పేలుళ్లతో దద్దరిల్లిన దుబాయ్
Publish Date:Mar 13, 2026
Advertisement
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నగరం శుక్రవారం (మార్చి 13) పేలుళ్లతో దద్దరిల్లింది. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ శబ్దాలతో పేలుళ్లు సంభవించాయి. పేలుళ్ల శబ్దాలు వినిపించగానే భద్రతా సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఘటనాస్థలాలకు చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసులు, అత్యవసర సేవల సిబ్బంది రంగంలోకి దిగారు. ఘటనకు సంబంధించిన వివరాలను అధికారులు సేకరిస్తున్నారు. పేలుళ్లకు గల కారణాలపై ఇప్పటివరకు స్పష్టత రాకపోయినప్పటికీ.. డ్రోన్ దాడులే కారణమని భావిస్తున్నారు. భద్రతా సంస్థలు ఘటనపై దర్యాప్తు ప్రారంభించాయి. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, పరిస్థితి పూర్తిగా నియంత్రణలో ఉందని అధికారులు తెలిపారు. కాగా మీడియా కథనాల ప్రకారం దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ డీఐఎఫ్సీ వద్ద డ్రోన్ దాడి యత్నాన్ని గాలిలోనే భద్రతా బలగాలు అడ్డుకున్నాయి. డోన్ ను గాల్లోనే పేల్చాశారనీ, అయితే దాని శకలాలు ఒక భవనంపై పడటంతో నష్టం వాటిల్లిందని దుబాయ్ మీడియా పేర్కొంది. ఇలా ఉండగా నగరంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని అధికారులు స్పష్టం చేశారు. ఘటన జరిగిన వెంటనే షేక్ జాయెద్ రోడ్డు వైపు నుంచి సైరన్ల మోత వినిపించింది. దుబాయ్ పోలీసులు వెంటనే ఆ ప్రాంతాన్ని తమ అధీనంలోకి తీసుకున్నారు. నష్టం స్వల్పమేనని అధికారులు చెబుతున్నారు. అయితే డ్రోన్ శకలం పడిన భవనం బాగా దెబ్బతిందని తెలుస్తోంది. కాగా.. గురువారం కూడా దుబాయ్‌లోని అల్ బదా ప్రాంతంలో డ్రోన్ దాడి జరిగింది.
http://www.teluguone.com/news/content/dubai-rocked-by-explosions-36-215413.html





