చేతికి డబ్బు రాగానే ఈ పనులు చేయండి.. లేకపోతే బాధపడతారు..!
Publish Date:Nov 16, 2026
Advertisement
చేతికి డబ్బు రాగానే ఈ పనులు చేయండి.. లేకపోతే బాధపడతారు..!
జీవితంలో ఒక్కసారిగా చేతికి డబ్బు రాగానే మనుషుల ప్రవర్తన మారిపోతుంటుంది. రాత్రికి రాత్రే సంపాదించడం మొదలుపెట్టిన చాలామంది కొన్నేళ్లలోనే మళ్లీ మొదటికి వస్తుంటారు. కానీ మరికొందరు మాత్రం సాధారణ ఆదాయంతో మొదలుపెట్టినా ధనవంతులు కావడంతో పాటు మానసికంగానూ ఎంతో ప్రశాంతంగా ఉంటారు. నిజానికి డబ్బు అనేది ఒక శక్తి మాత్రమేనని, ఆ శక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే స్పష్టత మనకు ఉంటే జీవితం ఎంతో ప్రశాంతంగా సాగిపోతుందని పెద్దలు, ఆర్థిక సూత్రధారులు అంటుంటారు. డబ్బు చేతికి వచ్చినప్పుడు మనిషి చేయవలసిన కొన్ని పనులు ఉన్నాయి. ఈ పనులు చేస్తే ఆ తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు. అవేంటో తెలుసుకుంటే.. ఇది కూడా చదవండి జీవితంలో డబ్బు, గౌరవం రెండూ కావాలంటే.. ఈ నియమాలు పాటించండి..! మీకు నచ్చవచ్చు మీ దగ్గర డబ్బు నిలవడం లేదా..అసలు కారణాలు ఇవే..!
భవిష్యత్తుకోసం పక్కకు తీయాలి..
మొట్టమొదటి పని డబ్బు రాగానే దాన్ని కాస్త పక్కకు తీసిపెట్టడం. సంపాదన పెరిగిన వెంటనే నా దగ్గర బలం ఉందని, ఇతరులకన్నా తాను మెరుగైన వాడిననే అహంకారం లేదా భద్రతా భావం మనసులో కలుగుతుంటాయి. కానీ డబ్బు అనేది కేవలం ఒక సాధనం మాత్రమే తప్ప అది మనిషి బలంలో భాగం కాదు. ఆదాయం రాగానే ఉప్పొంగిపోకుండా ప్రశాంతంగా ఆలోచించి, అందులో కొంత భాగాన్ని భవిష్యత్తు కోసం వేరు చేసుకోవాలి.
అప్పులు తీర్చాలి..
అప్పు అనేది కేవలం బ్యాంకు ఖాతాలో ఉండే సంఖ్య మాత్రమే కాదు, అది మనిషి మానసిక ఆలోచన, జీవితం మీద పడే బరువైన రాయి. మెడపై అప్పుల భారం ఉన్నంతవరకు మన ప్రతి సంపాదనపై మనకు పూర్తి హక్కు ఉండదు. కొత్త వస్తువులు కొనడం, కోరికలను తీర్చుకోవడం వంటి పనులు చేసే ముందు.. పాత బాకీలు, అప్పులు తీర్చడమే మనిషికి చాలా ఊరట ఇస్తుంది.
నైపుణ్యాలు పెంచుకోవడానికి డబ్బు పెట్టుబడి..
బయటి ఆడంబరాల కోసం, కార్లు , బట్టల కోసం డబ్బును వృధా చేసే బదులు మనల్ని మరింత టాలెంట్ గా చేసేందుకు, మరింత జ్ఞానం పెంచుకునేందుకు, కొత్త స్కిల్స్ పెంచుకునేందుకు డబ్బును పెట్టుబడిగా పెట్టాలి. కొత్త కళలను నేర్చుకోవడం, విజ్ఞాన శాస్త్రాన్ని అధ్యయనం చేయడం, ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడం వంటి విషయాలపై పెట్టే పెట్టుబడి జీవితాంతం ఎన్నో రెట్లు తిరిగి వస్తుంది.
అవసరానికి, వ్యామోహానికి మధ్య ఉన్న తేడాను గుర్తించడం..
కొంచెం డబ్బు రాగానే సమాజం తనను గుర్తించాలని, అందరూ మెచ్చుకోవాలని కొందరు ఆడంబరాలకు పోతుంటారు. తమకు అసలు అవసరం లేని వస్తువులను కొంటూ జీవితకాల సంపాదనను కోల్పోతుంటారు. నిజంగా ధనవంతుడిగా ఉండడానికి, ధనవంతుడిగా కనిపించడానికి చాలా తేడా ఉంది. డబ్బు వచ్చినప్పుడు కాస్త ఆగి ఇది నిజమైన అవసరమా లేక అహంకారమా అని ప్రశ్నించుకుంటే సగం కోరికలు అక్కడికక్కడే తొలగిపోతాయి.
డబ్బు అనేది స్వతహాగా మంచిది కాదు చెడ్డది కాదు, అది కేవలం మన మనసులోని భావాలను ప్రతిబింబించే ఒక అద్దం మాత్రమే. డబ్బు వచ్చినప్పుడు ఉప్పొంగిపోకుండా, పోయినప్పుడు కుంగిపోకుండా సమభావాన్ని అలవర్చుకోవాలి. డబ్బును మన తలపై ఎక్కించుకోకుండా, దానిని ఒక చక్కటి సాధనంగా ఉపయోగించుకుంటూ ముందుకు సాగితే జీవితం ఎంతో ఆనందమయం అవుతుంది.
*రూపశ్రీ.
http://www.teluguone.com/news/content/got-money-in-your-hands-35-237188.html




