యాదాద్రి పర్యటనకు కేసీఆర్.. దేవాలయ అభివృద్ధి పనుల పురోగతిపై పరిశీలన
Publish Date:Dec 17, 2019
Advertisement
నేడు యాదాద్రిలో పర్యటించనున్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. దేవాలయ అభివృద్ధి పనులను పర్యవేక్షించడానికి సీఎం స్వయంగా యాదాద్రికి వెళ్లనున్నారు. పర్యటనలో భాగంగా ఉదయం 11 గంటలకు గుట్టకు చేరుకుంటారు. బాలాలయంలో స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం పునర్ నిర్మాణం పరిసరాల అభివృద్ధి పనుల పురోగతిని పరిశీలించనున్నారు. ఉత్తరాయణ పుణ్యకాలంలో ఉద్ఘాటన ముహుర్తం నిర్ణయిస్తామని ఆగస్టు 17 న పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. కనీవినీ ఎరుగని రీతిలో మహా సుదర్శన నారసింహ యాగం నిర్వహిస్తామని తెలిపారు. ఆలయ నిర్మాణానికి సంబంధించి సలహాలు సూచనలు ఇచ్చారు. ప్రధాన ఆలయం లోపల బయట ఆ మేరకు పనులు జరిగాయా లేదా అని నేడు పరిశీలించనున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ వైదిక, ఆగమశాస్త్రాల ప్రకారం లోపాలను క్షుణ్ణంగా పరిశీలించి అవకాశాలున్నట్లు అధికారులు చెబుతున్నారు. దాదాపు 100 ఎకరాల్లో 1000,108 యజ్ఞ కుండాలతో మహాసుదర్శన యాగ క్రతువుకు అనువైన స్థలంగా గండి చెరువు ప్రాంతాన్ని ఎంపిక చేశారు. ఆ ప్రాంతం అక్కడికి చేరుకునే రహదారుల ఎంపిక దేశ విదేశాల నుంచి వచ్చే మాఠాధిపతులు పీఠాధిపతులుతో పాటు ఆధ్యాత్మిక గురువులకు బస వసతి ఏర్పాట్లను స్వయంగా పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్య అతిథులకు ఉద్దేశించిన ప్రెసిడెన్షియల్ సూట్ నిర్మాణ పురోగతి భక్తులకు ప్రయాణ వసతి ఏర్పాట్లను పరిశీలించనున్నారు. కొండ చుట్టూ నిర్మాణంలో ఉన్న ఆరు వరుసల రహదారి పురోగతి నిర్వాసితుల పునరావాసం తదితర అంశాలపైనా ఆరా తీసే అవకాశాలున్నాయి. ఆలయ ఉద్ఘాటన మహాసుదర్శన యాగం ఏర్పాట్ల పై అధికారులకు దిశా నిర్దేశం చేస్తారని భావిస్తున్నారు. కాగా ఉద్ఘాటనకు ముహూర్తం పై చిన జీయర్ స్వామితో సంప్రదింపులు జరిపి తుది నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని ఆలయ వర్గాలు చెబుతున్నాయి.
http://www.teluguone.com/news/content/cm-kcr-to-visit-yadadri-temple-39-92278.html





