ప్రకోపించిన ఓమ్ రౌత్ పైత్యం.. ఆదిపురుష్ లో రావణుడి గెటప్ చూశారా?
Publish Date:Oct 4, 2022
Advertisement
రామాయణంలోని రావణాసురుడు ఎలా ఉంటాడు?.. 'భూకైలాస్', 'సీతారామ కల్యాణం' సినిమాల్లో విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు ధరించిన పాత్ర మాదిరిగా ఉంటాడు. బాపు తీసిన 'సంపూర్ణ రామాయణం'లో మహానటుడు ఎస్వీ రంగారావు తరహాలో ఉంటాడు. మనకు రావణుడంటే.. ఆ సినిమాల్లో కనిపించిన రావణుడే! నుదుటిన శివనామం, తలపై పొడవాటి కిరీటం, భుజాన గద, ఛాతీని కప్పివేసే భారీ ఆభరణాలు, పట్టు ధోవతి.. ఇదీ రావణుని ఆహార్యం! కానీ 'ఆదిపురుష్'లో మనం చూసిన రావణుడు మన ఊహల్లోని రావణునికి పూర్తి భిన్నంగా ఉన్నాడేంటి? పొడవుగా పెరిగిన గడ్డం, లెదర్ జాకెట్! రావణుడు ఇలా ఉంటాడా? రామాయణం ఆధారంగా బాలీవుడ్ డైరెక్టర్ ఓమ్ రౌత్ రూపొందిస్తోన్న చిత్రం 'ఆదిపురుష్'. శ్రీరామునిగా ప్రభాస్, సీతగా కృతి సనన్, రావణునిగా సైఫ్ అలీఖాన్, లక్ష్మణునిగా సన్నీ సింగ్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ చేసిన 'ఆదిపురుష్' టీజర్ చూసిన వాళ్లకి మతిపోయింది. ప్రధానంగా రావణుడు, ఆంజనేయుడి రూపాలు చూసి వాళ్లు షాకైపోతున్నారు. ఇప్పటికే అనేక భారతీయ భాషల్లో రామాయణ గాథ ఆధారంగా పలు చిత్రాలు వచ్చాయి. వాటి వల్ల భారతీయుల హృదయాల్లో సీతారాములు, రావణుడు, ఆంజనేయుల రూపాలు ఎలా ఉంటాయనేది ముద్రించుకుపోయింది. వాటికి భిన్నంగా 'ఆదిపురుష్' మూవీలో రావణుడి ఆహార్యం కనిపించేసరికి అందరూ విస్తుపోతున్నారు. 'భూకైలాస్'లో, 'సీతారామ కల్యాణం'లో రావణాసురునిగా విశ్వవిఖ్యాత నందమూరి తారకరామారావు ఎంతగానో ఆకట్టుకున్నారు. రావణుని క్యారెక్టర్‌కు ఆయన హీరో ఇమేజ్ కల్పించారు. రావణుడు ఇలాగే ఉంటాడనేలా ఆయన రూపం మన మనసుల్లో హత్తుకుపోయింది. అలాగే బాపు రూపొందించిన 'సంపూర్ణ రామాయణం' చిత్రంలో రావణునిగా విశ్వనట చక్రవర్తి ఎస్వీ రంగారావు నటననూ, ఆయన రూపాన్ని మనం మరవగలమా! కానీ లంకేశ్ అనే రావణునిగా 'ఆదిపురుష్' టీజర్‌లో సైఫ్ అలీఖాన్‌ను చూస్తే.. ఇదసలు రామాయణ కథ ఆధారంగా తీస్తున్న సినిమాయేనా, లేక రామాయణాన్ని తన ఇష్టం వచ్చినట్లు మార్చి ఓమ్ రౌత్ సొంత పైత్యం ప్రదర్శిస్తున్నాడా అన్న అభిప్రాయం కలుగుతోంది. 'ఆదిపురుష్' టీజర్ చూశాక.. భారతీయుల జీవితాల్లో ఒక భాగమైన రామాయణాన్నీ, అందులోని పాత్రలనూ తమ ఇష్టం వచ్చిన రీతిలో చూపించడం కరెక్టేనా? అంటూ నెటిజన్లు సామాజిక మాధ్యమం వేదికగా ఓమ్ రౌత్ ను నిలదీస్తున్నారు. ఆ టీజర్‌లో రావణునిగా సైఫ్ అలీఖాన్.. గుబురుగా పెరిగిన పొడవాటి గడ్డం, దగ్గరగా కత్తిరించిన తలపై జుట్టు, ఒంటికి లెదర్‌తో చేసిన జాకెట్ ధరించి, నీలి కళ్లతో కనిపించాడు. పురాణ పురుషుడైన రావణుడు ఎలాంటి దుస్తులు ధరిస్తాడనేది మనకు కచ్చితంగా తెలీకపోవచ్చు కానీ.. ఇప్పటికే పలు సినిమాల ద్వారా ఆయన కాస్ట్యూమ్స్ ఎలా ఉంటాయనేది మన మనసుల్లో ఒక స్థిరమైన ముద్రపడి ఉంది. ఆ ఊహలకు, ఆ నమ్మకాలకు ఏమాత్రం సంబంధంలేని రీతిలో రావణుడిని డైరెక్టర్ ఓమ్ రౌత్ చూపిస్తున్నాడని అర్థమైపోతోంది. అసలాయన ఏ రామాయణ గ్రంథం ఆధారంగా 'ఆదిపురుష్' తీస్తున్నాడో చెప్పాలని అనేకమంది ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నిస్తున్నవారిలో 'కేజీఎఫ్' ఫేమ్ మాళవికా అవినాశ్ కూడా ఉన్నారు. రామాయణాన్ని సరిగా అధ్యయనం చేకుండా 'ఆదిపురుష్'ను తీశారంటూ ఓమ్ రౌత్‌పై ఆమె విరుచుకుపడ్డారు. రీసెంట్‌గా ఓ ట్వీట్‌లో ఆమె, "లంకకు చెందిన రావణుడు శివభక్తుడైన ఓ బ్రాహ్మణుడు. 64 కళల్లో ప్రవీణుడు. వైకుంఠానికి రక్షణగా ఉండే జయ (విజయ) ఓ శాపం కారణంగా రావణునిగా జన్మించాడు. ఇతను (ఆదిపురుష్ లంకేశుడు) టర్కీకి చెందిన నిరంకుశుడు కావచ్చేమో కానీ రావణుడు మాత్రం కాదు! మన రామాయణం/ చరిత్రను తప్పుగా చూపించడాన్ని బాలీవుడ్ మానుకోవాలి. లెజెండ్ ఎన్టీ రామారావు గురించి ఎప్పుడూ వినలేదా?" అని ఆమె రాసుకొచ్చారు. 'ఆదిపురుష్' మూవీ ద్వారా ఓమ్ రౌత్ రామాయణాన్నీ, దాని స్ఫూర్తినీ వక్రీకరిస్తున్నాడని సోషల్ మీడియా ద్వారా పలువురు విమర్శిస్తున్నారు. స్వేచ్ఛ ముసుగులో భారతీయులందరూ ఆరాధించే రామాయణాన్ని వక్రీకరిస్తే ఊరుకొనేది లేదని వారు హెచ్చరిస్తున్నారు. దేశ ప్రజల నాగరికతో ఒక భాగమైన రామాయణాన్ని ఆధారంగా తీసుకొని సినిమా తీస్తున్నప్పుడు చాలా బాధ్యతగా వ్యవహరించాలి కానీ, ఇలా ఇష్టం వచ్చినట్లు ఎలా తీస్తారని ప్రశ్నిస్తున్నారు. కాగా, కోట్లాదిమంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన 'ఆదిపురుష్' టీజర్ రిలీజయ్యాక.. అదసలు లైవ్ యాక్షన్ సినిమాలాగా లేదనీ, ఓ యానిమేషన్ సినిమాలా ఉందనీ అనేకమంది కామెంట్స్ చేస్తున్నారు. వీఎఫ్ఎక్స్ వర్క్ కూడా క్వాలిటీతో లేదనీ, సినిమా ఓ వీడియో గేమ్‌లాగా కనిపిస్తోందనీ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 12న ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
http://www.teluguone.com/news/content/criticism-from-every-corner-on-om-rauth-about-ravana-getup-in-adipurush-39-144878.html





