పాక్ వ్యవహారంలో మోడీపై కాంగ్రెస్ విమర్శలు
Publish Date:Aug 21, 2014
Advertisement
భారత ప్రభుత్వ అభ్యంతరాలను లెక్కజేయకుండా డిల్లీలో పాకిస్తాన్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్ కాశ్మీర్ వేర్పాటు ఉగ్రవాదులతో సమావేశం కావడంతో ఆగ్రహించిన భారత ప్రభుత్వం ఈనెల 25న ఇస్లామాబాద్ లో భారత్-పాక్ దేశాల విదేశాంగ శాఖల కార్యదర్శుల సమావేశాన్ని రద్దు చేసుకొంటున్నట్లు ప్రకటించింది. దానిపై పాకిస్తాన్ ప్రతిస్పందన ఏవిధంగానే ఉన్నప్పటికీ, కాంగ్రెస్ పార్టీ స్పందన మాత్రం చాలా దారుణంగా ఉంది. ఆ పార్టీ అధిష్టానానికి ప్రతినిధిగా భావింపబడే మాజీ కేంద్రమంత్రి మనీష్ తివారీ మాట్లాడుతూ, “మోడీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే వాళ్ళకి అసలు విదేశాంగ విధానం అనేది ఉందా..లేదా? అనే అనుమానం కలుగుతోంది. మోడీ ప్రధానిగా బాధ్యతలు చెప్పటక ముందే బీజేపీ పాకిస్తాన్ ప్రధాని నవాజ్ షరీఫ్ ని మోడీ ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించింది. కానీ మూడు నెలలు తిరక్క మునుపే పాకిస్తాన్ తో జరగవలసిన సమావేశాన్ని అర్ధాంతరంగా రద్దు చేసుకొని తన అయోమయ స్థితిని బయటపెట్టుకొంది. ఇది చూస్తే మోడీ ప్రభుత్వానికి ఒక స్థిరమయిన విదేశాంగ విధానం లేదని స్పష్టమవుతోంది. చైనా దేశం భారత సరిహద్దులలోకి చొచ్చుకు వస్తున్నా అది మన భూభాగంలోకి రాలేదని మోడీ ప్రభుత్వమే చైనాను వెనకేసుకు రావడం చూస్తుంటే, మున్ముందు చైనా సేనలు అరుణాచల్ ప్రదేశ్ ను తమదేనని ప్రకటిస్తే మోడీ ప్రభుత్వం దానిని కూడా చైనాకు వదిలిపెడుతుందేమో?” అని విమర్శించారు. పాకిస్తాన్ విషయంలో మోడీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న మనీష్ తివారీ గతంలో తమ యూపీఏ ప్రభుత్వం కూడా పాకిస్తాన్ పట్ల ఇటువంటి కటినంగా వ్యవహరించిన సంగతిని విస్మరించడం చాలా ఆశ్చర్యంగా ఉంది. అయినా పాకిస్తాన్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్ భారత ప్రభుత్వం అభ్యంతరాలను బేఖాతరు చేస్తూ కాశ్మీర్ వేర్పాటువాదులతో ఏకంగా దేశ రాజధాని డిల్లీలోనే సమావేశమయితే, దానిని తీవ్రంగా ఖండించాల్సిన కాంగ్రెస్ పార్టీ, మోడీ ప్రభుత్వం పాకిస్తాన్ తో చర్చలు రద్దు చేసుకొంది గనుక మోడీ ప్రభుత్వానికి సరయిన విదేశాంగ విధానం లేదంటూ విమర్శించడం చాలా దారుణం. ఇక చైనా చొరబాట్ల విషయంలో మనీష్ తివారీ చేసిన విమర్శలు కూడా చాలా దారుణంగా ఉన్నాయి. ఇటీవల బ్రిక్స్ దేశాల సమావేశాల సందర్భంగా నరేంద్ర మోడీ చైనా ప్రధానితో మొట్టమొదటి సారిగా సమావేశమయినపుడు, ఆయన ఎటువంటి దొంక తిరుగుడు లేకుండా నేరుగా చైనా చొరబాట్ల గురించి, సరిహద్దు వివాదాల గురించి మాట్లాడిన సంగతి బహుశః కాంగ్రెస్ పార్టీ మరిచిపోయిందేమో? భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి దేశాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ అనుసరించిన లోపభూయిష్టమయిన విదేశాంగ విధానాల కారణంగానే నేడు కాశ్మీరులో సగభాగాన్ని కోల్పోవలసి రావడమే కాక, దానిని ఉగ్రవాదులకు అడ్డాగా మారినా చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవలసి వస్తోంది. కాంగ్రెస్ పార్టీ అనుసరించిన లోపభూయిష్టమయిన విదేశాంగ విధానాల కారణంగానే నేడు నేపాల్, శ్రీలంక వంటి చిన్న దేశాలకి భారత్ అంటే అలుసయిపోయింది. ఆ కారణంగానే మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ప్రాణాలు కోల్పోయారు. ఆ కారణంగానే రాహుల్, సోనియా గాంధీలకు కూడా ప్రాణభయం పట్టుకొంది. చైనా, పాకిస్తాన్ దేశాలు రెండూ సరిహద్దుల వెంబడి రోడ్లు, రైలు మార్గాలు నిర్మించుకొంటున్నా ఇన్నేళ్ళుగా చేతులు ముడుచుకొని కాంగ్రెస్ పార్టీ చూస్తూ కూర్చొంటే, మోడీ అధికారం చెప్పట్టిన రెండు నెలల వ్యవధిలోనే సరిహద్దుల వెంబడి రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఇదివరకు నరేంద్ర మోడీ కూడా ఈ రెండు దేశాల వ్యవహారాలలో యూపీఏ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. బహుశః అందువల్లే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదేవిధంగా వ్యవహరిస్తోందనుకోవలసి ఉంటుంది. చైనా, పాకిస్తాన్ వంటి సమస్యాత్మక దేశాలతో వ్యవహరిస్తున్నపుడు, పార్టీలకు అతీతంగా అందరూ భారతప్రభుత్వానికి అండగా నిలబడి మద్దతుగా మాట్లాడితే హుందాగా ఉంటుంది.
http://www.teluguone.com/news/content/congress-45-37474.html





