నెహ్రూ కనుసైగ చేస్తే బెజవాడ... కేకవేస్తే కంకిపాడు దాసోహం
Publish Date:Apr 17, 2017
Advertisement
కృష్ణాజిల్లా రాజకీయాల్లో దేవినేని నెహ్రూది బలమైన ముద్ర. బెజవాడ రాజకీయాలనైతే ఆయన శాసించారు. ఒకవిధంగా చెప్పాలంటే నెహ్రూ కనుసైగ చేస్తే బెజవాడ... కేకవేస్తే కంకిపాడు దాసోహమైపోయేవి. ప్రత్యర్ధుల్ని ఉలిక్కిపడేలా చేసేది. మూడున్నర దశాబ్దాలపాటు తన మాటలతో, చేతలతో బెజవాడ రాజకీయాలను శాసించారు. కొత్త తరం లీడర్లు పుట్టుకొచ్చినా, బెజవాడపై నెహ్రూ పట్టు మాత్రం తప్పలేదు. నెహ్రూను ఢీకొట్టాలంటే వెనుకంజ వేసేవారు. అంతలా బెజవాడపై పట్టుసాధించారు దేవినేని నెహ్రూ. తెలుగునాట రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించిన తెలుగుదేశం పుట్టుక సమయంలోనే దేవినేని నెహ్రూ పొలిటికల్ కెరీర్ కూడా మొదలైంది. యంగ్ ఏజ్‌లో ఉన్న దేవినేని నెహ్రూ... చాలా చురుగ్గా ఉండేవారు. స్టూడెంట్ యూనియన్ రాజకీయాల్లో అత్యంత కీలకంగా వ్యవహరించేవారు. దేవినేని గాంధీ, నెహ్రూ, బాజీ, మురళి కలిసి 1978-79ల్లో 100మంది కుర్రాళ్లతో ఏర్పాటుచేసిన యూనియన్ అనేక సంచలనాలకు కేంద్రమైంది. అదే సమయంలో కొత్తగా పుట్టుకొచ్చిన తెలుగుదేశం పార్టీలో చేరి, అటు కృష్ణాజిల్లా రాజకీయాలను, ఇటు బెజవాడ పాలిటిక్స్‌ను ఏలారు నెహ్రూ. మొదట్నుంచీ దూకుడుగా ఉండే దేవినేని నెహ్రూ... అదే దూకుడును రాజకీయాల్లోనూ కొనసాగించారు. పైగా నెహ్రూకి గుండెధైర్యం ఎక్కువ. ఎంతటి వితప్కర పరిస్థితినైనా తట్టుకుని నిలబడగల దమ్మూధైర్యం నెహ్రూకి ఉండేది. కళ్ల ముందే సోదరుడ్ని హత్య చేసినా తట్టుకుని దిగమింగుకునే గుండె ధైర్యం ఆయన సొంతం. ప్రతికూల పరిస్థితుల్లోనూ నిలదొక్కుకుని, నిలబడగల సత్తా నెహ్రూది. యువకుడిగా ఉన్నప్పుడు ఎంత దూకుడుగా ముందుకెళ్లారో, వయసు పెరుగుతున్నకొద్దీ అంతే నిబ్బరంగా అడుగులేసుకుంటూ వెళ్లారు. అంతేకాదు నెహ్రూలో ఆత్మవిశ్వాసం అధికంగా ఉండేది. అందుకే నెహ్రూ ఏ పార్టీలో ఉన్నా బెజవాడ రాజకీయాలపై పట్టు మాత్రం సడలేది కాదు. అది దేవినేని నెహ్రూ సత్తా.
http://www.teluguone.com/news/content/devineni-nehru-death-45-74014.html





