మాటలతోనే మెస్మరైజ్.. చేతలపై పట్టింపేది?
Publish Date:Apr 15, 2022
Advertisement
కేసీఆర్ వాగ్దానాల వరదకు సాక్షాత్తూ భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఫిదా అయిపోయారు. న్యాయ వ్యవస్థలో ఏకంగా నాలుగు వేల మూడు వందల ఇరవై ఉద్యోగాలను సృష్టించడం ద్వారా కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారనీ, ఇంటర్నేషనల్ ఆర్బిట్రేషన్ సెంటర్ లాంటిదాన్ని కూడా ఏర్పాటు చేయడం, అందుకు స్థలం, నిధులు కేటాయించడం ద్వారా న్యాయ వ్యవస్థకు కేసీఆర్ నిజమైన మిత్రుడిగా నిలిచారంటూ ప్రశంసల వర్షం కురిపించారు. ఆర్బిట్రేషన్ సెంటర్ కు స్థలం, నిధులు కేటాయించడం సరే.. కొత్తగా నాలుగు వేల ఉద్యోగాల కల్పన హామీకే సీజేఐ ప్రశంసల వర్షం కురిపించేలా ఇంప్రెస్ అవ్వడం మాత్రం కేసీఆర్ మాటల మ్యాజిక్ ఘనతే. ఎందుకంటే... తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును మాటల మాంత్రికుడిగా అందరూ అభివర్ణిస్తుంటారు. ఎప్పటికప్పుడు కొత్త కొత్త వాగ్దానాలతో, విపక్షాలపై సరికొత్త ఆరోపణలు విమర్శలతో కేసీఆర్ గత ఏనిమిదేళ్లుగా చేస్తున్న విన్యాసాలు ఇప్పటి వరకూ ఆయనకూ, ఆయన పార్టీ టీఆర్ఎస్ కు మేలు చేస్తూ వస్తోంది. అయితే గత ఏడాదిన్న కాలంగా మాటల మాంత్రికుడి మాటల మ్యాజిక్ ఒకింత మసక బారుతూ వస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికలు, హుజూరాబాద్ ఉప ఎన్నికల ఫలితాలను ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. విప్లవాత్మకంగా కేసీఆర్ అభివర్ణించి, అటువంటి పథకాన్ని ప్రవేశ పెట్టినందుకు తన భుజాలను తానే చరుచుకున్నదళిత బంధు పథకం కూడా హుజూరాబాద్ లో టీఆర్ఎస్ ను గట్టెక్కించలేకపోవడమే ఇందుకు నిదర్శనంగా పరిశీలకులు విశ్లేషణలు చేస్తున్నారు. అయినా కూడా కేసీఆర్ తన మాటల గారడీనే నమ్ముకున్నాడు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలో హాట్ టాపిక్ గా హీట్ పెంచుతున్న బియ్యం వివాదమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. హస్తినలో బియ్యం ధర్నాలో కేంద్రానికి 24 గంటల అల్టిమేట్ ఇచ్చి.. ఆ గడువు తీరకముందే.. యాసంగి బియ్యం మొత్తం రాష్ట్రమే కొంటుందని నిర్ణయం తీసుకోవడం కేసీఆర్ కే చెల్లు. కేంద్రంలోని మోడీ సర్కార్ ను, అదే సమయంలో రాష్ట్రంలో ప్రతి నిర్ణయం విషయంలో తనతో విభేదిస్తున్న బీజేపీని ఇరుకున పెట్టేందుకే అనూహ్యంగా యాసంగి బియ్యం కొనుగోలు నిర్ణయం తీసుకున్నారన్న విపక్షాల విమర్శలలో వాస్తవం లేకపోలేదు. అయినా సీఎం కేసీఆర్.. వాగ్దానాలు అయితే చేసేస్తారు.. అవి అమలయ్యాయా లేదా అన్న విషయాన్ని పెద్దగా పట్టించుకోరు. ఇందుకు ఈ ఎనిదిమేళ్ల కాలంలో చాలా ఉదాహరణలే చెప్పవచ్చు. తాజాగా ఆయన అసెంబ్లీ సాక్షిగా చేసిన ఉద్యోగ ప్రకటనను తీసుకుంటే... ఇప్పటి వరకూ అందుకు సంబంధించి నోటిఫికేషన్లు వెలువడలేదు. ఆయన ప్రసంగిస్తూ తొలి నోటిఫికేషన్ వెంటనే... అంటే ఆయన ప్రసంగిస్తున్న రోజు సాయంత్రానికే వెలువడుతుందని కూడా చెప్పేశారు. కానీ అది ఆచరణ రూపం దాల్చలేదు. అయినా ఇచ్చేసిన, చేసేసిన వాగ్దానం గురించి కల్వకుంట్ల చంద్రశేఖరరావుగారికి పెద్దగా పట్టింపు ఉండదు. జనం ఆ వాగ్దానం గురించి నిలదీసే అవకాశమే ఇవ్వరాయన. అందుకే ఉద్యోగాల భర్తీ వాగ్దానం నుంచి జనం దృష్టి మళ్లించడానికి ధాన్యం కొనుగోలు వాగ్దానాన్ని తెరమీదకు తీసుకువచ్చారు. తెలంగాణ తొలి సీఎంగా దళితుడు, ప్రతి దళిత కుటుంబానికీ మూడెకరాల భూమి, ఇంటికో ఉద్యోగం.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఆ జాబితా ఎప్పటికీ పూర్తి కాదనిపించేటన్ని వాగ్దానాలు ఈ ఎనిమిదేళ్ల వ్యవధిలో కేసీఆర్ నోటి వెంట వచ్చాయి. ఇప్పుడు న్యాయవ్యవస్థలో నాలుగు వేల పైచిలుకు ఉద్యోగాల హామీపై కేసీఆర్ పై సీజేఐ ప్రశంసల జల్లు కురపిస్తున్నారు. అయితే నోటిఫికేషన్ వెలువడి.. ఆ ఉద్యోగాలు భర్తీ అయ్యేదెన్నడన్న నిరుద్యోగుల సందేహాం మాత్రం నివృత్తి కావడం లేదు.
http://www.teluguone.com/news/content/controversy-over-cji-ramana-comments-on-cm-kcr-39-134431.html





