కాంగ్రెస్ మార్క్ రాజకీయాలు
Publish Date:Jan 3, 2014
Advertisement
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ అధిష్టానం రాష్ట్రంలో రెండు ప్రాంతాలలో ఒక వికృత రాజకీయ క్రీడ మొదలుపెట్టింది. అందులో కాంగ్రెస్ నేతలందరూ తమతమ పాత్రలను చక్కగా పోషిస్తూ ప్రజలను మభ్యపెడుతూ 2014 ఎన్నికలలో తమ రాజకీయ భవిష్యత్తును దానితో బాటే పార్టీకి విజయాన్నిసాధించి పెట్టేందుకు రకరకాలుగా యధాశక్తిగా కృషి చేస్తున్నారు. వారిలో అధిష్టానానికి వ్యతిరేఖంగా వ్యవహరించే ముఖ్యమంత్రి, సీమాంధ్ర కేంద్ర మంత్రులు, యంపీలు, యం.యల్.యే.లు. ఉన్నారు. అధిష్టానాన్ని వ్యతిరేఖించడం ద్వారా పార్టీ పట్ల ప్రజలలో ఉన్నవ్యతిరేఖతను ఓట్లరూపంలో క్యాష్ చేసుకోవాలని ప్రయత్నిస్తుంటుంది ఈ గ్రూపు. బహుశః కిరణ్ కుమార్ రెడ్డి సారధ్యంలో ఏర్పడే కొత్తపార్టీని నెంబర్:1 గ్రూపుగా భావించవచ్చును. ఈ గ్రూపుకి అనుబంధంగా వేరే పార్టీలు కూడా పనిచేస్తుంటాయి. అవి ఎన్నికల తరువాత కాంగ్రెస్ పార్టీలో విలీనం అవడమో లేక కలిసి పనిచేయడమో లేక మద్దతు ఈయడమో చేయవచ్చును. ఇక పార్టీలోనే విధేయవర్గం కూడా ఒకటుంది. దీనిని గ్రూప్ నెంబర్:2గా పిలుచుకోవచ్చును. రాష్ట్ర విభజన ప్రభావం తట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో కూడా తమంతట తాము గెలవగలవారు మాత్రమే ఈ గ్రూపు నెంబర్:2లో సభ్యులుగా ఉండేందుకు అర్హులు. ఇక పార్టీలో గ్రూప్ నెంబర్:3 కూడా ఉంది. వీరు పార్టీకి అనుకూలంగా కానీ, వ్యతిరేఖంగా గానీ మాట్లాడరు. కానీ, తెర వెనుక ఉండి పార్టీ వ్యవహారాలు చక్కబెడుతుంటారు. వీరు ఎన్నికలలో చేయకపోవచ్చును. వీరు అందిస్తున్నరహస్య సేవలకి గాను, శాసనమండలి, రాజ్యసభ టికెట్స్ లతో సత్కరించబడతారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణాలో ఎలాగు పూర్తిగా గెలవలేదు గనుక తెలంగాణా కోసం కాంగ్రెస్ అధిష్టానం ప్రత్యేకంగా 50:50 ప్లాన్ సిద్ధం చేసింది. అందులో తెలంగాణా సాధించిన కాంగ్రెస్ ఘనులు, తెరాస నేతలు ఉంటారు. అదృష్టం బాగుండి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి రాగలిగే అవకాశాలు ఉంటే తెరాస మద్దతు ఉంటుంది. లేకుంటే లేదు.
కానీ ఎంత ఫిఫ్టీ ఫిఫ్టీ అనుకొన్నాతెరాస ప్రభావానికి తట్టుకొని నిలబడాలంటే వారికి కొంత బూస్టింగ్ అవసరం ఉంటుంది. అది అందించే భాద్యత మాత్రం పూర్తిగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిదే. ఆయన అప్పుడప్పుడు ఏవో చిలిపి మాటలు మాట్లాడుతూ, చిలిపి చేష్టలు చేస్తుంటే వారందరూ మూకుమ్మడిగా ఆయనపై విరుచుకుపడుతూ తమ తెలంగాణాను ఆయన బారి నుండి కాపాడుకొంటూ, పనిలోపనిగా తమ రేటింగ్ కూడా పెంచుకొంటుంటారు. ఈవిధంగా కాంగ్రెస్ నేతలందరూ ఒకరినొకరు తిట్టుకొంటూ, అధిష్టానాన్నికూడా తిడుతూ, భజన చేస్తూ, కాంగ్రెస్ తోనే పోటీచేస్తూ కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి చాలా కృషి చేస్తున్నారు. వీరి ఐఖ్యత ఎంత గొప్పదో, ఇంత అనైక్యంగా ఏమి సాధించబోతున్నారో తెలుసుకోవాలంటే ఎన్నికలు పూర్తయ్యేవరకు వేచి చూడక తప్పదు మరి.
http://www.teluguone.com/news/content/congress-trade-mark-politics-45-28996.html





