రైతు భరోసాకూ శఠగోపమేనా? మాటా, మడమ తిప్పేస్తున్న జగన్!
Publish Date:May 4, 2022
Advertisement
ఏపీ సీఎం జగన్ ఆర్భాటంగా ప్రకటించి ప్రారంభించిన ఒక్కో పథకానికీ మెల్లిమెల్లిగా చెల్లుచీటీ ఇచ్చేస్తున్నారా? అమ్మ ఒడి పథకానికి కండీషన్స్ తో దాదాపు చరమగీతం పాడేసిన జగన్ ఇప్పుడు రైతు భరోసాకూ శఠగోపం పెట్టేయనున్నారా? వైసీపీ గొప్పగా చెప్పుకుంటున్న పథకాలలో రైతు భరోసా ఒకటి. ఏటా రైతు ఖాతాలో పన్నెండున్నర వేలు జమ చేయడానికి ఉద్దేశించిన ఈ పథకానికి ఈ ఏడాది మంగళం పాడేశారంటున్నారు పరిశీలకులు. ప్రతి ఏటా మే నెలలో రైతు ఖాతాలలో సొమ్ములు జమ కావలసి ఉండగా.. ఈ ఏడాది ఈ పథకానికి సంబంధించి ఎటువంటి ప్రస్తావనా ప్రభుత్వం నుంచి రాలేదు. అంటే ఈ నెలలో ఇక రైతు భరోసా సొమ్ములు అందనట్లేనని రైతులు సైతం నిర్ణయానికి వచ్చేశారు. అసలు వాస్తవంగా జగన్ జగన్ రైతు బరోసా కింద ఇచ్చింది ఏడాదికి ఏడున్నరవేలే. కేంద్రం ఇచ్చిన ఆరున్నర వేలను మినహాయించుకుని జగన్ రైతు భరోసా ఇచ్చారు. ఇచ్చిన ఏడున్నర వేలూ కూడా రెండు విడతల్లో ఇచ్చారు. రెండేళ్ల పాటు ఏడాదికి ఏడున్నర వేలు చొప్పున ఇచ్చిన జగన్ మూడో ఏడాది ‘భరోసా’కు హామీ లేదని చెప్పకనే చెబుతున్నారు. వర్తమాన ఆర్థిక సంవత్సరానికి రైతు భరోసా కోసం బడ్జెట్ కేటాయించి, లబ్ధిదారుల ఎంపిక పూర్తి చేసిన జగన్ సర్కార్ ఆ లబ్ధిదారుల జాబితాను మాత్రం రైతు భరోసా కేంద్రాలలో ఇంత వరకూ ప్రదర్శించలేదు. గత నెల 15 నాటికే జాబితా సిద్ధమైనప్పటికీ దానికి ఇంకా ప్రదర్శించక పోవడంతో ఈ ఏడాది రైతు భరోసాపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఉద్యోగుల జాతాలే ఎప్పుడు చెల్లిస్తామన్నదే చెప్పలేని స్థితిలో ఉన్న ప్రభుత్వం.. రైతు భరోసా గురించి ఏం చెప్పగలుగుతుందని పరిశీలకులు అంటున్నారు. ఆర్థిక కష్టాల పేరు చెప్పి ఒక్కో పథకాన్నీ ఆంక్షల చట్రంలో బిగించేసి లబ్ధిదారుల సంఖ్యను తగ్గిచుకునే లక్ష్యంతో ప్రభుత్వం ఉందని అంటున్నారు. అదే దారిలో రైతు భరోసాకు మంగళం పాడేసే ఉద్దేశంతోనే సర్కార్ ఉందని అంటున్నారు. ప్రస్తుతం సర్కార్ ముందున్న పెద్ద గండం ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు చెల్లించడం. అందు కోసమే రమారమి నలుగున్నర కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది. ముందుగా ఈ చెల్లింపులు పూర్తయిన తరువాతనైనా రైతు భరోసా గురించి ఆలోచిస్తుందా అంటే ప్రభుత్వానికి ఆ వెసులు బాటు లేదనీ, వచ్చే నెలలో అమ్మ ఒడి పథకం అమలు వ్యయం తరుముకు వస్తున్నదనీ ఆర్థిక నిపుణులు అంటున్నారు. అమ్మ ఒడి పథకం అమలును ఇప్పటికే వాయిదా వేశారు. అదీ అలాంటిలాంటి వాయిదా కాదు. ఏకంగా ఒక ఏడాది అమ్మఒడికి మంగళం పాడేసేంతగా. అందుకే అమ్మ ఒడి పథకం అమలును మరోసారి వాయిదా వేయలేని అనివార్యతను జగన్ సర్కార్ ఎదుర్కొంటున్నది. అందుకే రైతు భరోసాపై జగన్ ఈ ఏడాది ఇక దృష్టి సారించే అవకాశమే లేదని అంటున్నారు.
http://www.teluguone.com/news/content/jagan-government-to-skip-raithu-bharosa-39-135415.html





