చైతన్యరథంతో ఎన్టీఆర్ సంచలనం.. ఆ వాహనం ప్రత్యేకతలు ఇవే.. ఇప్పుడు ఎక్కడ ఉందంటే..
Publish Date:Mar 29, 2022
Advertisement
అది ఎన్టీఆర్ ప్రభంజనం. వెండితెర వేల్పు.. ప్రజల మధ్యకు వచ్చిన సంచలనం. ఆ రాముడే కదిలొచ్చినట్టు.. ఆ కృష్ణుడే దిగొచ్చినట్టు.. ఆ ఆజానుబాహుడు ఎన్టీవోడు ప్రజాక్షేత్రంలోకి తరలివచ్చారు. అహంకారపూరిత పాలనకు చెరమగీతం పాడేందుకు.. తెలుగుజాతి ఆత్మగౌరవ నినాదంతో.. టీడీపీని స్థాపించి.. పసుపు జెండా చేతపట్టి.. చైతన్యరథమెక్కి చరిత్ర సృష్టించారు. ఆనాడు ఆయన నాటిన ఆ పార్టీ విత్తనమే.. మహావృక్షమై.. 40 ఏళ్లుగా తెలుగుజాతి నిండు గౌరవాన్ని సంరక్షిస్తూ వస్తోంది. గెలుపు-ఓటములతో సంబంధం లేకుండా.. అప్రతిహాతంగా.. ఆనాటి అన్న గారి చైతన్యరథంలా దూసుకుపోతోంది. చైతన్యరథం. ఎన్టీఆర్ ప్రచార రథం. ఎన్టీవోడు ఆ రథాన్ని అథిరోహించి.. జైత్రయాత్ర చేపడితే.. తనయుడు హరికృష్ణ రథసారధియై.. తండ్రిని కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆ ద్వయం.. చైతన్యరథం.. దిగ్విజయం. పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారంలోకి వచ్చి సంచలనం సృష్టించింది టీడీపీ. అలాంటి ఘనత కేవలం ఎన్టీఆర్‌కే సాధ్యం. ఓ వాహనానికి ప్రాణం పోసి.. రాజకీయ సంకల్పం చేసి.. చైతన్య రథంగా మార్చిన ఘనత తారక రామారావుదే. ఇప్పుడైతే అలాంటి వెహికిల్స్ కామనే కానీ.. అప్పట్లో అదో ఆసక్తికరం. ప్రజల్లో రాజకీయ చైతన్యాన్ని నింపిన చైతన్య రథం. షెవర్లే కంపెనీకి చెందిన 1940 మోడల్ వ్యాన్ అది. ఆ వాహనం గురించి అప్పటిదాకా ఎవరికీ పెద్దగా తెలియదు. తమిళ హీరో, మాజీ సీఎం ఎంజీ రామచంద్రన్ ఆ వ్యాన్‌ను వాడుతుండేవారు. 1982లో టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్.. ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో.. ఉన్న తక్కువ సమయంలో రాష్ట్రమంతా చుట్టేయాలని భావించడంతో.. ప్రచారానికి అనువుగా ఉంటుందని ఎంజీఆర్ నుంచి ఆ షెవర్లే వాహనాన్ని కొన్నారు. అప్పటి వరకూ అది కేవలం ఓ వ్యాన్ మాత్రమే. ఎన్టీఆర్ చేతికొచ్చాక అది చైతన్య రథంగా ప్రాణం పోసుకుంది. ఎంతో ఆకర్షణీయంగా, విశాలంగా, సకల వసతులతో.. ఆ వాహనాన్ని రీమోడల్ చేయించారు ఎన్టీఆర్. ఆ పనులన్నీ హరికృష్ణ దగ్గరుండి చూసుకున్నారు. వ్యాన్‌లో కూర్చునేందుకు ఎత్తైన సీటు, సమావేశం అయ్యేందుకు వీలుగా పొడవైన సోఫా, టాయిలెట్, వ్యాన్ లోపలి నుంచే టాప్ పైకి ఎక్కేందుకు మెట్లు.. ఏర్పాటు చేయించుకున్నారు. ఇప్పటికీ.. సినీ సెలబ్రిటీలు, పొలిటికల్ లీడర్లు వాడే కార్‌వ్యాన్‌లు.. ఆనాటి చైతన్యరథం స్పూర్తితోనే.. అలాంటి డిజైన్‌నే ఫాలో అవుతున్నారు, కాకపోతే కాస్త మోడ్రన్‌గా తీర్చిదిద్దుతున్నారు. అంతే తేడా. ఆ చైతన్యరథంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా వేలాది కిలోమీటర్లు ప్రయాణించారు ఎన్టీఆర్. వేలాది బహిరంగ సభల్లో, ర్యాలీల్లో, కూడల్లో, వీధుల్లో, జనసమూహాల్లో ప్రసంగించారు. ఆ సమయంలో ఎన్టీఆర్‌ను ప్రజలకు అత్యంత సన్నిహితం చేసింది చైతన్యరథమే. ఆ సారధి హరికృష్ణనే. ఇక, ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక చైతన్య రథాన్ని ఆయన ఇంటి ముందే పార్కు చేసి ఉంచేవారు. రామారావు చనిపోయాక హైదరాబాద్, నాచారంలోని రామకృష్ణ స్టూడియోకు తరలించారు. ఇప్పటికీ ఆ వాహనం అక్కడే ఉంది. ఆనాటి చరిత్రకి, సంచలనాలకి, టీడీపీ ప్రభంజనానికి, ఎన్టీఆర్ జ్ఞాపకాలకి సాక్షిగా నిలిచిఉంది.
http://www.teluguone.com/news/content/special-story-on-ntr-chaitanya-ratham-25-133655.html





