టీమ్ ఇండియా.. పదేళ్ల నాటి ప్రతీకారం తీర్చుకుంటుందా?
Publish Date:Mar 1, 2026
Advertisement
టీ20 ప్రపంచ కప్ సూపర్-8లో భాగంగా ఆదివారం (మార్చి 1) టీం ఇండియా ఇవాళ అత్యంత కీలకమైన మ్యాచ్ ఆడనుంది. సాయంత్రం 7 గంటల నుంచి కోల్ కత్తా వేదికగా భారత్, వెస్టిండీస్ తో తలపడనుంది. ఇరు జట్లకూ ఇది డూ ఆర్ డై మ్యాచ్ కావడంతో ఫలితంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ పోరులో గెలిచిన జట్టు సెమీస్ కు చేరితే.. ఓడిన జట్టు ఇంటి బాట పడుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్ తన టైటిల్‌ను నిలబెట్టుకునే క్రమంలో ఈ మ్యాచ్ తప్పనిసరిగా గెలవాలి. ఇదే సమయంలో పదేళ్ల క్రితం వెస్టిండీస్ చేతిలో ఎదురైన పరాభవానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం భారత్‌కు దక్కింది. సరిగ్గా పదేళ్ల క్రితం టీ20 వరల్డ్ కప్ 2016లో భారత్, విండీస్ జట్లు ముఖాముఖి తలపడ్డాయి. నాడు భారత్ వేదికగా జరిగిన సెమీఫైనల్‌లో భారత జట్టును ఓడించి.. వెస్టిండీస్ ఫైనల్‌కు వెళ్లి కప్పు కొట్టింది. సరిగ్గా పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ అదే భారత గడ్డపై.. ఇరుజట్లూ తలపడనున్నాయి. సెమీస్ బెర్తు కోసం జరుగుతున్న ఈ పోరులో విండీస్‌ను ఓడించి పాత పగను తీర్చుకోవాలని సూర్యకుమార్ యాదవ్ సేన పట్టుదలగా ఉంది. అయితే టీ20 ప్రపంచ కప్ చరిత్రలో ఈ రెండు జట్ల మధ్య 4 మ్యాచులు జరగ్గా.. వెస్టిండీస్ 3 సార్లు, భారత్ ఒక్కసారి (2014లో) మాత్రమే విజయం సాధించింది. ఈ రికార్డు టీమిండియాను కాస్త టెన్షన్ పెడుతున్నది. ఇక ఇవాళ మ్యాచ్ జరుగుతున్న ఈడెన్ గార్డెన్స్ స్టేడియం టీమిండియాకు బాగా కలిసొచ్చిన మైదానం. ఇక్కడ కరేబియన్ జట్టుతో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ భారతే విజయం సాధించింది. మరోవైపు ఈ మైదానం విండీస్ జట్టుకు ఎంతో ప్రత్యేకమైనది. ఈ స్టేడియంలో వారు ఆడిన మూడు ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించారు. ఈ కీలక పోరులో రింకు సింగ్ జట్టులోకి తిరిగి రావడం భారత్‌కు పెద్ద బూస్ట్అప్ అని చెప్పవచ్చు. వెస్టిండీస్ హిట్టర్లను అడ్డుకోవాలంటే భారత బౌలర్లు శ్రమించక తప్పదు. మరి.. భారత జట్టు పదేళ్ల నాటి పగను తీర్చుకుంటుందా లేదా అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది.
పొట్టి ప్రపంచ కప్ కాకుండా ఓవరాల్ గా టీ20 రికార్డులను పరిశీలిస్తే మాత్రం భారత్‌దే పైచేయిగా ఉంది. ఇప్పటివరకు ఇరు జట్ల మధ్య జరిగిన 30 అంతర్జాతీయ టీ20ల్లో ఇండియా 19 సార్లు, వెస్టిండీస్ 10 సార్లు గెలిచింది. ఒక మ్యాచ్ ఫలితం తేలలేదు.
http://www.teluguone.com/news/content/do-or-die-match-between-team-india-and-windies-36-214837.html





