అనిల్ టార్గెట్ కాకాణినా? జగనా?
Publish Date:Apr 15, 2022
Advertisement
మంత్రి పదవి పోయిన తరువాత తాజా మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రవర్తన వింతగా ఉంది. ఆయన మాటల్లో అసహనం కొట్టొచ్చినట్లు కనబడుతోంది. ఇంతకూ అనిల్ కుమార్ తాజా మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని ఎందుకు టార్గెట్ చేశారు? అసలు అనిత్ కుమార్ టార్గెట్ చేసింది మంత్రి కాకాణినా.. ముఖ్యమంత్రి జగన్ నా?.. అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. మాజీ మంత్రి అనిల్ కుమార్ వైఎస్ జగన్ కు అత్యంత విశ్వాసపాత్రుడు. మూడేళ్ల పాటు మంత్రిగా ఉంటూ ఓ ఊపు ఊపారనే చెప్పాలి. జగన్ కేబినెట్ లో బూతుల మంత్రి జాబితాలో అనిల్ కూడా ఒకరు. చంద్రబాబు, లోకేష్ ను తెగ విమర్శలు చేసిన అనిల్ కుమార్ మంత్రి పదవి పోయిన తరువాత సొంత పార్టీ నేతలపైనే గుస్సా అవుతున్నారు. తాజాగా మీడియా సమావేశం పెట్టి కొత్త మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఒకటికి రెండింతలు రిటన్ గిఫ్ట్ లు ఇస్తా అంటూ విరుచుకుపడ్డారు. సొంత పార్టీ మంత్రిపై అనిల్ చేసిన కామెంట్లు అదిష్టానాన్ని ఇరుకున పెట్టాయంటున్నారు. జగన్ కు వీర విధేయుడిగా చెప్పుకుంటున్న అనిల్ ఇలా మాట్లాడటం వెనుక మంత్రి పదవి పోయిందన్న కోపం బట్టబయలవుతోందంటున్నారు. కొత్త మంత్రి కాకాణిపై అనిల్ కామెంట్స్ చేసిన మరుసటి రోజే.. నెల్లూరు సిటీలో అభిమానులు ఏర్పాటు చేసిన కాకాణి ప్లెక్సీలలను గుర్తు తెలియని వారు తొలగించారు. అయితే ఈ పని అనిల్ వర్గమే చేసిందని కాకాణి మరింత గుస్సాగా ఉన్నారట. ఇదిలా ఉండగా.. గతంలో మాజీ మంత్రి సోమిరెడ్డికి.. కాకాణి గోవర్ధన్ రెడ్డి మధ్య వార్ నడిచింది. అప్పట్లో సోమిరెడ్డికి విదేశాల్లో అక్రమ ఆస్తులు ఉన్నాయని కాకాణి కొన్ని ఆధారాలు బయటకు రిలీజ్ చేశారు. కాకాణి ప్రవేశపెట్టిన ఆధారాలు నకిలీవని సోమిరెడ్డి కేసుపెట్టడంతో ఆ ఆధారాలను కోర్టుకు సమర్పించారు. అయితే.. ఆ ఆధారాలను గుర్తు తెలియని వ్యక్తులు కోర్టు నుంచి చోరీ చేశారనే వార్త గుప్పుమంది. నెల్లూరు 1వ అదనపు జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో చోరీ ఎపిసోడ్ కాకాణిని ఇరుకున పెట్లినట్లు అయిందని అంటున్నారు. అయితే.. కాకాణి మంత్రి అయి వారంరోజులు కూడా కాలేదు. ఇంకా ఆయన జిల్లాకు రానేలేదు. అప్పుడే అనిల్ కామెంట్లు, ప్లెక్సీల తొలగింపు, కోర్టులో ఉన్న కాకాణినికి సంబంధించిన డాక్యుమెంట్లు చోరీ.. ఇదంతా ఓ పక్కా ప్రణాళికతో జరిగి ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ చోరీ ఎవరు చేయించి ఉంటారనేది ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ తతంగం వెనుక కాకాణి పత్యర్దులు ఉన్నారా.. లేక ఆయనే చేయించారా.. లేక కాకాణిని ఇరకాటంలో పెట్టేందుకు మరెవరైనా చేయించారా అనే సందేహాలకు పోలీసు విచారణ మాత్రమే చెక్ పెట్టనుంది. ఏదేమైనా కాకాణిపై అనిల్ తన వ్యాఖ్యలతో కాకాణిని టార్గెట్ చేశారా? లేక మంత్రి పదవి కొనసాగించలేదని జగన్ నే టార్గెట్ చేశారా అంటూ సొంత పార్టీ నేతలే అనిల్ పై సెటైర్లు వేస్తున్నారు.
http://www.teluguone.com/news/content/anil-target-kakani-or-jagan-39-134433.html





