కొంప ముంచేస్తున్న కరోనా.. కేసులే కేసులు...
Publish Date:Jan 20, 2022
Advertisement
థర్డ్ వేవ్ లో కరోనా మహమ్మారి మరింత ఉగ్రరూపం దాల్చింది. మన దేశంలో ఒక్క రోజులోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 3 లక్షలు దాటేసింది. దేశ వ్యాప్తంగా ఒక్క రోజులో 3 లక్షల 17 వేల 532 పాజిటివ్ కేసులు నమోదవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. అలాగే 24 గంటల్లో కరోనాకు 491 మంది బలైపోయారు. ఈ విషయాలను కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించిన కరోనా బులెటిన్ పేర్కొంది. అంతకు ముందు రోజుతో పోల్చుకుంటే 12 శాతం ఎక్కువగా కొత్తగా కరోనా కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు కూడా 15 శాతం నుంచి 16.41 శాతానికి పెరిగిపోయింది. మన దేశంలో ఇంత వరకు 3 కోట్ల 82 లక్షల మందికి కరోనా సోకింది. 4 లక్షల 87 వేల 693 మంది కరోనా బాధితులు ప్రాణాలు కోల్పోయారు. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కూడా అలజడి రేపుతోంది. దేశంలో ఒమిక్రాన్ కేసుల సంఖ్య కూడా భారీ సంఖ్యలో పెరిగిపోతోంది. దేశంలో ఇప్పటి వరకు 9 వేల 287 ఒమిక్రాన్ కేసులు నమోదవడం గమనార్హం. ఒమిక్రాన్ కూడా కరోనా కేసుల ఉధృతికి కారణం అవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. కరోనా వైరస్ కొద్ది వారాలుగా విస్తరిస్తుండడంతో యాక్టివ్ కేసుల సంఖ్య 19 లక్షలు దాటింది. యాక్టివ్ కేసుల రేటు కూడా 5.03 శాతానికి పెరిగిపోవడం భయపెడుతోంది. మరో పక్కన ప్రపంచ వ్యాప్తంగా కూడా కరోనా కేసులు భారీ సంఖ్యలో నమోదవుతుండడం ఆందోళన కలిగిస్తోంది. బుధవారం ఒక్క రోజులోనే ప్రపంచ వ్యాప్తంగా 34 కోట్ల 63 లక్షల 738 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఒక్క రోజులోనే మొత్తం 8 వేల 832 మందిని కరోనా మహమ్మారి బలి తీసుకుంది. ఇంతవరకు ప్రపంచ వ్యాప్తంగా 33 కోట్ల 92 లక్షల 6వేల 194 మందికి కరోనా సోకింది. మొత్తం 55 లక్షల 83 వేల 295 మంది మరణించారు. ఇలా ఉండగా.. బుధవారం ఒక్క రోజులోనే 2 లక్షల 23 వేల 990 మంది కరోనా నుంచి కోలుకోవడం కొద్దిగా ఊరట కలిగించే అంశం. దేశంలో మొత్తంగా కరోనా నుంచి 3 కోట్ల 58 లక్షల మంది కోలుకున్నారు. కోలుకున్నవారి శాతం 93.69 శాతంగా ఉంది. మరో పక్కన వ్యాక్సినేషన్ నిరంతరాయంగా కొనసాగుతోంది. దేశంలో ఇంతవరకు 159 కోట్ల డోసుల కరోనా వ్యాక్సిన్ పంపిణీ జరిగింది. ఇంత వరకు ప్రికాషనరీ డోసు కూడా 61 లక్షల 75 వేల 49 మందికి పూర్తయింది.
http://www.teluguone.com/news/content/corona-reached-peck-level-in-india-39-130474.html





