నకిలీ ఈచలాన్ లింకులతో సైబర్ మోసాలు!
Publish Date:Dec 24, 2025
Advertisement
నకిలీ ఈ-చలాన్ చెల్లింపు లింకుల ద్వారా జరుగు తున్న సైబర్ మోసాలపై హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీసులు ప్రజలను అప్రమత్తం చేశారు. మీ వాహనానికి ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నాయి అంటూ సైబర్ నేరగాళ్లు ఎస్ఎమ్ఎస్, వాట్సాప్ సందేశాల ద్వారా నకిలీ లింకులు పంపిస్తూ ప్రజలను మోసగిస్తున్నారని హెచ్చరించారు. ఈ నకిలీ లింకులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్లను పోలి ఉండే విధంగా ఉండటంతో.. చాలామంది అవి నిజమైనవని నమ్మి క్లిక్ చేసి మోసపోతున్నారని పేర్కొన్నారు. ఆ నకిలీ లింక్ పై క్లిక్ చేసిన తర్వాత వాహన రిజిస్ట్రేషన్ నంబర్ నమోదు చేయాలని, ఆ తరువాత చెల్లించాల్సిన మొత్తం చూపించి వెంటనే చెల్లింపు చేయాలని ఒత్తిడి చేస్తున్నారని వెల్లడించారు. చెల్లింపు చేసిన వెంటనే బాధితుల మొబైల్ ఫోన్లలో మాల్వేర్ ఇన్‌స్టాల్ కావడం, బ్యాంకింగ్ వివరాలు హ్యాక్ కావడం జరుగుతోందని సైబర్ క్రైమ్ పోలీసులు తెలిపారు. తెలిపారు. దీని వల్ల బాధితుల ఖాతాల నుంచి అనధికార లావాదేవీలు జరిగి భారీగా డబ్బు నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సైబర్ క్రైమ్ పోలీసులు పేర్కొన్నారు. ట్రాఫిక్ చలాన్ల చెల్లింపులు ప్రభుత్వ అధికారిక వెబ్‌సైట్ల ద్వారా మాత్రమే చేయాలని, ఎస్ఎమ్ఎస్ లు, వాట్సాప్ లేదా సోషల్ మీడియా ద్వారా వచ్చే అనుమానాస్పద లింకులపై ఎట్టి పరిస్థితు ల్లోనూ క్లిక్ చేయవద్దని హెచ్చరించారు. ప్రభుత్వ శాఖలు వ్యక్తిగత సందేశాల ద్వారా చెల్లింపు లింకులు పంపవని స్పష్టం చేశారు. ఇలాంటి సైబర్ మోసాలకు గురైన బాధితులు వెంటనే తమ మొబైల్ డేటా లేదా వై-ఫైని నిలిపివేయాలని, బ్యాంకును సంప్రదించి కార్డులు లేదా లావాదేవీలను బ్లాక్ చేయించుకోవాలని సూచించారు. అలాగే సైబర్ క్రైమ్ హెల్ప్‌లైన్ 1930కు కాల్ చేయడంతో పాటు, www.cybercrime.gov.in వెబ్‌సైట్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
http://www.teluguone.com/news/content/cyber-fraud-with-fake-echallan-links-36-211510.html




