సీమాంధ్ర ప్రజల విజ్ఞతకు పరీక్షగా ఎన్నికలు
Publish Date:Mar 6, 2014
Advertisement
ఇంతవరకు దేశంలో ఏ పెద్ద రాష్ట్రానికి తీసిపోని విధంగా చాలా బలంగా ఉన్నఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం, కాంగ్రెస్, బీజేపీ, సోనియమ్మల పుణ్యమాని రెండు చిన్న రాష్ట్రాలుగా కుచించుకుపోయింది. ఈ తరుణంలో ఉన్నఅరడజను పాత పార్టీలు సరిపోవన్నట్లు, కొత్తగా మరో అరడజను పార్టీలు వచ్చి చేరుతుండటంతో మంది ఎక్కువయితే మజ్జిగ పలుచబడుతుందనట్లు ప్రజల ఓట్లు ఈ పార్టీల మధ్య చీలితే ఎవరికీ పూర్తి మెజార్టీ రాని పరిస్థితి ఏర్పడుతుంది. కొత్తగా పుట్టుకొస్తున్న ఈ పార్టీలన్నీ కేవలం సీమాంద్రాలోనే ఎన్నికల బరిలోకి దిగాలనుకోవడం వలన ఆ ప్రాంతానికి చాలా నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రజల ఓట్లు సినిమా హీరోలు, కులాలు, మతాలు, సమైక్య, విభజన వాదాలు, రాజధాని తదితర అంశాల వారిగా చీలిపోవడం ఖాయం. రాష్ట్ర విభజన మొదలయిన నాటి నుండి కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనను గాలికొదిలేసి తిరగడంతో రాష్ట్రంలో తీవ్ర అస్తవ్యస్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇంతకాలంగా సమైక్య ఉద్యమాలతో, ఇప్పుడు రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన సీమాంధ్రకు ఇప్పుడు మళ్ళీ మొదటి నుండి రాష్ట్ర పునర్నిర్మాణం చేసుకోవలసిరావడం అదనపు భారమే అవుతుంది. ఇటువంటి కీలక సమయంలో ఒకేసారి ఇన్నిపాత,కొత్త పార్టీలు ఉన్న13జిల్లాల ప్రజల ఓట్ల కోసం పోటీలు పడి, వారిని రకరకాల వాదనలతో మభ్యపెట్టి వారి ఓట్లు చీల్చుకొంటే, రాష్ట్ర పరిస్థితి కుక్కలు చించిన విస్తరిలా అవుతుంది. ఈ రాజకీయ పార్టీలు అన్నీ ఎన్నికలలో గెలిచినా, ఓడిపోయినా వాటికెటువంటి నష్టమూ ఉండదు. కానీ, ప్రజలే తీవ్రంగా నష్టపోతారు. ఇప్పుడు ఈ పాత కొత్త పార్టీల మధ్య ప్రజల ఓట్లు చీలడం అనివార్యంగా కనిపించడం చాల ఆందోళన కలిగిస్తోంది. ఒకవేళ ఏ పార్టీకి మెజార్టీ రాకపోతే ఇప్పటికే దైన్య స్థితిలో ఉన్న రాష్ట్రం పరిస్థితి మరింత దయనీయంగా మారుతుంది. సంకీర్ణ రాజకీయాలు, ప్రభుత్వ ఏర్పాటు కోసం యం.యల్యే.ల మద్దతు కోసం బేరసారాలు, తత్ఫలితంగా అస్తిరమయిన ప్రభుత్వం అన్నీ కలిపి సామాన్య ప్రజల బ్రతుకులు మరింత భారం చేయడం ఖాయం. అందువల్ల రానున్న ఎన్నికలు రాజకీయ పార్టీలకు జరిగే పరీక్షగా కాక, సీమాంధ్ర ప్రజల విజ్ఞతకి పెడుతున్న పరీక్షగా భావించి సరయిన పార్టీని, సమర్ధులు, నిజాయితీ పరులయిన నేతలని మాత్రమే ఎన్నుకోవలసి ఉంటుంది. అలాకాదని ఈ పాత కొత్త పార్టీల మధ్య ప్రజలు చీలిపోతే చివరికి నష్టపోయేది వారేనని గ్రహించాలి.
http://www.teluguone.com/news/content/elections-37-30930.html





