గౌతమ్‌రెడ్డి మృతికి దిగ్భ్రాంతి.. జగన్, చంద్రబాబు సంతాపం..
Publish Date:Feb 21, 2022
Advertisement
ఏపీ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్తుగా మరణించడం పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తొలినాళ్ల నుంచీ సుపరిచితుడైన యువనాయకుడు గౌతమ్రెడ్డి అని, మంత్రివర్గ సహచరుడిని కోల్పోవడం మాటల్లో చెప్పలేనంత బాధగా ఉందని సీఎం జగన్ సంతాపం వెలిబుచ్చారు. గౌతమ్ రెడ్డి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని జగన్ తెలిపారు. గౌతమ్ రెడ్డి మృతదేహాన్ని సందర్శించేందుకు జగన్ కాసేపట్లో హైదరాబాద్ బయల్దేరి వెళ్తున్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మృతి తనను కలచివేసిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత చదువులు చదివిన, ఎంతో భవిష్యత్ ఉన్న గౌతమ్ రెడ్డి మృతి బాధాకరం అని ఆయన దిగ్భ్రాంతి వ్యవక్తం చేశారు. గౌతమ్ రెడ్డి మృతి బాధాకరమని అన్నారు. మంత్రివర్గం లో మృదు స్వభావిగా, హుందాగా వ్యవహరిస్తూ గౌతమ్ రెడ్డి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారని అన్నారు. గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకు చంద్రబాబు తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మంత్రి గౌతంరెడ్డి హఠాన్మరణం తనను తీవ్రంగా కలచి వేస్తోందని డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ ఆవేదన వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి వంటి యువనేత ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానని అన్నారు. తమ సహచరుల్లో సీఎం జగన్ కు ఎంతో ఇష్టమైన, సన్నిహితుడైన గౌతమ్ రెడ్డి రాష్ట్ర పారిశ్రామిక, నైపుణ్యాభివృద్ధికి ఎనలేని కృషి చేశారన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి విశేషంగా పెట్టుబడులు, మంచి పేరు ప్రఖ్యాతులు, అవార్డులు తీసుకురావడం వెనక గౌతమ్ రెడ్డి విశేష కృషి ఉందని ధర్మాన గుర్తు చేసుకున్నారు. గౌతమ్ రెడ్డి లేని లోటు ఎవరూ తీర్చలేనిదని, ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రగాఢ సానుభూతి తెలిపారు. గౌతమ్ రెడ్డి వ్యాయామాలు కఠినంగా చేసేవారని గుర్తుచేసుకున్నారు. గౌతమ్ రెడ్డి వివాద రహితుడని, ఆయన ఇక లేరన్న వార్త చాల బాధ కలిగించిందని టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్రెడ్డి విచారం వ్యక్తం చేశారు. గౌతమ్ రెడ్డి తనకు బంధువు అని సోమిరెడ్డి చెప్పారు. గౌతమ్ రెడ్డి వివాద రహితుడని సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి హఠాన్మరణంతో ఆయన అభిమానులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. నెల్లూరు జిల్లా అత్మకూరులోని గౌతమ్ రెడ్డి కార్యాలయం వద్ద విషాదఛాయలు అలముకున్నాయి. తమ అభిమాన నేత ఇకలేరని ఆత్మకూరులో అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్‌టీపీ అధినేత్ర షర్మిల, ఆమె తల్లి విజయమ్మలు.. హైదరాబాద్‌లో మేకపాటి కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.
http://www.teluguone.com/news/content/cm-jagan-and-chandrababu-condolances-25-132053.html





