వైఎస్ వారసత్వం అంటే ఒక కులంపై వేధింపులు.. సాధింపులేనా?
Publish Date:Aug 8, 2025
Advertisement
ఇరవై ఏళ్ల యుద్ధానికి తెరపడింది. ఇది చూడడానికి ఒక సంస్థపై యుద్ధమే అయినా, దీని వెనుక రాజకీయం, కులం కారణాలు ఉన్నాయి. రాష్ట్రంలో ప్రజల్ని ప్రభావితం చేయగలిగే ఒక వ్యక్తి, ఒక పత్రికపై పరోక్షంగా, ప్రత్యక్షంగా జరిగిన దాడి. రాష్ట్రంలో విపరీతమైన ప్రజాభిమానం, విశ్వాసం ఉన్న పత్రిక, దానిని నిర్వహిస్తున్న యజమాని రామోజీరావుగారి మీద జరిగిన కక్షసాధింపు చర్య. సామాన్య, మధ్యతరగతి ప్రజల విశ్వాసం చూరగొన్న మార్గదర్శి ఫైనాన్షియర్స్ పై దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన హయాంలో ఫిర్యాదులు చేయించి, ప్రభుత్వం చేత కేసులు వేయించారు. దేశంలో ఎన్నో ఫైనాన్స్ కంపెనీలు, డొల్ల కంపెనీలు నడుస్తుంటే, ఈ సంస్థపైనే కేసు వేయడానికి కారణం రాజకీయమే. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని బలపరుస్తున్న సామాజికవర్గాన్ని, దానికి మూలస్తంభం లాంటి వ్యక్తి ఆర్థిక మూలాలు దెబ్బకొడితే రాష్ట్రంలో తనకు ఎదురు ఉండదని భావించారేమో! నిమేష్ కంపానీని కూడా అలాగే కేసులు పెట్టి బెదరించే పరిస్థితి రావడంతో, ఆయన అమెరికా వెళ్లి, అక్కడ నుంచి రిలయెన్స్ ద్వారా రామోజీ గ్రూప్ సంస్థలకు నిధులు సమకూర్చారు. అయితే డిపాజిటర్లకు తిరిగి చెల్లింపులు చేసే అవకాశం లేకుండా ప్రభుత్వం కక్ష గట్టి, ఆఫీసులోని చెక్కుబుక్కులు, రశీదు పుస్తకాలతో సహా మొత్తం డాక్యుమెంట్లన్నీ ట్రక్కుల కొద్దీ అప్పటి సీఐడీ అధికారుల చేత దాటవేయించారు. ఈ చర్య డిపాజిటర్లకి నష్టం అని ఆలోచన లేకుండా వైఎస్ ప్రభుత్వం వ్యవహరించింది. 2015లో ఉమ్మడి హైకోర్టులో కేసు కొట్టివేసినా, మళ్లీ సుప్రీంలో కేసు వేశారు. అయితే సుప్రీం కోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టులోనే తేల్చుకోవాలని చెప్పింది. తాజాగా ఈ కేసును కొట్టివేశారు. అప్పట్లో ఈ వ్యవహారంపై అసెంబ్లీలోనూ చర్చ జరిగింది. ఎక్కడైనా డిపాజిటర్లు కంపెనీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. కానీ మార్గదర్శి విషయంలో డిపాజిటర్లు కంపెనీ కోసం అనుకూలంగా ఉద్యమించారు. రాజశేఖరరెడ్డి శకం ముగిశాక, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ఆయన కూడా అదే ఒరవడిలో కక్షసాధింపు చర్యలకు పాల్పడ్డారు. రాష్ట్రంలో చట్టబద్ధత లేని చిట్ ఫండ్ కంపెనీల జోలికి పోకుండా, ఆయన మార్గదర్శి చిట్ ఫండ్స్ పై కేసులు పెట్టించి, ఏడాది పాటు ఆంధ్రప్రదేశ్ లో ఆ కంపెనీ వ్యాపారాన్ని స్తంభింపచేశారు. రిజిష్ట్రార్ లను ఆఫీసులపైకి తనిఖీలకు పంపి, వారి చేత కేసులు పెట్టించి, సీఐడీ ద్వారా దర్యాప్తు పేరుతో వేధింపులకు పాల్పడ్డారు. ముగ్గరు మార్గదర్శి మేనేజర్లను, ఒక ఆడిటర్ ను అరెస్టు చేసి హడావుడి చేశారు. చివరకు హైదరాబాద్ లో వృద్ధాప్యంతో మంచం మీద ఉన్న రామోజీరావుగారిని అరెస్టు చేయడానికి ఆయన ఇంటి చుట్టూ పోలీసుల్ని మోహరించారు. అయితే సకాలంలో తెలంగాణ ప్రభుత్వం స్పందించి, అండగా నిలిచింది. ఒక్క రోజైనా ఆయన్ను జైలులో పెట్టాలన్న జగన్ సంకల్పానికి బ్రేక్ పడింది. అవినీతి కేసులో జైలుకెళ్ళిన జగన్, ప్రత్యర్థుల్ని జైలులో పెడితేగానీ, తన ప్రతిష్టకు కలిగిన భంగం తొలుగుతుందనుకున్నారేమో మొత్తానికి ఆయన దుందుడుకు చర్యలకు వెంటనే వచ్చిన ఎన్నికల్లో ఓటమే ఆయన్ని కట్టడి చేసింది. మొత్తం మార్గదర్శిపైనా, రామోజీరావుగారిపైనా జరిగిన ఈ వేధింపులు , కేవలం ఒక సామాజికవర్గంపైనా, ప్రత్యర్థి తెలుగుదేశంపైనా జరిగిన రాజకీయ కక్ష సాధింపుగానే సాధారణ ప్రజలు సైతం అర్ధం చేసుకున్నారు. రాజకీయాల్లో అధికారాన్ని వారసత్వంగా కోరుకోవడం సహజం. కానీ తెలుగు రాష్ట్రంలో కక్ష పూరిత రాజకీయాలు వారసత్వం కావడం దురదృష్టకరం.
2006లోనే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చేత రిజర్వ్ బ్యాంకుకు, అప్పటి కేంద్ర ఆర్థిక మంత్రి చిదంబరంకు ఫిర్యాదు చేయించారు. 2008లో రాష్ట్రప్రభుత్వమే కేసు కట్టింది.
వేలాది మంది డిపాజిటర్లలో ఒక్కరూ ఫిర్యాదు చేయలేదు. పరోక్షంగా కొందరిపై ఒత్తడి చేసినా ఎవరూ పట్టించుకోలేదు. అదీ ఆ కంపెనీపై ఉన్న విశ్వసనీయత. అయినా ప్రభుత్వమే కేసు వేయడంతో.. ఈ వ్యాపారాన్ని ఉపసంహరించుకోదలచిన మార్గదర్శి, డిపాజిట్ దారులకు వారి నగదు వాపసు చేయడానికి సిద్ధమైంది. అయితే ఆ ప్రయత్నంలోనూ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం అడుగడుగునా అడ్డుపడింది. రామోజీ గ్రూపు సంస్థల నిధులు సేకరించడానికి కొన్ని యూనిట్లు విక్రయానికి పెట్టినా.. బ్లాక్ స్టోన్ వంటి కంపెనీని బెదరించి వెనక్కుపోయేలా చేసింది రాజకీయమే.
http://www.teluguone.com/news/content/does-ys-legacy-mean-harassment-on-a-caste-39-203765.html





