లాకర్ రూమ్‌లో 18 గంటలు బంధీ.. బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యంతో వృద్ధుడికి నరకం..
Publish Date:Mar 29, 2022
Advertisement
బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యం ఓ వృద్ధుడి ప్రాణాలతో చెలగాటమాడింది. లోపల ఎవరైన ఉన్నారో లేదో చెక్ చేసుకోకుండానే.. లాకర్ రూమ్‌కు తాళం వేసి ఇంటికెళ్లిపోయారు. 18 గంటల పాటు ఆ తాళం వేసిన లాకర్ గదిలోనే ఉండిపోయాడు జూబ్లీహిల్స్‌కు చెందిన 84 ఏళ్ల కృష్ణారెడ్డి అనే వ్యాపారి. రాత్రంతా ఇటు కుటుంబ సభ్యులు.. అటు పోలీసులు తీవ్ర టెన్షన్ పడ్డారు. ఎట్టకేళకు ఉదయం కృష్ణారెడ్డిని లాకర్ రూమ్‌లో నుంచి బయటకు తీసుకొచ్చారు. సినిమాటిక్‌గా జరిగిన ఈ ఉదంతం.. బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తోంది. సిబ్బంది పనితీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జూబ్లీహిల్స్‌లోని యూనియన్ బ్యాంక్‌లో జరిగిందీ ఘటన. జూబ్లీహిల్స్‌కు చెందిన వ్యాపారి కృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం 4 గంటల 20 నిమిషాలకు బ్యాంకులోని లాకర్ రూమ్‌లోకి వెళ్లారు. అయితే, ఆయన తన లాకర్ చెక్ చేసుకుంటుండగానే.. బ్యాంకు సిబ్బంది ఆయన్ను గమనించకుండా లాకర్ రూమ్‌ను మూసివేశారు. తాళం వేసి వెళ్లిపోయారు. దీంతో లాకర్ రూమ్‌లోనే కృష్ణారెడ్డి రాత్రంతా ఉండాల్సి వచ్చింది. కట్ చేస్తే.. రాత్రైనా ఇంకా ఇంటికి రాలేదంటూ కృష్ణారెడ్డి ఫ్యామిలీ మెంబర్స్ టెన్షన్ పడ్డారు. ఆయనకేమైనా జరిగిందేమోనని ఆందోళన చెందారు. వ్యాపారి కావడంతో ఎవరైనా ఏదైనా ప్రమాదం తలపెట్టారేమోననే భయమూ కలిగింది. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కృష్ణారెడ్డి కోసం గాలింపు మొదలుపెట్టారు. ఎంతకీ ఆయన ఆచూకీ ట్రేస్ కాలేదు. ఆయన సెల్‌ఫోన్ సిగ్నల్ కూడా చిక్కలేదు. ఈ లోపు తెల్లారిపోయింది. ఉదయం మళ్లీ ఫ్రెష్‌గా దర్యాప్తు మొదలుపెట్టారు పోలీసులు. కృష్ణారెడ్డి సోమవారం సాయంత్రం బ్యాంక్‌కి వెళ్లారనే సమాచారం తెలియడంతో అక్కడి సీసీటీవీ ఫూటేజ్ చెక్ చేశారు. బ్యాంక్‌లోకి వెళ్లినట్టు విజువల్ ఉన్నా.. మళ్లీ బయటకు తిరిగొచ్చిన దృశ్యాలు మాత్రం కెమెరాలో రికార్డు కాలేదు. అంటే, బ్యాంక్‌లోనే ఏదో జరిగుంటుందనే కోణంలో మరింత సమగ్రంగా విచారించారు. చివరాఖరికి బ్యాంకు లాకర్ రూమ్‌లోని సీసీఫూటేజీలో కృష్ణారెడ్డి కనిపించారు. వెంటనే లాకర్ గది తాళాలు తెరిపించి.. ఆయన్ను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఆయన బాగా నీరసంగా ఉన్నారు. ఎందుకైనా మంచిదని వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. అలా సోమవారం సాయంత్రం 4:20 నుంచి మంగళవారం ఉదయం 10:30 వరకు.. దాదాపు 18 గంటల పాటు.. లాకర్ రూమ్‌లో ఒంటరిగా, భయం భయంగా గడిపారు కృష్ణారెడ్డి. చుట్టూ ఇనుప లాకర్లు మినహా ఏమీ కనిపించదు. ఎలాంటి శబ్దాలూ వినిపించవు. ఎవరూ కనిపించరు. ఓ వైపు ఆకలి, దప్పిక.. ఇంకోవైపు గుండెదడ. బ్యాంక్ సిబ్బంది నిర్లక్ష్యానికి.. పాపం 84 ఏళ్ల వయసులో.. రాత్రంతా ఆయన ఎంత నరకం అనుభవించారో.
http://www.teluguone.com/news/content/customer-locked-in-bank-locker-room-25-133652.html





