రుణాలమాఫీకి క్యాబినెట్ ఆమోదంతో ఇరకాటంలో పడిన వైకాపా
Publish Date:Jul 21, 2014
Advertisement
ఇంతవరకు పంట రుణాల మాఫీపై ప్రభుత్వ నిజాయితీని శంకిస్తూ, రైతులలో అనుమానాలు కలిగే విధంగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ నేతలు మాట్లాడుతున్నారు. కానీ ఇప్పుడు చేనేత కార్మికుల రుణాలతో సహా అన్ని రకాల రుణాల మాఫీకి క్యాబినెట్ ఆమోదముద్ర వేయడం ద్వారా ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకొంది. క్యాబినెట్ ముద్ర వేయడం ద్వారా ఇక ఈ అంశంపై రైతులకు ఎటువంటి అనుమానాలకు తావు లేకుండా చేయడమే కాక దీనిపై ప్రభుత్వానికి మరో ఆలోచన కానీ, ఈ జాప్యం వెనుక ఎటువంటి దురుదేశ్యాలు కానీ లేవని విస్పష్టంగా ప్రకటించినట్లయింది. ఈ పరిణామాన్ని ఊహించని వైకాపా ఇప్పుడు ఇరుకునపడింది. నెలరోజులలోగా అన్ని రుణాలను మాఫీ చేయకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తానని తొందరపడి ప్రకటించిన జగన్మోహన్ రెడ్డి, ఇప్పుడు ఇందులో నుండి గౌరవప్రదంగా బయటపడేందుకు మార్గాన్వేషణ చేయక తప్పదు. కానీ ఆ ప్రయత్నం చేయకపోగా వైకాపా నేతలు చంద్రబాబు ఎన్నికలలో చెప్పినట్లు మొత్తం రుణాలు మాఫీ చేయకుండా ఇంటికి లక్షన్నర, డ్వాక్రా సంఘాలకు లక్ష రూపాయలు మాత్రమే మాఫీ చేస్తానని మోసం చేస్తున్నారని అప్పుడే మీడియాకు ఎక్కడం ఆరంభించారు. ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వ లేని పరిస్థితిలో కూడా రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ప్రభుత్వం సాధ్యమయినంత మేర రైతుల రుణాలను మాఫీ చేస్తుంటే, అందుకు వైకాపా సంతోషించకపోగా ప్రభుత్వం హామీని నిలబెట్టుకోవడాన్ని జీర్ణించుకోలేక గగ్గోలు పెడుతోంది. తద్వారా ఈ అంశంపై ప్రభుత్వ చిత్తశుద్ధిని ప్రశ్నిస్తున్న వైకాపా చిత్తశుద్ధి ఏపాటిదో అర్ధం అవుతోంది. పంట రుణాల మాఫీకి మంత్రివర్గం ఆమోదముద్ర వేయడాన్ని రైతులందరూ హర్షిస్తుంటే వైకాపా మాత్రం నిరసించడమే ఆ పార్టీ ప్రత్యేకత. జగన్ తన దుందుడుకుతనంతో వైకాపా ఇదివరకు చాలా సార్లు భంగపడింది. బహుశః ఈ రుణాలమాఫీ వ్యవహారంలో కూడా మరోమారు భంగపాటు తప్పదేమో!
http://www.teluguone.com/news/content/crop-loans-45-36218.html





