బాబుగారి మీటింగా? అయ్యబాబోయ్!!
Publish Date:Aug 21, 2014
Advertisement
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి నిర్విరామంగా కృషి చేస్తున్నారు. ఏపీ అభ్యున్నతి కోసం ఆయన చేస్తున్న కృషిని చూసి ఆంధ్రప్రదేశ్ ప్రజలు సంతోషిస్తున్నారు. అంతా బాగానే వుందిగానీ, చంద్రబాబుతో చిన్న చిక్కొచ్చిపడిందని తెలుగుదేశం ఎమ్మెల్యేలు లబోదిబో అంటున్నారు. పరిపాలనలో భాగంగా చంద్రబాబు నాయుడు విరివిగా మీటింగ్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఆ మీటింగ్స్‌కి సంబంధిత ఎమ్మెల్యేలను, మంత్రులను పిలుస్తున్నారు. చంద్రబాబుతో మీటింగ్ అనగానే మొదట్లో ఎమ్మెల్యేలు చాలా ఉత్సాహంగా వెళ్ళారు. ఆ తర్వాత గానీ వాళ్ళకి చంద్రబాబు మీటింగ్స్ పవర్ అర్థంకాలేదు. గంట కాదు.. రెండు గంటలు కాదు.. మూడు గంటలు కాదు... ఏకంగా నాలుగేసి, ఐదేసి గంటలు బాబు మీటింగ్స్ నిర్వహిస్తూ వుండటంతో వాళ్ళకి బుర్రలు వాచిపోతున్నాయని తెలుస్తోంది. ఇప్పుడు చంద్రబాబు మీటింగ్స్ పేరు చెబితేనే టీడీపీ నాయకులు ఉలిక్కిపడుతున్నారు. మొన్నామధ్య చంద్రబాబు ఎమ్మెల్యేలతో మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ నాలుగుగంటలు ఏకబిగిన సాగింది. అలాగే ఎంపీలతో ఓ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆ మీటింగ్ ఐదు గంటల పాటు సా.....గింది.. ఈ మీటింగ్స్‌లో నాలుగైదు గంటలపాటు చంద్రబాబు నాన్ స్టాప్‌గా మాట్లాడారట. ఈ టైమంతా ఎమ్మెల్యేలు, ఎంపీలు చంద్రబాబు గారికి చెవులు అప్పగించి కూర్చున్నారు. చంద్రబాబు మీటింగ్ పేరుతో గంటలకు గంటలు భారీ స్థాయిలో క్లాసులు తీసుకుంటూ వుండటంతో ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎలిమెంటరీ స్కూలు విద్యార్థుల మాదిరిగా చప్పుడు చేయకుండా కూర్చోవడం మినహా మరేమీ చేయలేకపోతున్నారట. మీటింగ్ పూర్తయిన తర్వాత బయటికొచ్చి బతుకుజీవుడా అని ఊపిరి పీల్చుకుంటున్నారట. ఇవేం మీటింగ్స్‌రా దేవుడా అని సణుక్కుంటున్నారట. అయితే బాబు మీటింగ్స్ మీద తమ ఆవేదనను ఆయనకే డైరెక్ట్‌గా చెప్పలేక కుమిలిపోతున్నారట. తాను ఏర్పాటు చేస్తున్న భారీ మీటింగ్స్ విషయంలో చంద్రబాబు నాయుడు పునరాలోచించుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది. మీటింగ్స్ అనేవి అవసరమే.. కానీ నాలుగైదు గంటలపాటు మీటింగ్స్ పెట్టినందువల్ల పరిస్థితి రివర్స్ అయ్యే డేంజరుంది. ఇలాంటి భారీ మీటింగ్స్ వల్ల టైమ్ వేస్ట్ తప్ప ప్రయోజనం ఏమీ వుండదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సూక్ష్మంలో మోక్షం అన్నట్టుగా చిన్న చిన్న మీటింగ్స్‌తో పెద్ద ప్రయోజనాలు సాధించడం మంచిదనేది ఒక సూచన. అలాగే చంద్రబాబుకు అద్భుతమైన విజన్ వుంది.. ఏ విషయంలో అయినా క్లారిటీ వుంది. బంగారు పళ్ళానికైనా గోడచేర్చు కావాలని అన్నట్టుగా ఆ విజన్‌కి, క్లారిటీకి తోడుగా పార్టీలోని సమర్థులైన వ్యక్తుల నుంచి కూడా సలహాలు, సూచనలు తీసుకుంటూ చంద్రబాబు ముందుకు వెళ్తే మంచి ఫలితాలు వస్తాయి.
http://www.teluguone.com/news/content/ap-cm-chandrababu-meetings-tdp-leaders-tension-45-37461.html





