రుణమాఫీకి మంత్రివర్గం ఆమోదముద్ర
Publish Date:Jul 21, 2014
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన ఈరోజు జరిగిన రాష్ట్ర మంత్రి వర్గ సమావేశంలో కొన్ని ముఖ్యమయిన నిర్ణయాలు తీసుకొన్నారు. పంటరుణాల మాఫీపై అధ్యయనం కోసం వేసిన కోటయ్య కమిటీ సరిగ్గా నిర్దేశిత సమయానికి తన నివేదికను చంద్రబాబుకు సమర్పించడంతో మంత్రివర్గ సమావేశంలో ఈ అంశంపై కూడా లోతుగా చర్చ జరిగింది. 2014, మార్చి31 వరకు రైతులు తీసుకొన్న అన్ని రుణాలను మాఫీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదించింది. దీనివల్ల రుణాల ఊబిలో కూరుకుపోయి విలవిలలాడుతున్న వేలాది మంది రైతులకు ఆ బాధ నుండి స్వేచ్చ దొరుకుతుంది. ప్రతీ ఒక్క కుటుంబానికి లక్షన్నర చొప్పున పంట రుణాలు, బంగారు నగలపై తీసుకొన్న రుణాలను మాఫీ చేసింది. డ్వాక్రా సంఘాలకు రూ.లక్ష రూపాయలు ఋణం మాఫీ చేసింది. కొందరు రైతులు, డ్వాక్రా సంఘాలు ఇప్పటికే రుణాలు తిరిగి చెల్లించినవారున్నారు. అటువంటి వారికి కూడా ఈ రుణమాఫీని వర్తింపజేసి నిజాయితీగా రుణాలు చెల్లించినవారిని ప్రభుత్వం గౌరవిస్తుందని నిరూపించుకొంది. పంట రుణాలతో బాటు చేనేత కార్మికుల రుణాలు కూడామాఫీ చేసేందుకు మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. ప్రస్తుతం ప్రభుత్వమే స్వయంగా ఈ రుణాలన్నిటినీ బ్యాంకర్లకు తిరిగి చెల్లించే పరిస్థితిలో లేకపోయినప్పటికీ, రిజర్వు బ్యాంకు ఈ రుణాలను రీషెడ్యుల్ చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించింది గనుక, బ్యాంకు ఇచ్చిన నిర్దిష్ట గడువులోగా ఆ రుణాలను తిరిగి చెల్లించేందుకు అవసరమయిన నిధుల సమీకరణకు ఒక ప్రత్యేక కమిటీని వేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రుణ మాఫీ కోసం దాదాపు రూ.37,900 కోట్లు అవసరం కాగా దానిలో రూ.25, 000 కోట్లు వరకు నిధులు సమీకరించుకొనేందుకు యఫ్.ఆర్.బీ.యం. చట్టంలో వెసులుబాటు ఉంది గనుక ఆవిధంగా నిధుల సమీకరణ చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రిజర్వు బ్యాంక్ కేవలం 3సం.ల కాలపరిమితికే రుణాలను రీషెడ్యుల్ చేసేందుకు యోచిస్తున్నప్పటికీ, మరో నాలుగు సం.లు పొడిగించమని ఆర్.బీ.ఐ. ను అర్ధించాలని మంత్రివర్గం నిర్ణయించింది. తెదేపా రైతులకు ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఈ రుణాల మాఫీకి మంత్రివర్గం చేత అధికారికంగా ఆమోదముద్ర వేయించడం ద్వారా ఇక దీనిపై ఎటువంటి సందేహాలకు తావు లేకుండా చేసి తన చిత్తశుద్ధి నిరూపించుకొంది. చంద్రబాబు రుణాలు మాఫీ చేస్తున్నట్లు ప్రకటించి చేతులు దులుపుకోకుండా, వాటిని రీ షెడ్యుల్ చేయించడానికి, ఆ రుణాలను ప్రభుత్వమే తిరిగి చెల్లించడానికి అవసరమయిన నిధుల సమీకరణ గురించి కూడా ఆలోచించడం ద్వారా ఈ అంశంపై చాలా దూరదృష్టితో ఆలోచిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
http://www.teluguone.com/news/content/crop-loans-45-36217.html





