చిన్న పిల్లోడు సీఎం సభ అడ్డుకుంటాడా?
Publish Date:Jan 30, 2019
Advertisement
అస్సాంలో జరిగిన ఓ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఓ చిన్నారితో పోలీసులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పౌరసత్వ సవరణ బిల్లుపై పలు రాష్ట్రాల్లో ఆందోళనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజాప్రతినిధుల సభల్లో ఆందోళనకారులు నల్ల చొక్కాలు ధరించి,నల్ల జండాలు చూపుతూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో అస్సాంలో జరిగిన ఓ సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి సర్బానంద సోనొవాల్ బిస్వాంత్ జిల్లాలో ర్యాలీని నిర్వహించారు. నిరసనల నేపథ్యంలో సొనోవాల్ హాజరవుతున్న ఈ కార్యక్రమానికి నల్ల చొక్కాలు వేసుకురావద్దని పోలీసులు ఆంక్షలు విధించారు. ఈ నేపథ్యంలో ఓ మహిళ, మూడేళ్ల తన చిన్నారితో కలిసి ఈ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వచ్చారు. అయితే భద్రతా సిబ్బంది వారిని లోపలికి అనుమతించలేదు. కారణం అడగ్గా.. మీ చిన్నారి నల్ల స్వెట్టర్ వేసుకున్నాడు. దాన్ని విప్పేస్తేనే లోపలికి అనుమతిస్తామని తెలిపారు. అంతేకాక స్వయంగా వారే ఆ చిన్నారి స్వెట్టర్ ను తొలగించే ప్రయత్నం చేశారు. ఈ చర్యకు భయపడిన చిన్నారి ఏడవడం ప్రారంభించాడు. దీంతో ఆ మహిళే తన కుమారుడి స్వెట్టర్ ను విప్పేసింది. ‘నా మూడేళ్ల చిన్నారి నల్ల రంగు స్వెటర్ వేసుకున్నాడు. దీంతో నా కుమారుడిని ఆ సమావేశానికి హాజరుకానివ్వబోమని భద్రతా సిబ్బంది అన్నారు. ఆ స్వెటర్‌ను విప్పేయాలని ఆదేశించారు’ అని ఆ చిన్నారి తల్లి మీడియాకు తెలిపింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. కాగా చిన్నారి పట్ల కఠినంగా వ్యవహరించిన భద్రతా సిబ్బంది తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు . నల్ల రంగును చూస్తేనే పోలీసులు, అధికారులు ఒణికిపోతున్నారంటూ కామెంట్ చేస్తున్నారు. చిన్న పిల్లోడు సీఎం సభ అడ్డుకుంటాడా? అని ప్రశ్నిస్తున్నారు. సర్వత్రా విమర్శలు వెల్లువెత్తడంతో సొనోవాల్ దీనిపై దర్యాప్తు జరపాలని డీజీపీని ఆదేశించారు.
http://www.teluguone.com/news/content/crying-toddler-forced-to-remove-black-jacket-before-assam-cms-rally-39-85608.html





