ఏపీలో అల్పపీడనం.. 5 రోజులు వర్షాలు
Publish Date:May 14, 2026
Advertisement
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రానున్న ఐదు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం తెలిపింది. ఈ నెల 16వ తేదీ నాటికి నైరుతి రుతుపవనాలు అండమాన్ నికోబార్ దీవులకు చేరుకోవడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడనున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. తీవ్ర అల్పపీడనానికి అనుబంధంగా సుమారు 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొన్న వాతావరణ శాఖ.. ఈ అల్పపీడనం నుంచి ఉత్తర తమిళనాడు, రాయలసీమ, ఉత్తర అంతర్గత కర్ణాటక మీదుగా దక్షిణ మధ్య మహారాష్ట్ర వరకు 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి విస్తరించి ఉందని వెల్లడించారు. ఈ వాతావరణ పరిస్థితుల ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రానున్న ఐదు రోజుల పాటు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ముఖ్యంగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చిరికలు జారీ అయ్యాయి. రైతులు, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు కోతకు సిద్ధంగా ఉన్న పంటలను రక్షించుకోవాలని, ధాన్యం తడవకుండా గోదాముల్లో నిల్వ చేయాలని వాతావరణ శాఖ సూచించింది. సముద్రం అల్లకల్లోలంగా మారే అవకాశం ఉండటంతో, మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లే విషయంలో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు.
http://www.teluguone.com/news/content/five-days-rains-in-andhrapradesh-36-219810.html





