిల్లి అనుకుంటే, మరి ఆ కోతి కేరెక్టర్ ఎవరిది? ఎవరిదో కాదు... కార్పొరేట్ సంస్థలది! అవును, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య వున్న పోటీని క్యాష్ చేసుకోవడానికి కార్పొరేట్ సంస్థలు పథకరచన చేస్తున్నాయి. పలు కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు అటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును, ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ని కలుస్తున్నాయి. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వుందని ఇద్దరికీ చెబుతున్నాయి. మీ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలంటే మాకు ఎలాంటి సౌకర్యాలు, రాయితీలు కల్పిస్తారని ఇద్దర్నీ అడుగుతున్నాయి. సహజంగా సదరు కార్పొరేట్ సంస్థలు తమ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలి, పరిశ్రమలు స్థాపించాలని రెండు రాష్ట్రాలు పోటీ పడటం, ఒకరిని మించి మరొకరు రాయితీలు ఇవ్వాలనుకోవడం జరుగుతుంది. ఇలా రెండు రాష్ట్రాల మధ్య పోటీని క్రియేట్ చేసి తాము లాభం పొందాలని, తమకు ఎవరు ఎక్కువ సదుపాయాలు, రాయితీలు కల్పిస్తే ఆ రాష్ట్రంలోనే పెట్టుబడులు పెట్టాలన్నది కార్పొరేట్ సంస్థల ఎత్తుగడగా కనిపిస్తోంది. మొత్తంమీద ఈ అంశంలో నష్టపోయేది రెండు రాష్ట్రాలే తప్ప కార్పొరేట్ సంస్థలు కాదు. అందువల్ల కార్పొరేట్ సంస్థల వ్యూహంలో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలు నష్టపోకూడదు. అనారోగ్యకరమైన పోటీతో మొదటికే మోసం తెచ్చుకోకూడదు.. అందుకే.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలూ.. బీ కేర్‌ఫుల్!
http://www.teluguone.com/news/content/andhra-pradesh-telangana-corporate-companies-45-35954.html





